కర్నూలు బ్యూరో : ఆన్లైన్ మోసాలు పెచ్చు మీరుతున్నాయి. ఒకరు ఆధార్ పేరిట టోకరా వేస్తుండగా. మరొకరు బ్యాంకు ఖాతా, ఓటిపి పేరిట మోసాలకు పాల్పడుతున్నారు. ఇదే కోణంలో తాజాగా కర్నూల్ నగరంలో పోస్టల్ శాఖలో పనిచేస్తున్న ఓ యువకుడు ఏటీఎంలకు వచ్చే వ్యక్తుల వద్ద నగదు మార్పిడి పేరుతో టోకరా వేస్తున్న వైనం వెలుగు చూసింది. దీంతో మోసాని గుర్తించిన స్థానికులు అతన్ని పట్టుకొని పోలీసులకు అప్పగించారు.
ఆదివారం వెలుగు చూసిన సంఘటన వివరాలు ఇలా ఉన్నాయి.కర్నూలు మండల పరిధిలోని తాండ్రపాడు గ్రామానికి చెందిన కార్తీక్ స్థానికంగా పోస్టల్ శాఖలో ప్రభుత్వ ఉద్యోగిగా పనిచేస్తున్నారు. అయితే అతను క్రికెట్, మరికొన్ని ఆన్లైన్ బెట్టింగ్ వ్యసనాలకు అలవాటు పడ్డాడు. ఈ క్రమంలో చేతిలో ఉన్న డబ్బంతా ఆన్లైన్ బెట్టింగ్‌లో పొగొట్టుకున్నాడు. ఉద్యోగం ద్వారా వచ్చే జీతం కూడా బెట్టింగులకే ఖర్చు పెట్టేవాడు. చేతిలో ఉన్న సొమ్మంతా ఆన్లైన్ వ్యసనాలతో పోవడంతో ఇక ఏం చేయాలో తెలియక కొత్త మోసానికి తెర తీశాడు.
ఏటీఎంల వద్ద ఉంటూ అక్కడికి వచ్చే వారిని గమనించేవాడు. వారి దగ్గరకి వెళ్లి తనకు అర్జెంటుగా నగదు క్యాష్ అవసరమని.. నగదు చేతికి ఇస్తే ఫోన్ పే ద్వారా ట్రాన్స్ఫర్ చేస్తానని ఆవలి వ్యక్తులను నమ్మించేవాడు. ఇది నమ్మిన వ్యక్తులు అతడికి నగదు అప్పగించేవారు. ఇక కార్తీక్ ఫేక్ ఫోన్‌పే ద్వారా డబ్బులు పంపించినట్లు మేసేజ్ చూపించి అక్కడి నుంచి ఉడాయించేవాడు.
ఈ క్రమంలోనే కార్తీక్ కర్నూలు నగరంలోని ఎస్బీఐ మెయిన్ బ్రాంచ్ ఏటీఎం వద్ద ఉండి అక్కడికి వచ్చిన ఓ వ్యక్తి వద్ద నుంచి .రూ.10000 నగదు తీసుకొని .. ఫోన్ పే ద్వారా వేస్తానని చెప్పి నకిలీ ఫోన్ పే ద్వారా మెసేజ్ పంపి మోసం చేశాడు.
అయితే ఎంతకి డబ్బు రాకపోవడంతో కార్తీక్ ను స్థానికులు పట్టుకున్నారు. జరిగిన విషయంపై ఆరా తీశారు. దీంతో అతని డొంక మొత్తం కదిలింది. జరిగిన విషయంలో ఒప్పుకోక తప్పలేదు. ఇదే మొదటిసారి అంటూ స్థానికులతో చెబుతూ అక్కడి నుంచి పారిపోయే ప్రయత్నం చేశాడు. అయితే స్థానికులు కార్తికను పట్టుకుని కర్నూల్ రెండో పట్టణ పోలీసులకు అప్పగించారు.
పోలీసులు తమదైన స్థాయిలో విషయంపై ఆరా తీయగా కార్తీక్ గత కొంతకాలంగా ఇలా చేస్తున్నట్లు సమాచారం.
ఆన్లైన్ మోసాల పట్ల జాగ్రత్త
అపరిచితులకు డబ్బులు, ఫోన్లు ఇచ్చే విషయంలో జాగ్రత్తగా ఉండాలని కర్నూల్ రెండో పట్టణ సీఐ నాగరాజు సూచిస్తున్నారు. ఎవరైనా ఇలాంటి మోసాలకు పాల్పడితే తమకు సమాచారం ఇవ్వాలన్నారు. స్థానికుల ఫిర్యాదు మేరకు కర్నూలు రెండో పట్టణ పోలీస్ స్టేషన్లో కార్తీక్ పై కేసు నమోదు చేశామన్నారు. కేసు దర్యాప్తులో ఉందన్నారు. నిందితుని పూర్తిస్థాయిలో విచారించి అసలు విషయాలు నిగ్గు తెలుస్తామన్నారు.