తిరుమల : భక్తుల అధిక రద్దీ దృష్ట్యా వృద్ధులు, చిన్న పిల్లల తల్లిదండ్రులు, వికలాంగులు తిరుమల యాత్రను వాయిదా వేసుకోవాలని తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు కోరుతోంది. ఆగస్టు 11 నుండి 15వ తేదీ దాకా వరుస సెలవుల కారణంగా తిరుమలకు భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చే అవకాశం ఉంటుందని టీటీడీ అంచనా వేస్తోంది. భక్తులు ప్రణాళిక బద్ధంగా దర్శనం, వసతిని ముందుగానే బుక్ చేసుకుని తిరుమలకు రావాలని టీటీడీ కోరుతోంది.
వేసవి రద్దీ తగ్గినప్పటికీ, వారాంతం రద్దీతో పాటు పండుగతో కూడ వరుస సెలవులు ఆగస్టు 19 వరకు కొనసాగుతాయి. పైగా పవిత్రమైన పెరటాసి మాసం సెప్టెంబర్ 18న ప్రారంభమై అక్టోబర్ 17వ తేదీ ముగుస్తుంది. ఈ మధ్య కాలంలో తిరుమల యాత్రికుల రద్ధీ అనూహ్యంగా పెరిగే అవకాశం ఉంది. ఈ కారణంగా వృద్ధులు, చిన్న పిల్లల తల్లిదండ్రులు, వికలాంగులు తిరుమలకు పెరటాసి మాసం అనంతరం రావలసిందిగా టీటీడీ విజ్ఞప్తి చేస్తోంది.
అధిక రద్దీ ఉన్న రోజుల్లో యాత్రికులను వారి నిర్దేశిత సమయాలలో మాత్రమే దర్శనానికి అనుమతించడం జరుగుతుంది. యాత్రికులు దర్శనం కోసం తమ వంతు వచ్చే వరకు కంపార్ట్‌మెంట్లలో, క్యూ లైన్లలో చాలా గంటలు వేచి ఉండటానికి ఓపికతో రావాలని టీటీడీ భక్తులకు మరోసారి తెలియజేస్తోంది.
లోకల్ టు గ్లోబల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్బుక్, ట్విటర్, టెలిగ్రామ్ పేజీలను ఫాలో అవ్వండి.