Thursday, November 21, 2024

Cuddapah – గ్రీన్ ఎనర్జీకి రెడ్ సిగ్న‌ల్‌ – క‌మీష‌న్ కావాల‌ని ఎమ్మెల్యే హుకుం

కడప జిల్లాలో మొద‌లైన‌ పవర్ పాలిట్రిక్స్
గ్రీన్ ఎన‌ర్జీ కంపెనీకి ఆదిలోనే అడ్డంకులు
బిజినెస్‌ టైకూన్ అదానీ ఉక్కిరి బిక్కిరి
జగడం షురూ చేసిన జమ్మలమడుగు ఎమ్మెల్యే
సబ్ కాంట్రాక్టులు కేటాయించాల‌ని రగడ
ప్ర‌ధాని మోదీ స‌న్నిహితుడికి ముచ్చెమటలు
ఇర‌కాటంలో ప‌డ్డ‌ ఏపీలోని కూటమి సర్కారు
అదానీ ఆర్థిక నేరాలపై అమెరికాలో కేసు
జేపీసీ కోసం ప‌ట్టుప‌ట్టిన కాంగ్రెస్ పెద్ద‌లు

ఆంధ్రప్రభ స్మార్ట్​, సెంట్రల్​ డెస్క్​:

ఆంధ్రప్రదేశ్‌లోని నౌకాశ్రయాలు.. విమానాశ్రయాలు.. పవర్ ప్రాజెక్టుల్లో సంపద సృష్టికర్త బిజెనెస్ టైకూన్.. అదానీ పెట్టుబడుల జైత్రయాత్రపై కడప జిల్లాలో తిరుగుబాటు కలకలం రేపింది. పవర్ స్టోరేజీ ప్లాంట్ పనులకు ఎదురు దెబ్బ తగిలింది. స్థానికులకే ఉపాధి పేరిట జమ్మలమడుగు ఎమ్మెల్యే జగడానికి దిగారు. కంపెనీ సిబ్బందిని అడ్డుకున్నారు. ఒక రకంగా స్థానిక బలగాన్ని ప్రయోగించారు. బీజేపీ ఎంపీకి చెందిన కంపెనీకీ చుక్కలు చూపించారు. ప్రస్తుతం ఈ వ్యవహారం పోలీసు కేసుల దశకు చేరింది. మరోవైపు ఇరుపక్షాల మధ్య సయోధ్య కోసం కూటమి పెద్దలు జోక్యం చేసుకున్నా. అయినా జమ్మలమడుగు ఎమ్మెల్యే ఎక్కడా తగ్గిది లేదంటున్నారు. సీఎం చంద్రబాబు జోక్యం చేసుకుని ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డిని మందలించిన‌ట్టు స‌మాచారం. అయినా ఆ ఎమ్మెల్యేలో ఎలాంటి మార్పు రాలేద‌ని తెలుస్తోంది. ఇదిలా ఉంటే… భారత్‌లో పెట్టుబడుల కోసం ముడుపులు చెల్లించారని, ఈ రీతిలోనే కడప జిల్లా పవర్ ప్రాజెక్టును గత పాలకుల నుంచి సాధించారని అదానీపై అమెరికాలో కేసు నమోదు అయ్యింది. ఈ విష‌యం యావ‌త్ భార‌త‌దేశాన్ని కుదిపేస్తోంది.

అసలు ఏం జరిగింది..

ఏపీలో అదానీ గ్రీన్ ఎనర్జీ లిమిటెడ్ సంస్థ రెండు పంప్డ్ స్టోరేజీ ప్రాజెక్టులను నిర్మించేందుకు ఈ ఏడాది జనవరిలో శంకుస్థాపన చేసింది. ఈ ప్రాజెక్టు కింద 3700 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి చేయాలని నిర్ణయం తీసుకుంది. కడప జిల్లాతో పాటు శ్రీ‌సత్యసాయి జిల్లాల్లో రెండు ప్లాంట్లను ఏర్పాటుకు శ్రీకారం చుట్టింది. వీటి ఏర్పాటు కోసం దాదాపు 1490 ఎకరాలను లీజు ప్రాతిపదికన అందించటానికి ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. భూమి ఇచ్చిన రైతులకు ఎకరానికి ₹30వేల‌ చొప్పున లీజు చెల్లించంటానికి ఒప్పందం కుదిరింది.ఈ ప్రాజెక్టు ద్వారా ప్రత్యక్షంగానే కాకుండా పరోక్షంగా దాదాపు ప‌దివేల‌ మందికి ఉపాధి అవకాశాలను కల్పిస్తామని అదానీ కంపెనీ స్పష్టం చేసింది. ఈ స్థితిలో జమ్మలమడుగు నియోజకవర్గంలో దొంతికోన వద్ద 307, 308, 309/2, 310, సర్వే నెంబర్లలో 470 ఎకరాల్లో 1800 మెగావాట్ల సామర్థ్యంతో పంప్డ్‌ స్టోరేజీ విద్యుత్‌ ప్లాంటు నిర్మాణానికి అదానీ కంపెనీ సిద్ధపడింది. ఇందుకు ₹5 వేల కోట్లు వెచ్చించనుంది. పంప్డ్ స్టోరేజీ ప్రాజెక్టులో హైడ్రో ఎలక్ట్రిక్ జనరేషన్ ప్లాంట్ ఇది. నీటి రూపంలో ఎనర్జీని స్టోర్ చేసి ఉంచుతుంది. మాజీ సీఎం జగన్​ హయాంలో ఈ ప్రాజెక్టుకు ఆమోదం లభించింది.

