Tuesday, November 19, 2024

కుదిపేస్తున్న వర్షం..కోట్లాది రూపాయల పంట నష్టం

క‌ర్నూలు జిల్లాను భారీ వర్షాలు కుదిపేస్తున్నాయి. శుక్రవారం తెల్లవారుజాము నుంచి దాదాపు 30 మండలాల్లో వర్షం కురిసింది. నాలుగు రోజులుగా కురిసిన వర్షాల మూలంగా జిల్లాలో దాదాపు రూ. 30 కోట్ల మేర పంట నష్టం జరిగింది. శుక్రవారం భారీ వర్షం నమోదు కావడంతో 40వేల ఎకరాల్లో పంటనష్టం వాటిల్లినట్లు వ్యవసాయ అధికారులు తేల్చారు. అవుకు మండలంలో శుక్రవారం రాత్రి భారీ వర్షం కురిసింది. 37.4 ఎంఎంల వర్షపాతం నమోదైనట్లు – రెవెన్యూ అధికారులు తెలిపారు. వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. లోతట్టు – ప్రాంతాలన్నీ జలమయం కావడంతో పాటు వందల ఎకరాల్లో పంట పొలాలు నీట మునిగాయి. పలు గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. అవుకు రిజర్వాయర్‌ నిండుకుండలా మారింది. కొద్ది రోజులుగా ఎగువ ప్రాంత గ్రామాలైన ఉప్పలపాడు, కునుకుంట్ల, జూనూతల, మారే మడుగుల తదితర గ్రామాల్లో కురుస్తున్న భారీ వర్షాలకు వాగులు, వంకలు పొంగి ప్రవహించడంతో ఎత్తిపోతల‌ ద్వారా 1250 క్యూసెక్కుల నీరు అవుకు రిజర్వాయర్‌కు చేరుతున్నది. మండలంలో వరి పంట 12,800 ఎకరాలు సాగు చేయగా, 2 వేల ఎకరాల్లో పంట నష్టం జరిగినట్లు అంచనా. శనగ 8 వేల ఎకరాల్లో, మిరప 200 ఎకరాల్లో, ఉల్లి 100 ఎకరాల్లో, పొగాకు 100 ఎకరాల్లో, అలాగే వాము 40 ఎకరాల్లో పంట నష్టం జరిగినట్లు వ్యవసాయ అధికారులు ప్రాథమికంగా అంచనా వేశారు.


తుగ్గలి మండలంలో వర్షానికి ఓ ఇల్లు పడిపోయింది. పప్పు శనగ పంట నీటిలో మునిగింది.
ఆంధ్ర, కర్నాటక, తెలంగాణ ప్రాంతాల ఉమ్మడి జలాశయం తుంగభద్ర జలాశయం వద్ద అధికారులు ప్రమాద హెచ్చరికలు జారీ చేశారు. ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షాలకు జలాశయం పూర్తి స్థాయి నీటిమట్టం చేరుకోవడంతో 33 గేట్లులో 12 గేట్లను రెండు అడుగుల మేర పైకెత్తుతూ 40వేల సెక్యూసెక్కుల నీటిని దిగువ ప్రాంతం తుంగభద్ర నది విడుదల చేస్తున్నారు. నదితీర ప్రాంత ప్రజలు రైతులు, మత్స్యకారులు నదిలోకి వెళ్లొద్దని హెచ్చరికలు జారీ చేశారు. జిల్లాలోని 54 మండలాల్లో 921.4 మి.మీ వర్షపాతం కురిసింది. అధికంగా చిప్పగిరి మండలంలో 71.4మి.మీ, మద్దికెర 50.4, కొలిమిగుండ్ల 47.4, చాగలమర్రి 45.2, అవుకు 37.4, ప్యాపిలి 36.4, సంజామల 36.0, తుగ్గలి 34.2, హలహర్వి 34.2, ఉయ్యాలవాడ 31.4, దొర్నిపాడు 28.6, ఆలూరు 28.2, కోవెలకుంట్ల 27.4, డోన్‌ 22.8, ఆళ్లగడ్డ 22.6, బనగానపల్లె 22.2, పత్తికొండ 22.0, శిరివెళ్ల 17.6, గోస్పాడు, ఆస్పరి 17.0, రుద్రవరం 16.8, ఆదోని 15.4, హొళగుంద 15.2, దేవనకొండ, క్రిష్ణగిరి 14.8, శ్రీశైలం 12.8, గోనెగండ్ల 12.0, ఓర్వకల్లు 11.6, బండి ఆత్మకూరు 11.4, బేతంచర్ల 10.8, మహానంది, వెల్దుర్తి 10.4, నంద్యాల 10.0, గూడూరు 9.4, పాణ్యం 8.6, కోడుమూరు 8.2, గడివేముల, మిడుతూరు 7.4, పగిడ్యాల 6.4, నందవరం, పెద్దకడబూరు, కౌతాళం 6.2, కర్నూలు 6.0, వెలుగోడు 5.0, ఎమ్మిగనూరు 4.8, కల్లూరు 4.2, జూపాడుబంగ్లా, నందికొట్కూరు 4.0, సి బెళగల్‌ 3.4, ఆత్మకూరు 2.8, పాములపాడు 2.6, కోసిగి 2.4, కొత్తపల్లి 2.2, మంత్రాలయం 0.2 మి.మీ వర్షపాతం కురిసింది. ఈ మాసంలో సాధారణ వర్షపాతం 27.6 మి. మీ కాగా, ఇప్పటివరకు 66.9 మి.మీ వర్షపాతం నమోదైంది.


