మారుమూల గ్రామాల్లో ఇప్పటికీ నాటుబాంబుల సంస్కృతి ఉంది.. అయితే అవి ఎక్కువగా అడవి పందుల కోసం తయారు చేస్తుంటారు. చిత్తూరు జిల్లా నిమ్మనపల్లి మండలం ముస్టూరు పంచాయతీ.. కొత్తవలసపల్లికి చెందిన పేరం పెద్ద రెడ్డప్ప, శ్రీనివాసులు అడవిపందుల వేట కోసం పలమనేరు ప్రాంతం నుంచి నల్ల మందు తెచ్చి.. నాటు బాంబులు తయారు చేసి వేటకు వినియోగిస్తుంటారు. ఈ క్రమంలో శనివారం ఉదయం పెద్ద రెడ్డప్ప ఇంటిపై తయారు చేసి నాటుబాంబులను ఆరబెట్టారు. నాటు బాంబులు ఇంటిపై ఆరబెట్టడంతో.. ఒక బాంబును కాకి నోట కరుచుకుని ఇంటి సమీపంలో పడేసింది.
అలా పడేసిన నాటు బాంబును కుక్క కొరకడంతో అది పేలి అక్కడికక్కడే మృతిచెందింది. బాంబు శబ్దానికి ఉలిక్కిపడ్డ స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. ఏఎస్సై సురేంద్ర తన సిబ్బందితో ఘటనా స్థలానికి చేరుకున్నారు. పోలీసులు వస్తున్నారన్న సమాచారంతో.. నిందితులు పెద్ద రెడ్డప్ప, శ్రీనివాసులు నాటు బాంబులను ఒక డబ్బాలో వేసి భద్రపరిచేందుకు పారిపోతుండగా.. పోలీసులు వారిని అదుపులోకి తీసుకుని విచారించారు. నిందితుల నుంచి పది నాటు బాంబులను స్వాధీనం చేసుకున్న పోలీసులు.. ఇద్దరిపై కేసు నమోదు చేసి అరెస్టు చేశారు.
లోకల్ టు గ్లోబల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి..
#AndhraPrabha #AndhraPrabhaDigital