అమరావతి, ఆంధ్రప్రభ: బంగాళాఖాతంలో ఏర్పడిన మిచౌంగ్ తుపాన్ ప్రభావం ఏపీ విమాన సర్వీసులపై పడింది. తుపాన్ ప్రభావం అంతకంతకూ బలపడుతూ ఏపీ తీర ప్రాంతంవైపు దూసుకొస్తున్న నేపథ్యంలో విశాఖ నుంచి చెన్నై.. గన్నవరం విమాన సర్వీసులకు అంతరాయం కలిగింది. విశాఖ నుంచి వివిధ ప్రాంతాలకు వెళ్లే ఐదు విమాన సర్వీసులను ఇండిగో సంస్థ రద్దు చేసింది.
సోమవారం విశాఖ నుంచి చెన్నై వెళ్లాల్సిన ఇండిగో విమానం (6ఈ-845) వాతావరణం సరిగా లేనందున రద్దయ్యింది. అలాగే విశాఖ నుంచి హైదరాబాద్ వెళ్లాల్సిన ఇండిగో విమానం (6ఈ-574) సర్వీసును రద్దు చేశారు. ఇక విశాఖ నుంచి హైదరాబాద్ వెళ్లాల్సిన ఇండిగో విమానం (6ఈ-881) రద్దయ్యింది. అలాగే విశాఖ నుంచి విజయవాడ వెళ్లాల్సిన ఇండిగో విమానం (6ఈ-7063) రద్దు చేసినట్లు ఇండిగో ఎయిర్ లౖన్స్ ప్రకటించింది.
విశాఖ నుంచి చెన్నై వెళ్లాల్సిన ఇండిగో విమానం (6ఈ-6089) కూడా రద్దు చేసినట్లు ఇండిగో తెలిపింది. ఇదిలా ఉంటే తిరుపతి, విజయవాడ నుంచి ఇతర ప్రాంతాల సర్వీసులు కొన్ని ఆలస్యంగా నడుస్తున్నాయి. ఇంకొన్ని విమానాలను దారి మళ్లిస్తున్న పరిస్థితి నెలకొంది.
రేణిగుంట అంతర్జాతీయ విమానాశ్రయానికి ఉదయం రావలసిన స్పైస్ జెట్, ఇండిగో, ఎయిర్ ఇండియా, విమానాలను వర్షం కారణంగా దారి మళ్లించారు. దీంతో ప్రయాణీకులు కొంత ఇబ్బందిని ఎదుర్కొన్నారు. విమాన సర్వీసులు రద్దుకావడంతో కొందరు ప్రయాణీకులు ప్రత్యామ్నాయ మార్గాల్లో తమ గమ్య స్థానాలకు చేరుకుందుకు ప్రయత్నం చేస్తున్నారు. తుఫాన్ ప్రభావం తగ్గిన తరువాత విమాన సర్వీసులు రీ షెడ్యూలు చేస్తామని ఇండిగో సంస్థ ప్రకటించింది.