కడప బ్యూరో – ప్రభ న్యూస్ – “ ఆంధ్రప్రదేశ్ ప్రజలకు మేలు జరగాలి, ప్రత్యేక హోదా ఇవ్వాలి, పోలవరం కావాలి, పిల్లలకు ఉద్యోగాలు రావాలి, కడపకు ఉక్కు ప్యాక్టరీ రావాలి, అప్పటి వరకూ వైఎస్ రాజశేఖరరెడ్డి బిడ్డ తాను పుట్టిన గడ్డను వీడదు,మడమ తిప్పను, పోరాటం ఆపను, నా రక్తం వైఎస్ రాజశేఖరరెడి రక్తం, నా పేరు వైఎస్ షర్మిల రెడ్డి, పులి కడుపున పులే పుడుతుంది, ఎంత గీ పెట్టిన నా పేరు వైఎస్ షర్మిల రెడ్డే , ఏం పీక్కుంటారో పీక్కోండి. ఖబడ్డార్, నాకు భయం లేదు’’, అని ఏపీ కాంగ్రెస్ పీసీసీ ఛీఫ్ వైఎస్ షర్మిల రెడ్డి అన్నారు. కడప పట్టణంలోని ఓ కళ్యాణ మండపంలో సోమవారం కడప, అన్నమయ్య జిల్లాల కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల సమావేశంలో ఆమె పాల్గొన్నారు.
ఈ సందర్భంగా షర్మిలా రెడ్డి మాట్లాడుతూ, ఇప్పుడు ఎన్నికలు వచ్చాయి, మన జాతకాలు మారాలి, భవిష్యత్తుపై నిర్ణయం తీసుకోవాలి. లేక పోతే మరో ఐదేళ్లు తిప్పలు తప్పవు, బీజేపీతో ఆంధ్రుల బానిసత్వం పోవాలి, కాంగ్రెస్ పార్టీ రావాలి, అప్పుడే ఆంధ్ర ప్రదేశ్ కు ప్రత్యేక హోదా, కడప స్టీల్ ప్యాక్టరీ, రైతులకు రుణమాఫీ వస్తాయి, అని షర్మిలా రెడ్డి వివరించారు. ఇక కాంగ్రెస్‌లో ప్రతి కార్యకర్త ఒక సైనికుడిలా కాదు, సైన్యంలా పని చేయాలి, కడపలో కాంగ్రెస్ పరిస్థితి తెలుసు, ఎందుకంటే ఇది జగన్ మోహన్ రెడ్డి జిల్లా, కాంగ్రెస్ పై వ్యతిరేక ఉంటుంది, నాకు జగనన్నపై ద్వేషం లేదు, ఆయన పాత జగనన్న కాదు, సీఎం తరువాత జగనన్న మారిపోయాడు, ఈ జగనన్న ఆ జగన్న కాదు అని షర్మిలా రెడ్డి ఉద్వేగంగా వివరించారు.
జగనన్న కోసం పాదయాత్ర చేశా..
జగనన్న కోసం, వైసీపీ కోసం 3200 కిలోమీటర్లు కేవలం ఒక్క మహిళగా పాదయాత్ర చేశాను. కానీ ఈ వైసీపీ కేడర్ కు కనీసం కృతజ్ఞత లేదు, రోజుకో జోకర్‌ను వస్తున్నాడు, ఉచ్చం నీచం లేకుండా, సిగ్గు శరం లేకుండా వ్యక్తిగత ఆరోపణలతో ఈ జోకర్లు రెచ్చిపోతున్నారు, ఆడపిల్లని ఇంగితం లేకుండా నా వ్యక్తి జీవితాలపై చెలరేగిపోతున్నారు, అయినా నేను భయపడను, అని షర్మిలారెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. షర్మిలను సీఎం చేయాలని, జగన్ ను జైలులో పెట్టాలని తన భర్త అనిల్ అప్పటి మంత్రి ప్రణబ్ ముఖర్జీని కోరారని ఓ జోకర్ సోషల్ మీడియాలో చెప్పాడని, కానీ ప్రణబ్ ముఖర్జీని తన వదిన భారతీరెడ్డి సహా తన భర్త కలిశారని, ప్రణబ్‌ను తన భర్త ఏం కోరాడో వదినమ్మ భారతీరెడ్డి సాక్ష్యం చెప్పాలని షర్మిలా రెడ్డి డిమాండు చేశారు.