ఈ వర్షాలకు ఉద్యాన, వ్యవసాయ పంటలకు సంబంధించి కోట్లాది రూపాయల నష్టం జరిగినట్లు క్షేత్రస్థాయిలో జిల్లా అధికారులు ప్రాథమిక అంచనా వేస్తున్నారు. ఇప్పటికే జేడీఏ వరలక్ష్మి ఆధ్వర్యంలో దెబ్బతిన్న పంటలపై ప్రాథమిక అంచనా వేశారు. దాదాపు 29 మండలాల్లో వ్యవసాయ పంటలు 37,941 ఎకరాల్లో నష్టం వాటిల్లగా, ఉద్యాన పంటలు 200 హెక్టార్లకు పైగా దెబ్బతినింది. దొర్నిపాడు, కోవెలకుంట్ల, చాగలమర్రి, హొళగుంద, కొలిమిగుండ్ల, కోసిగి, బండి ఆత్మకూరు మండలాల్లో పంటలు దెబ్బతిన్నాయి. ఈ మండలాల పరిధిలో కోట్లాది రూపాయల పంటనష్టం జరిగినట్లు ప్రాథమిక అంచనా వేశారు. దొర్నిపాడు మండలంలోని మూడు గ్రామాల్లో వరి 100 ఎకరాలు, కోవెలకుంట్ల మండలంలో రెండు గ్రామాల్లో 50 ఎకరాల్లో వరి, చాగలమర్రి మండలంలో ఐదు గ్రామాల్లో 600 ఎకరాల్లో వరి, 1628 ఎకరాల్లో శనగ, 450 ఎకరాల్లో మినుము దెబ్బతినింది. కొలిమిగుండ్ల మండలంలోని 9 గ్రామాల్లో 5వేల ఎకరాల్లో శనగ దెబ్బతినింది. కోసిగి మండలంలో ఐదు గ్రామాల్లో 600 ఎకరాల్లో వరి, బండి ఆత్మకూరు మండలంలో 11 గ్రామాల్లో 1100 ఎకరాల్లో వరి పంట దెబ్బతినింది.

- Advertisement -


క్షేత్రస్థాయిలో వివరాలు సేకరణ :
వారం రోజులుగా కురుస్తున్న వర్షాలకు దెబ్బతిన్న పంటలను క్షేత్రస్థాయిలో అధికారులు అంచనా వేస్తున్నారు. జిల్లాకు రాష్ట్ర సస్యరక్షణ ప్రధాన శాస్త్రవేత్త పి.రామక్రిష్ణారావు ఆధ్వర్యంలో జేడిఏ వరలక్ష్మి, ఏడిఏ, ఏఓలు నందికొట్కూరు డివిజన్‌లో దెబ్బతిన్న పంటలను ముందుగా ఏటి బన్నూరు గ్రామ రైతులతో మాట్లాడారు. ఏఓ రంగారెడ్డిని అడిగి వివరాలు తెలుసుకున్నారు.