- Advertisement -

తెర మీదకు ఉపాధి రగడ..

వైఎస్సార్‌ కడప జిల్లాలోని గండికోట ప్రాజెక్టు ఆధారంగా 1000 మెగావాట్ల సామర్థ్యంతో అదానీ గ్రూప్ హైడ్రో పవర్‌ (పంప్డ్‌ స్టోరేజీ) ప్రాజెక్టు ఏర్పాటుకు సన్నాహాలు చేస్తోంది. ఈ మేరకు కొండాపురం మండలం దుబ్బుడుపల్లి రాగికుంట, తిరుమల గ్రామాలతో పాటు మైలవరం మండలం బొగ్గులు పల్లి పరిధిలోని 400 ఎకరాల భూమిలో ప్రాజెక్టు పనులు చేపట్టాలని కంపెనీ నిర్ణయించింది. తొలి విడతగా ₹1,800 కోట్లతో నిర్మాణ పనులకు శ్రీకారం చుట్టింది. ఈ పనుల సబ్‌ కాంట్రాక్టు టెండర్లను అనకాపల్లి ఎంపీ సీఎం రమేశ్‌కు చెందిన రిత్విక్‌ ప్రాజెక్ట్స్ సంస్థ దక్కించుకుంది. క్షేత్రస్థాయిలో పనులు మొదలయ్యాయి. ఈ నేపథ్యంలో జమ్మలమడుగు ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి వర్గీయులు వందల మంది వచ్చి ప్రాజెక్టు పనులను అడ్డుకున్నారు. రిత్విక్‌ సంస్థ ప్రతినిధులతో వాగ్వివాదానికి దిగారు. ఎమ్మెల్యేను సంప్రదించకుండా పనులు ఎలా చేస్తారని ప్రశ్నించారు. కాంట్రాక్టు పనులల్లో తమకు భాగం ఇవ్వాలని, స్థానికులకు ఉద్యోగాలు ఇవ్వాలని డిమాండు చేసినట్టు తెలుస్తోంది.

రాయలసీమలో మామూలే.. కమీషన్ల కోసం రాద్ధాంతం..

రాయలసీమలో పరిశ్రమ స్థాపన సందర్భంగా. కమీషన్లు, సబ్ కాంట్రాక్టుల, స్థానికులకు ఉద్యోగాల పేరుతో ఫ్యాక్టరీల యజమానులను స్థానిక రాజకీయ నేతలు, అనుచరులు ఒత్తిడి తీసుకురావటం ఇక్కడ ఆనవాయితీగా వస్తోంది. గతంలో పెనుగొండలో కియా కారు లాంచ్ కార్యక్రమంలో అప్పటి ఎంపీ గోరంట్ల మాధవ్ వ్యవహరించిన తీరుపై విమర్శలు వచ్చాయి. కియా ప్లాంట్ యాజమాన్యాన్ని ఇబ్బంది పెట్టేలా మాధవ్ వ్యవహరించినట్లు ఆరోపణలు వచ్చాయి. కారు బానెట్ మీద నిరసన వ్యాఖ్యలు రాయడంతో పాటు మరొక సందర్భంలో ‘కియా మెడలు వంచేస్తా’ అని వ్యాఖ్యానించడంతో అప్పట్లో వివాదం రేగింది. ఆ తర్వాత తాను స్థానికులకు ఉద్యోగాల కోసమే కియాపై ఒత్తిడి చేశానని మాధవ్ వివరణ ఇవ్వడంతో వివాదం సద్దుమణిగింది. అనంతపురం జిల్లా రాప్తాడులో ఏర్పాటు చేయాలనుకున్న జాకీ పరిశ్రమను అప్పటి వైసీపీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాశ్ రెడ్డి డబ్బులు డిమాండ్ చేయడంతో ఇక్కడి నుంచి వెళ్లిపోయిందని రెండేళ్ల కిందట సీపీఐ నేతలు ఆరోపించారు. ఈ ఆరోపణలను అప్పట్లోనే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి తీవ్రంగా ఖండించారు. అది సరైన కంపెనీ కాదని ట్రాక్ రికార్డు లేని ఆ కంపెనీకి చంద్రబాబు ప్రభుత్వం 2014- ..19 మధ్య నామమాత్రపు ధరకు భూములు కట్టబెట్టిందని, అయినప్పటికీ ఆ కంపెనీ రావడం లేదని విమర్శించారు.

బీజేపీ ప్రోత్సహించదు.. సీరియస్​గా తీసుకుంటాం

‘‘జరిగిన ఘటన అవాంఛవీయం. భారతీయ జవతా పార్టీ ఇలాంటి వాటిని అస్సలు ప్రోత్సహించదు. అందులోనూ.. ఇది మా పార్టీకి చెందిన ఇద్దరు ప్రజాప్రతినిధులకు సంబంధించిన విషయం. కచ్చితంగా బీజేపీ పెద్దలు జోక్యం చేసుకుంటారు. అధిష్టానం జాతీయ స్థాయిలో వాస్తవాలను విచారిస్తుంది. ఇది పార్టీ అంతర్గత అంశం. దీని గురించి ఇంతకంటే మేం బహిరంగంగా మాట్లాడలేం’’ అని రాయలసీమకు చెందిన బీజేపీ సీనియర్‌ నాయకుడు అన్నారు. ‘‘ఏదేమైనా ఇలాంటివి పార్టీకి మంచిది కాదు. పరిశ్రమలకు సంబంధించిన అంశంలో రాష్ట్రంలో కూటమి ప్రభుత్వంపై ప్రభావం చూపిస్తుంది. మామూలుగానే ఆంధ్రప్రదేశ్‌లో పరిశ్రమలు పెట్టాలంటే గత పరిస్థితుల దృష్ట్యా కంపెనీలు భయపడుతున్నాయి. ఈ సమయంలో ఇలాంటివి చోటుచేసుకుంటే రాష్ట్రానికే నష్టం జరుగుతుంది..’’ అని ఆయన వ్యాఖ్యానించారు.

అదానీ మెడకు అమెరికా కేసు ఉచ్చు..

న్యూయార్క్‌లోని ఫెడరల్ కోర్టులో భారతీయ బిజినెస్ టైకూన్ గౌతమ్ అదానీ సహా ఏడుగురిపై మోసం, లంచం ఆరోపణలపై కేసు నమోదైంది. యునైటెడ్ స్టేట్స్ అటార్నీ కార్యాలయం వివరణ ప్రకారం, భారతదేశంలో సౌరశక్తి ప్రాజెక్టులను పొందేందుకు భారతీయ అధికారులకు, అమెరికాలో నిధుల సమీకరణకు 25 కోట్ల డాలర్లు (దాదాపు ₹ 2,100 కోట్లు) లంచంగా ఇవ్వజూపారని, ఆ విషయం బయటకు రాకుండా తొక్కిపెట్టారని అదానీపై అభియోగాలు నమోదయ్యాయి. నౌకాశ్రయాలు, విమానాశ్రయాల నుంచి పునరుత్పాదక ఇంధన రంగాల (రెన్యూవబుల్ ఎనర్జీ) వరకూ వ్యాపారాలను విస్తరింప జేసిన అదానీపై న్యూయార్క్‌లో బుధవారం నేరారోపణలు నమోదయ్యాయి. వచ్చే 20 ఏళ్లలో 200 కోట్ల డాలర్లు (₹ 16,880 కోట్లు ) కంటే ఎక్కువ ఆదాయం తెస్తాయని అంచనాలు ఉన్న కాంట్రాక్టులను దక్కించుకోవడానికి.. అదానీ, ఆయన కంపెనీల్లోని సీనియర్ ఎగ్జిక్యూటివ్‌లు భారత అధికారులకు చెల్లింపులు చేయడానికి అంగీకరించారని యూఎస్ ప్రాసిక్యూటర్లు ఆరోపించారు.

అరెస్ట్ వారెంట్లు

అదానీ గ్రీన్ ఎనర్జీ లిమిటెడ్ అధికారులు, అదానీ సన్నిహితులు సాగర్, వినీత్ జైన్ ఉన్నారు. ఈ నేపథ్యంలో గౌతమ్, సాగర్ అదానీలపై అరెస్ట్ వారెంట్లు కూడా జారీ చేసినట్లు ప్రచారం జరుగుతోంది. గౌతమ్ అదానీ, సాగర్ ఆర్. అదానీ, వినీత్ ఎస్. జైన్, రంజిత్ గుప్తా, రూపేష్ అగర్వాల్, దీపక్ మల్హోత్రా, సౌరభ్ అగర్వాల్, సిరిల్ కాబనేజ్‌లపై ఆరోపణలు వచ్చాయి. అయితే ఈ అంశంపై అదానీ గ్రూప్ కంపెనీ నుంచి ఎలాంటి స్పందన రాలేదు.

యూఎస్ అటార్నీ వివరణ

బిలియన్ డాలర్ల విలువైన కాంట్రాక్టులను పొందేందుకు భారత ప్రభుత్వ అధికారులకు లంచం ఇచ్చేందుకు నిందితులు రహస్య పథకం పన్నారని అమెరికా అటార్నీ బ్రియాన్ పీస్ అభియోగాల్లో పేర్కొన్నారు. దీని కోసం చాలా మందిని చీకటిలో ఉంచారని ప్రస్తావించారు. అమెరికన్లతోపాటు ప్రపంచ పెట్టుబడిదారుల నుంచి నిధులను సేకరించడానికి ప్రయత్నిస్తూనే ఉన్నారని చెప్పుకొచ్చారు. ఈ క్రమంలో అంతర్జాతీయ మార్కెట్ నుంచి అవినీతిని రూపుమాపేందుకు కట్టుబడి ఉండాలని హెచ్చరించారు.

ఏపీ సోలార్ ప్లాంటులకూ లింకు..

ఇప్పుడు అమెరికా ఫెడరల్ కోర్ట్ లో నడుస్తున్న.. అదానీ ఆర్థిక నేరాల కేసుతో ఆంధ్రాలో నేతలకూ లింకు బయటపడింది. ఈ మేరకు మీడియాలో కథనాలు తెరమీదకు వచ్చాయి. ఏపీలో 2019 మే – 2024 జూన్ వరకు హైర్యాంక్ లో ఉన్న ఒకరితో ఈ డీల్ కుదిరిందని, అదానీ నేరుగా వచ్చి అతనిని 2021 సెప్టెంబర్ 12 కలిసినట్టు తెలుస్తోంది. దాదాపు ₹1750 కోట్లు ఆఫర్ చేసినట్టు సమాచారం. ఆతర్వాత నాలుగు రోజులకి 2021 సెప్టెంబర్ 16న మంత్రివర్గ సమావేశంలో సౌరవిద్యుత్​కు సంబంధించిన కొన్ని నిర్ణయాలు తీసుకున్నట్టు తెలుస్తోంది. గతంలో వైసీపీ ప్రభుత్వం ఇచ్చిన సౌరవిద్యుత్ టెండర్లని అప్పటి సీఎం జగనే రద్దు చేశారు. ఆతర్వాత కొన్ని నెలలకి అదానికి ఏపీలో సోలార్ పవర్ ప్రాజెక్టులు దక్కినట్టు ప్రచారం జరుగుతోంది.

వారిద్దరి స్కామ్​లే.. జేపీసీకి కాంగ్రెస్ డిమాండ్

అదానీ గ్రూప్ ఆర్థిక లావాదేవీలపై జాయింట్ పార్లమెంటరీ కమిటీని ఏర్పాటు చేయాలని కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తోంది. ఈ మేరకు కాంగ్రెస్ సీనియర్​ నేత జై రాం రమేష్ ట్విట్టర్ వేదికగా స్పందించారు. ఇది భారత ఆర్థిక వ్యవస్థలోని కీలక రంగాల్లో పెరుగుతున్న గుత్తాధిపత్యానికి దారి తీస్తోందని, ద్రవ్యోల్బణానికి ఆజ్యం పోస్తోందన్నారు. గౌతమ్ అదానీ సహా ఏడుగురిపై అమెరికా సెక్యూరిటీస్ అండ్ ఎక్స్ఛేంజ్ కమిషన్ నేరారోపణల నేపథ్యంలో ‘మోదానీ’ స్కామ్‌లపై జాయింట్ పార్లమెంటరీ కమిటీ దర్యాప్తు జరపాలన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement