వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డిపై నమోదైన సీబీఐ, ఈడీ కేసుల విచారణలను రోజువారీగా చెపట్టాలని తెలంగాణ హైకోర్టు ఆదేశించింది. జగన్‌పై నమోదైన సీబీఐ, ఈడీ కేసులను రోజువారీ విచారణ చేపట్టి తేల్చేసేలా హైదరాబాద్ సీబీఐ కోర్టుకు ఆదేశాలివ్వాలంటూ హరిరామజోగయ్య తెలంగాణ హైకోర్టును ఆశ్రయించారు. ఈ పిటిషన్ ను ఎన్నికలకు ముందే దాఖలు చేయగా… విచారణ జరిపిన హైకోర్టు.. జగన్ కేసులను రోజువారీ విచారణ చేపట్టాలని ఆదేశించింది.
అక్రమాస్తుల కేసుల్లో మొత్తం 20 చార్జిషీట్‌లు దాఖలు..
జగన్ క్విడ్ ప్రోకోకు పాల్పడ్డారని పేర్కొంటూ హైకోర్టు ఆదేశాల మేరకు సీబీఐ, ఈడీలు మొత్తం 20 చార్జిషీట్‌లు దాఖలు చేశాయి. ఈ కేసులపై సీబీఐ కోర్టులో గత 12 ఏళ్లుగా విచారణ కొనసాగుతూనే ఉంది. ఆయా చార్జిషీట్ల నుంచి తమను తప్పించాలని కోరుతూ జగన్, విజయసాయిరెడ్డి సహా ఇతర నిందితులు దాఖలు చేసిన 130 డిశ్చార్జి పిటిషన్‌లపై తీర్పు వెల్లడి కాలేదు. తీర్పు చెప్పాల్సిన రోజున జడ్జి బదిలీ అయ్యారు. ఈ కారణంగా మళ్లీ మొదటి నుంచి కేసులను తాజా సీబీఐ కోర్టు జడ్జి వింటున్నారు.