తిరుమల, ప్రభన్యూస్ : తిరుమలలో వారాంతం కావడంతో శుక్రవారం భక్తుల అనూహ్యంగా భక్తుల రద్దీ అనూహ్యంగా పెరిగింది. రెండు కాలిబాట మార్గాలు, రోడ్డు మార్గాల భక్తులు తిరుమలకు వెల్లువలా తరలిస్తున్నారు. దీంతో వైకుంఠం క్యూ కాంప్లెక్సులోని 31 కంపార్టుమెంట్లు నిండి నారాయణగిరి ఉద్యానవనాలు మరియు ఇతర క్యూ లైన్లతో పాటు వివిధ క్యూ లైన్ల భక్తులతో పూర్తిగా నిండిపోయాయి. దీంతో క్యూ లైన్ లేపాక్షిసర్కిల్ వరకు వ్యాపించింది. దీంతో సర్వదర్శనానికి 18 గంటలు, ప్రత్యేక ప్రవేశ దర్శనానికి 4 గంటలు సమయం భక్తులు వేచివుండి శ్రీవారిని దర్శించుకుంటున్నారు.
ఇక టిటిడి ఈవో ఏవి.ధర్మారెడ్డి ఆదేశాల మేరకు అధికారులు క్యూ లైన్లను విస్తృతంగా పర్యవేక్షిస్తూ క్యూ లైన్లో వేచివున్న భక్తులకు అన్నప్రసాదం విభాగం అధికారులు శ్రీవారి సేవకుల సహాయంతో నిరంతరాయంగా తాగునీరు, అన్నప్రసాదాలు, అల్పాహారం లాంటివి అందచేస్తున్నారు. అదేవిధంగా క్యూ లైన్లలో వేచివున్న భక్తులకు ఆరోగ్యవిభాగం అధికారులు పర్యవేక్షిస్తూ భక్తులకు సేవలందిస్తున్నారు. ఇక క్యూ లైన్లలో ఎలాంటి తొక్కిసలాటలు జరగకుండా టిటిడి విజిలెన్సు, పోలీలు సమన్వయంతో బందోబస్తు నిర్వహిస్తున్నారు. ఈ రద్దీ సోమవారం వరకు కొనసాగే అవకాశం ఉంది.