పొంగి పొర్లుతున్న వాగులు, వంకలు :
జిల్లాలో కురుస్తున్న వర్షాల వల్ల ప్రధాన వాగులు, వంకలు పొంగి పొర్లుతున్నాయి. ముఖ్యంగా కేసీ కెనాల్‌ కాల్వలు ఉదృతంగా ప్రవ హిస్తున్నాయి. కార్తీక పౌర్ణమి సందర్భంగా నగరంలోని వినాయక ఘాట్‌ వద్ద ఉన్న కేసీ కెనాల్‌లో భార్య కార్తీక దీపాన్ని వదిలేందుకు వెళ్లి కేసీ కెనాల్‌లో పడిపోవడంతో ఆమెను కాపాడేందుకు వెళ్లిన భర్త కూడా ఆమెతో పాటు నీటిలో కొట్టుకుపోయారు. 3వపట్టణ సిఐ తబ్రేజ్‌ ఆధ్వర్యంలో ప్రత్యేకంగా కాల్వ పరిసర ప్రాంతాల్లో తనిఖీ చేయగా జొహరాపురం బ్రిడ్జి వద్ద మృతదేహాలను గుర్తించారు.


37,941 ఎకరాల్లో పంట నష్టం :
జిల్లాలో వారం రోజులుగా కురుస్తున్న వర్షాలకు 29 మండలాల్లో 37,491 ఎకరాల్లో పంటనష్టం వాటిల్లినట్లు క్షేత్రస్థాయిలో అధికార యంత్రాంగం ప్రాథమిక అంచనా వేశారు. గత రెండు రోజుల్లోనే దాదాపు 20వేల ఎకరాల్లో పంటనష్టం జరిగింది. నష్టం వివరాలను జేడీఏ వరలక్ష్మి ప్రత్యేకంగా వివరించారు. ఆళ్లగడ్డ డివిజన్‌లోని చాగలమర్రి, ఆళ్లగడ్డ, రుద్రవరంలో 200 ఎకరాల్లో, కోవెలకుంట్ల డివిజన్‌లోని కొలిమిగుండ్ల, సంజామల, ఉయ్యాలవాడ, అవుకు, కోవెలకుంట్ల మండలాల్లో 1602 ఎకరాల్లో, ఆదోని డివిజన్‌లోని ఆదోని మండలంలోని 98 ఎకరాలు, ఆలూరు డివిజన్‌లోని ఆలూరు, ఆస్పరి, చిప్పగిరి మండలాల్లో 18,880 ఎకరాలు, డోన్‌ డివిజన్‌లోని ఐదు గ్రామాల్లో 42ఎకరాలు, నంద్యాల డివిజన్‌లోని మహానంది మండలంలోని రెండు గ్రామాల్లో 230 ఎకరాలు, ఆళ్లగడ్డ డివిజన్‌లోని చాగలమర్రి, గోస్పాడు, శిరివెళ్ల, రుద్రవరం మండలాల్లో 673 ఎకరాల్లో మొత్తం 37,941 ఎకరాల్లో పంటలు దెబ్బతినగా అందులో వరి 37,743 ఎకరాలు,శనగ 1375 ఎకరాలు, జొన్న 1779 ఎకరాలు, పత్తి 448 ఎకరాలు, వేరుశనగ 46 ఎకరాలు, ఇతర పంటలు ఉన్నాయి. ఇప్పటివరకు 29 మండలాల్లో 244 గ్రామాల్లో 37941 ఎకరాల్లో పంటనష్టం జరగగా, అధికంగా 33,743 ఎకరాల్లో వరి నష్టం జరిగిందని జేడీఏ తెలిపారు. ప్రాథమిక అంచనా నివేదికను కలెక్టర్‌ ద్వారా కమీషనర్‌కు పంపుతామన్నారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement