అమరావతి, ఆంధ్రప్రభ: పోలవరం ప్రాజెక్టు వల్ల ఎలాంటి ముంపు ఏర్పడే అవకాశమే లేదనీ, పొరుగు రాష్ట్రాల అనుమానాలను పూర్తిస్థాయిలో సాంకేతికంగా నివృత్తి చేసేందుకే ఉమ్మడి సర్వే చేయించేందుకు నిర్ణయించినట్టు- కేంద్ర జలసంఘం (సీడబ్ల్యూసీ) స్పష్టం చేసింది. ఈ మేరకు కేంద్ర ప్రభుత్వానికి నివేదిక అందించింది. పోలవరం ముంపుపై తెలంగాణతో పాటు- ఒడిసా, చత్తీస్‌గఢ్‌లు సుప్రీంకోర్టులో దాఖలు చేసిన వ్యాజ్యాల విచారణ సందర్భంగా ఉమ్మడి సర్వే నిర్ణయాన్ని తెలియ జెయడంతో పాటు- ఇప్పటివరకు పోలవరంపై చేసిన వివిధ సంస్థల అధ్యయనాలను క్రోడీకరించి నివేదికను కూడా అందించనున్నట్టు- తెలిపింది. పోలవరం ముంపుపై ఉమ్మడి సర్వే అవసరమే లేదని సీడబ్ల్యూసీ గతంలో అనేకసార్లు స్పష్టం చేసింది. పొరుగు రాష్ట్రాలు సుప్రీంకోర్టును ఆశ్రయించిన నేపథ్యంలో అనేకసార్లు ఏపీతో సహా తెలంగాణ, చత్తీస్‌గఢ్, ఒడిసా జలవనరుల శాఖ ఉన్నతాధికారులతో సమావేశాలు నిర్వహించి ముంపుపై ఉన్న అపోహలను తొలగించేందుకు సీడబ్ల్యూసీ ప్రయత్నించింది. సీడబ్ల్యూసీ వివరణలతో ఆయా రాష్ట్రాలు సంతృప్తి చెందకపోవటంతో గతనెల 25న నిర్వహించిన సమావేశంలో ఏపీ అభిప్రాయాన్ని కోరింది. ఉమ్మడి సర్వేకు ఏపీ అంగీకరించటంతో అధికారిక ప్రకటన విడుదల చేసింది. పోలవరం జాతీయ ప్రాజెక్టు కావటంతో కేంద్ర ప్రభుత్వం ఎప్పటికపుడు నిర్మాణ పురోగతిపై సీడబ్ల్యూసీని ఆరా తీస్తోంది. ముంపుపై ఉమ్మడి సర్వే చేయించాలని కీలకమైన నిర్ణయం తీసుకున్న నేపథ్యంలో ఈ మేరకు సీడబ్ల్యూసీ నివేదిక అందించింది. గోదావరికి ఇప్పటివరకు వచ్చిన గరిష్ట వరద 36 లక్షల క్యూసెక్కులు..50 లక్షల క్యూసెక్కుల గరిష్ట వరద అంచనాతో పోలవరం నిర్మితమవుతోంది..ఈ నేపథ్యంలో ఉమ్మడి సర్వే వల్ల పోలవరం ప్రాజెక్టు పురోగతిపై సాంకేతికంగా ఎలాంటి ప్రభావం పడే అవకాశం లేదనీ, గతంలో చేసిన అనేక సర్వేలు ముంపు ఏర్పడే అవకాశమే లేదని తేల్చి చెప్పాయన్న సంగతిని కేంద్రానికి సమర్పించిన నివేదికలో సీడబ్ల్యూసీ ఉటంకించినట్టు- తెలిసింది.
