న్యూఢిల్లీ, ఆంధ్రప్రభ : కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ (సీఎస్ఆర్) కింద పబ్లిక్, ప్రైవేట్ రంగాలకు చెందిన పలు కార్పొరేట్ సంస్థలు, వ్యక్తులు, ఇతర సంస్థల నుంచి ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఇప్పటి వరకు 34.35 కోట్ల రూపాయల నిధులు నేషనల్ స్పోర్ట్స్ డెవలప్మెంట్ ఫండ్ (ఎన్ఎస్‌డిఎఫ్)కు సమకూర్చినట్లు క్రీడల శాఖ మంత్రి అనురాగ్ ఠాకూర్ వెల్లడించారు. రాజ్యసభలో గురువారం వైఎస్సార్సీపీ సభ్యులు విజయసాయి రెడ్డి అడిగిన ప్రశ్నకు మంత్రి రాతపూర్వకంగా జవాబిచ్చారు. క్రీడాకారులు, క్రీడా సంస్థలను ప్రోత్సహించేందుకు కేంద్ర తమ మంత్రిత్వ శాఖ ఎటా అందించే నిధులకు అదనంగా కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ (సీఎస్ఆర్) కింద ఎన్‌ఎస్‌డిఎఫ్‌కు నిధులు సమకూర్చుతున్నట్లు తెలిపారు.
గత ఆర్థిక సంవత్సరంలో సీఎస్‌ఆర్ ద్వారా కింద 43.88 కోట్ల రూపాయలు సమకూరినట్లు వివరించారు. ఆంధ్రప్రదేశ్ నుంచి స్పోర్ట్స్ అభివృద్ధి కోసం ఇప్పటివరకు ఎలాంటి ప్రతిపాదన తమకు అందలేదని కేంద్రమంత్రి అన్నారు. ఎన్‌ఎస్‌డీఎఫ్ కింద 2023-24 బడ్జెట్‌లో 15 కోట్లు కేటాయించినట్లు ఆయన తెలిపారు.
ఈ-శ్రమ్‌లో ఏపీ నుంచి 80 లక్షల అసంఘటిత కార్మికులు
అసంఘటిత కార్మికుల వివరాలతో సమగ్రమైన జాతీయ డేటా బేస్ రూపొందించే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఈ-శ్రమ్ పోర్టల్‌లో ఈనెల 3 నాటికి ఆంధ్రప్రదేశ్ నుంచి 80,03,442 మంది తమ పేర్లు, వివరాలను నమోదు చేసుకున్నట్లు కేంద్ర కార్మిక, ఉపాధి కల్పన శాఖ సహాయ మంత్రి రామేశ్వర్ తెలీ వెల్లడించారు. రాజ్యసభలో విజయసాయి అడిగిన ప్రశ్నకు మంత్రి జవాబిచ్చారు. దేశవ్యాప్తంగా 28,99,63,420 మంది అసంఘటిత కార్మికులు ఈ-శ్రమ్ పోర్టల్‌లో నమోదు చేసుకున్నట్లు తెలిపారు. కేంద్ర ప్రభుత్వ నినాదమైన లక్ష్యంగా సబ్‌కా సాత్ సబ్‌కా వికాస్‌ను ప్రతిబింబించే విధంగా దేశంలో దారిద్య్ర రేఖకు దిగువున ఉన్న నిరుపేదల అభ్యున్నతి కోసం అనేక చర్యలు చేపడుతూ వారి సమ్మిళిత వృద్ధిపై ప్రభుత్వం దృష్టి సారిస్తోందని వెల్లడించారు.