కడపలో అసభ్యంగా ప్రవర్తించడంతో దేహశుద్ది
మంత్రి రాంప్రసాద్ దృషికి సంఘటన
వెంటనే బదిలీ వేటు… విచారణకు ఆదేశం ..
కడప రవాణాశాఖలో కీచక అధికారిపై వేటుపడింది. కడప రవాణాశాఖ డిప్యూటీ కమిషనర్ చంద్రశేఖర్ రెడ్డిపై మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి బదిలీ వేటు వేశారు. సమగ్ర విచారణ తక్షణమే చేపట్టి అధికారిపై శాఖపరమైన క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలని మంత్రి ఆదేశాలు జారీ చేశారు. అధికార్లు రవాణాశాఖకు కీర్తి తెచ్చేలా విధులు నిర్వహించాలని ఆయన పేర్కొన్నారు.
ఇది ఇలా ఉంటే కడప డీటీసీ చంద్రశేఖర్ రెడ్డి గురువారం మహిళా బ్రేక్ ఇన్‌స్పెక్టర్ ఇంటికి వెళ్లి వేధించాడు. దీంతో మహిళా ఉద్యోగి కుటుంబసభ్యులు అతడికి దేహశుద్ధి చేశారు. అనంతరం పోలీసులు కేసు నమోదు చేయడంతో ఉన్నతాధికారులు చర్యలు చేపట్టారు. కడప డీటీసీపై బదిలీ వేటు వేసి రాష్ట్ర కమిషనర్ కార్యాలయంలో రిపోర్టు చేయాలని మంత్రి రాంప్రసాద్ రెడ్డి ఆదేశించారు. కడప డీటీసీపై ఇప్పటికే నాలుగు కేసులు నమోదు అయ్యాయి. బాపట్ల, శ్రీకాకుళంలో పని చేసిన సమయంలో మహిళల పట్ల అసభ్యంగా ప్రవర్తించాడని ఆయనపై ఆరోపణలు ఉన్నాయి.