అనేక సంస్థలతో సీడబ్ల్యూసీ అధ్యయనం
పోలవరం ముంపుపై ఇపుడు ఉమ్మడి సర్వేకు అంగీకరించిన కేంద్ర జలసంఘం (సీడబ్ల్యూసీ) గతంలో అనేక ప్రఖ్యాత సంస్థలు, ఇంజనీరింగ్ నిపుణులతో సర్వే చేయించింది. పోలవరంలో వరద ఉధృతి పెరిగినపుడు బ్యాక్ వాటర్ ఏ స్థాయిలో ఉంటు-ందీ..దాని ప్రభావం వల్ల భవిష్యత్ లో ప్రతికూల పరిణామాలు ఏర్పడకుండా పోలవరం ప్రాజెక్టు నిర్మాణంలో తీసుకోవాల్సిన సాంకేతిక అంశాలను అధ్యయనం చేసేందుకు సీడబ్ల్యూసీ నియమించిన గోపాలకృష్ణ కమిటీ- కూడా గతంలో నివేదిక అందించింది. ఈ కమిటీ-తో పాటు- బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ (బీఐఎస్), ఐఐటి హైదరాబాద్, ఏపీ ప్రభుత్వం కూడా దీనిపై అధ్యయనం చేసి నివేదికలు అందించగా..వాటన్నిటినీ క్రోడీకరించి సీడబ్ల్యూసీ సమగ్ర నివేదిక రూపొందించింది. పోలవరంకు 36 లక్షల క్యూసెక్కుల వరద వచ్చినపుడు పోలవరం వద్ద డ్యాం నిర్మాణం పూర్తి కాని సమయంలో భద్రాచలం వద్ద 57 అడుగులు, పోలవరం డ్యాం పూర్తయినపునడు 57.02 అడుగులకు నీరు చేరుతుందని హైదరాబాద్ ఐఐటి అధ్యయనంలో వెల్లడయింది. కేంద్ర జలసంఘం నియమించిన గోపాలకృష్ణ నివేదికలో మాత్రం భద్రాచలం వద్ద 56.09, 56.44 అడుగులకు నీరు చేరుతుందని లెక్క తేల్చింది. గోపాలకృష్ణ నివేదికతో పాటు- ఏపీ ప్రభుత్వ నివేదికలోని అధ్యయన అంశాలు దాదాపు ఒకే తరహాలో ఉన్నాయి. పోలవరం వద్ద డ్యాం లేనపుడు భద్రాచలం వద్ద 56.09 అడుగులు, డ్యాం ఉన్నపుడు 56.57 అడుగుల నీటి మట్టం ఉంటు-ందని ఏపీ ప్రభుత్వ అద్యయనం వెల్లడించింది. బ్యూరో ఇండియన్ స్టాండర్డ్స్ 50 ఏళ్లలో వచ్చే 25.53 లక్షల క్యూసెక్కుల వరదనూ, గోదావరి జలవివాద -టైబ్యునల్ మార్గదర్శకాలను అనుసరించి 500 ఏళ్లలో వచ్చే 36 లక్షల క్యూసెక్కుల వరదను పరిగణలోకి తీసుకుని అధ్యయనం చేసి నివేదిక అందించింది. హైదరాబాద్ ఐఐటి మాత్రం వెయ్యేళ్లలో, 10 వేల ఏళ్లలో వచ్చే వరదను ప్లnడ్ ప్రీక్వెన్సీ అప్రోచ్ ద్వారా అద్యయనం చేసి పోలవరం ఎగువన, దిగువన వచ్చే వరద లెక్కలను వెల్లడించింది. ఈ రెండు సంస్థల అధ్యయనాలను పరిగణలోకి తీసుకుని 25.53 లక్షల క్యూసెక్కులు, 36 లక్షల క్యూసెక్కుల వరద ప్రభావంపై సమగ్ర అధ్యయనం చేసిన గోపాలకృష్ణ కమిటీ- హైదరాబాద్ ఐఐటి అధ్యయనాంశాలు హేతుబద్ధంగా లేవన్న అభిప్రాయానికి వచ్చినట్టు- తెలిసింది. కేంద్ర జలసంఘం కూడా పీపీఏకు పంపించిన నివేదికలో ఇప్పటికపుడు ఐఐటి అధ్యయనాన్ని పరిగణలోకి తీసుకోవాల్సిన అవసరం లేదన్న అభిప్రాయాన్ని వ్యక్తం చేసినట్టు- తెలిసింది. గోపాలకృష్ణ కమిటీ- నివేదికలోని అధ్యయనాంశాలు ఏపీ ప్రభుత్వ జలవనరుల నిపుణులు గతంలో వెల్లడించిన అధ్యయనాంశాలతో దాదాపు సరిపోలేలా ఉన్నట్టు- సమాచారం.