ఆంధ్రప్రభ, నంద్యాల బ్యూరో : నేటి సమాజంలో మోసాలకు కొదవలేదు. అత్యధిక వడ్డీ ఇస్తామని ఆశ చూపి సుమారు రూ.23 కోట్లు వసూలు దండుకున్న ఓ ప్రబుద్ధుడిపై డోన్ పోలీసులు కేసు నమోదు చేశారు. క్రిప్టో కరెన్సీ పేరిట వందలాది మందిని దగా చేసిన వ్యక్తిని డోన్ పోలీసులు అరెస్టు చేశారు.
డోన్ డీఎస్పీ పీ.శ్రీనివాసులు తెలిపిన వివరాల ప్రకారం, అనంతపురం జిల్లా గుత్తి మండలం పెద్దవడుగూరు గ్రామానికి చెందిన రామాంజనేయులు అనే వ్యక్తి డోన్ పట్టణంలో ఒక షాపును అద్దెకు తీసుకుని 2021లో కేవ ఇండస్ట్రీస్ ఆర్గానిక్ హెర్బల్ కంపెనీ స్థాపించాడు.
ఇదే కంపెనీ పేరిట క్రిప్లో కరెన్సీ చెలామణిని తెరమీదకు తీసుకువచ్చాడు. నూటికి పదిరూపాయల వడ్డీని ఆశ చూపించి భారీ ఆదాయం పేరిట ప్రజలను ఆకట్టుకున్నాడు. సుమారు 300 నుంచి రూ.23 కోట్లు వసూలు చేశాడు.
ఇక ఇక్కడే ట్విస్ట్ మొదలైంది. వడ్డీ లేదు, క్రిప్టో కరెన్సీ లేదు. గట్టిగా అడిగిన ఖాతాదారులకు రూ.17 కోట్లు చెల్లించాడు. మిగిలిన సొమ్మును రామాంజనేయులు నుంచి వసూలు చేయాలని బాధితులు పోలీసులను కోరారు. డీఎస్పీ శ్రీనివాసులు ఆధ్వర్యంలో సర్కిల్ ఇన్స్పెక్టర్ ఇంతియాజ్ భాష విచారణ ప్రారంభించారు.
క్రిప్టో కరెన్సీ పేరు మీద ఎంతో వసూలు చేశాడు? ఎవరికి ఎంత చెల్లించాడు? అనే అంశంపై పూర్తి వివరాలు సేకరించారు. బాధితులను విచారించి న్యాయం చేస్తామని తెలిపారు. రామాంజనేయులు నుంచి పోలీసులు సుమారుగా రు 2.40 కోట్లు సీజ్ చేశారు.
పోలీసులు సీజ్ చేసిన నగదును తమకు చెల్లించాలని బాధితులు బాండ్లను తీసుకొని స్టేషన్ కు వచ్చారు. తమకు న్యాయం చేయాలని బాధితులు ఆందోళన వ్యక్తం చేశారు. రామాంజనేయులును అరెస్టు చేసి కోర్టులో హాజరు పరిస్తే తాము తమ సొమ్ము తీసుకోవటానికి మరింత ఆలస్యం అవుతుందని. మీరే న్యాయం చేయాలని పోలీసులను బాధితులు ప్రాధేయపడటం విశేషం.