తిరుమల, ప్రభన్యూస్ : తిరుమలలో ఆదివారం కుడా అనూహ్యంగా భక్తుల రద్దీ నెలకొంది. ఈ నేపథ్యంలో ఔటర్ రింగ్‌రోడ్డులోని ఆక్టోపస్ భవనం వరకు యాత్రికుల క్యూ లైెన్లు కొనసాగుతున్నాయి. వ రుస పండుగ సెలవులతో పాటు వారాంతపు రద్దీ, వివాహాలు కారణంగా దేశం నలుమూల నుంచి వచ్చిన భక్తులతో తిరుమల కిటకిటలాడుతోంది. రెండు కాలిబాట మార్గాలు, రోడ్డు మార్గాల భక్తులు తిరుమలకు వెల్లువలా తరలిస్తున్నారు. దీంతో వైకుంఠం క్యూ కాంప్లెక్సులోని 31 కంపార్టుమెంట్లు నిండి నారాయణగిరి ఉద్యానవనాలు మరియు ఇతర క్యూ లైన్లతో పాటు వివిధ క్యూ లైన్ల వద్ద క్యూ లైన్లలో వేచివున్న భక్తులకు టిటిడి ఈవో ఏవి.ధర్మారెడ్డి ఆదేశాల మేరకు అధికారులు క్యూ లైన్లను విస్తృతంగా పర్యవేక్షిస్తూ క్యూ లైన్లో వేచివున్న భక్తులకు అన్నప్రసాదం విభాగం అధికారులు శ్రీవారి సేవకుల సహాయంతో నిరంతరాయంగా తాగునీరు, అన్నప్రసాదాలు, అల్పాహారం లాంటివి అందచేస్తున్నారు. తిరుపతి జేఈవో వీరబ్రహ్మం నారాయణగిరి ఉద్యానవనాలు, వైకుంఠం క్యూ కాంప్లెక్సులోని కంపార్టుమెంట్ల వద్ద క్యూ లైన్లను పరిశీలించి సంబంధిత అధికారుల కు సూచనల ద్వారా నిర్ణీత వ్యవధిలో యాత్రికలకు కల్పిస్తున్న సౌకర్యాలను పరిశీలించారు. అదేవిధంగా క్యూ లైన్లలో వేచివున్న భక్తులకు ఆరోగ్యవిభాగం అధికారులు పర్యవేక్షిస్తూ భక్తులకు సేవలందిస్తున్నారు. అలాగే ప్రధాన అన్నప్రసాద సముదాయంలోనే దాదాపు 50 వేలకు పైగా అన్నప్రసాదాలు తయారు చేయగా వైకుంఠం కంపార్టుమెంట్లలో 1.30 లక్షల అన్నప్రసాదాలు, అల్పాహం లాంటివి తయారు చేసి భక్తులకు అందచేస్తున్నారు.
క్యూ లైన్లలో ఎలాంటి తొక్కిసలాటలు జరగకుండా టిటిడి విజిలెన్సు, పోలీలు సమన్వయంతో బందోబస్తు నిర్వహిస్తున్నారు. ఆదివారం సాయంత్రం 6 గంటల వరకు దాదాపు 60 వేల మంది యాత్రికులు శ్రీవారి దర్శనం చేసుకున్నారు. భారీ రద్దీ కారణంగా తిరుమల యాత్రను వయోవృద్దులు, చంటిపిల్లల తల్లి తండ్రులు తమ తిరుమల యాత్రను వాయిదా వేసుకోవాలని టిటిడి విజ్ఞప్తి చేసినప్పటి ఈ వర్గానికి చెందిన వారు వేలాదిగా తిరుమల శ్రీవారి దర్శనానికి వచ్చారు. దక్షిణాది రాష్ట్రాల భక్తులే కాకుండా జార్ఖండ్, మహారాష్ట్ర, గుజరాత్‌నుంచి వచ్చిన యాత్రికులు, కొత్తగా వివాహం చేసుకున్న జంటలు కూడా పెద్ద సంఖ్యలో తిరులకు చేరుకున్నారు. ఇంజనీరింగ్, ఆరోగ్యం, అన్నప్రసాదం, విజిలెన్స్, వైద్యశాఖల ఉన్నతాధికారులు భక్తుల సౌకర్యాలను పర్యవేక్షిస్తూ క్యూ లైన్లను నిరంతరం పర్యవేక్షిస్తున్నారు. అదేవిధంగా తిరుమలలో నెలకొన్న రద్దీ కారణంగా వసతి గదులు దొరకక భక్తులు నాన అవస్థలు పడుతూ టిటిడి ఏర్పాటు చేసిన లాకర్లను పొంది షెడ్లలో సేద తీరుతున్నారు.