Tuesday, December 3, 2024

Cyclone – తడ సమీపంలో తీరం దాటిన వాయుగుండం

అమరావతి: బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం తీరం దాటింది. నెల్లూరు జిల్లా తడ సమీపంలో తీరం దాటిన వాయుగుండం ప్రస్తుతం తీవ్ర అల్పపీడనంగా బలహీనపడొచ్చనే అంచనాలున్నాయి. గడిచిన 6 గంటలుగా 22 కిలోమీటర్ల వేగంతో వాయుగుండం తీరాన్ని తాకిందని వాతావరణ శాఖ వెల్లడించింది. దీని ప్రభావంతో వర్షాలు పడుతాయని అధికారులు తెలిపారు.

వాయుగుండం ప్రభావంతో ఉత్తర తమిళనాడులో భారీ వర్షాలు కురుస్తాయని తెలిపారు. అదేవిధంగా దక్షిణ కోస్తా, రాయలసీమ జిల్లాల్లో భారీ వర్షాలు కురస్తాయని, మిగిలిన ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వానలు కురిసే అవకాశముందన్నారు..

రాయలసీమ లో భారీ వర్షాలు

ఇక నెల్లూరు, ప్రకాశం, చిత్తూరు, తిరుపతి, అన్నమయ్య, వైఎస్సార్ కడప, అనంతపురం, శ్రీసత్యసాయి జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని భావిస్తున్నారు.

- Advertisement -

కోస్తాంధ్రలోని నెల్లూరు, ప్రకాశం, గుంటూరు జిల్లాల్లో ఆకస్మిక వరదలు వచ్చే ప్రమాదముందని తెలిపారు. చిత్తూరు, వైస్సార్‌ జిల్లాల్లో వాగులు, వంకలు ఆకస్మిక వరదలతో పొంగిపొర్లుతాయని వెల్లడించారు.

తమిళనాడు, దక్షిణ కోస్తాంధ్ర జిల్లాల తీరప్రాంతాల్లో 45 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు వీస్తాయని ఐఎండీ వెల్లడించింది. మధ్యాహ్నం వరకూ తీరం అలజడిగానే ఉంటుందని తెలిపింది.

మూడో నంబరు ప్రమాద హెచ్చరికలు

కృష్ణపట్నం, నిజాంపట్నం, మచిలీపట్నం వరకు పోర్టులకు మూడో నంబరు, కాకినాడ, గంగవరం, విశాఖపట్నం, కళింగపట్నం పోర్టులకు అధికారులు ఒకటో నంబరు హెచ్చరికలు జారీ చేశారు.

.విశాఖ, శ్రీకాకుళం, విజయనగరం జిల్లాల్లో సముద్రపు అలలు 1.5 మీటర్ల ఎత్తున ఎగసిపడతాయని ఐఎండీ తెలిపింది. అదేవిధంగా ఉభయగోదావరి, కృష్ణా, గుంటూరు, ప్రకాశం, నెల్లూరు జిల్లాల్లో అలలు ఎగసిపడతాయని వెల్లడించింది. హార్బర్‌ ఆపరేషన్లు అత్యంత జాగ్రత్తతో నిర్వహించాలని హెచ్చరించింది. మత్స్యకారులు వేటకు వెళ్లకూడదని సూచించింది

Advertisement

తాజా వార్తలు

Advertisement