Thursday, November 21, 2024

3 వేల ఎకరాల్లో పంట నష్టం, నాలుగు జిల్లాల్లో అధిక ప్రభావం

అమరావతి, ఆంధ్రప్రభ: రాష్ట్రంలో గత మూడు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలతోపాటు ఎగువ నుండి గోదావరికి వస్తున్న వరదలు రైతాంగాన్ని అతలాకుతలం చేస్తున్నాయి. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలు, వరదల ప్రభావంతో రాష్ట్రంలోని నాలుగు జిల్లాల పరిధిలో 3,101 ఎకరాలకు పైగా వ్యవసాయ పంటలు నీట మునిగాయని అధికారులు అంచనా వేస్తున్నారు. ప్రాథమిక నివేదిక ఆధారంగా తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి, ఏలూరు, డాక్టర్‌ బీఆర్‌ అంబేద్కర్‌ కోనసీమ, అనకాపల్లి జిల్లాల్లోని 49 మండలాల్లోని 247 గ్రామాల్లో వరి నారుమళ్లతో పాటు- వరి, పత్తి పంటలు నీట మునిగాయి. తూర్పుగోదావరి జిల్లాలో అత్యధికంగా 1,960 ఎకరాల్లో వ్యవసాయ పొలాలు మునిగిపోగా, ఏలూరులో 815 ఎకరాల్లో వరి నారుమళ్లు, వరి, పత్తి నీటమునిగాయి. వర్షాలు మరిన్ని రోజులు ఇలానే కురిస్తే నష్టం ఇంతకంటే ఎక్కువగా ఉంటు-ందని వ్యవసాయ శాఖ అధికారులు అంచనావేస్తున్నారు. రానున్న మూడు రోజుల్లో రాష్ట్రంలో పలు చోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని ఇప్పటికే వాతావరణ శాఖ అంచనా వేస్తోంది. ఈనేపథ్యంలో వర్షాలు ఆగకపోతే మరింత పంట నష్టం వాటిల్లే ప్రమాదం ఉందని అధికారులు భావిస్తున్నారు. ముఖ్యంగా గోదావరి ఉధృతంగా ప్రవహించడంతో అనేక పంటలు ముంపునకు గురయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. మరీ ముఖ్యంగా గోదావరి పరీవాహక ప్రాంతాల్లోని ద్వీప గ్రామాలలో సాగవుతున్న పంటలపై ఈవరదలు పెను ప్రభావాన్ని చూపనున్నాయి. వర్షాలు ఆగి, నదిలో నీటిమట్టం తగ్గితే పంటల నష్టం తగ్గుతుందని, లేదంటే పంటనష్టం అధికంగా ఉంటుందని వ్యవసాయ శాఖ అధికారులు అంచనా వేస్తున్నారు. వరదల కారణంగా వరి నారుమళ్లకు తీవ్ర నష్టం వాటిల్లినట్లు తెలుస్తోంది.

ఉద్యాన పంటలపై ప్రభావం తక్కువే :
ఇక ఉద్యాన పంటలకు సంబంధించి ఇప్పటి వరకు వరదల వల్ల నష్టం వాటిల్లిన దాఖలాలు లేవు. అయితే, పై నాలుగు జిల్లాల్లో కూరగాయల తోటలు, తమలపాకు, మునగ తోటలు, ఆకు కూరలు వంటివి పాక్షికంగా దెబ్బతిన్నట్లు తెలుస్తోంది. ఇక నర్సరీలపై కూడా కొద్దో గోప్పో ఈ ప్రభావం ఉండే అవకాశం ఉందని వ్యవసాయ రంగ నిపుణులు చెబుతున్నప్పటికీ ఇప్పటి వరకూ వీటిపై ఎటువంటి ప్రభావం లేదని అధికారులు చెబుతున్నారు. భారీ వర్షాలు కురిస్తే తప్ప, ప్రత్యేకించి కొన్ని రకాల ఉద్యాన పంటలపై ఎలాంటి ప్రభావం ఉండదని పేర్కొంటున్నారు. అయితే, కొన్ని ప్రాంతాల్లో కూరగాయల పంటలు నీటమునిగాయని, వర్షాలు తగ్గుముఖం పట్టి, వరద నీరు పోయిన తర్వాత అవి కోలుకుంటాయని రైతులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. ఇదిలా ఉండగా, వర్షం, వరదల వల్ల దెబ్బతిన్న జిల్లాల్లో పంటలకు ఏ మేరకు నష్టం వాటిల్లిందో అంచనా వేయడానికి అధికారుల బృందాలు ముంపునకు గురైన పొలాలను సందర్శించాలని రైతులు కోరారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి.

Advertisement

తాజా వార్తలు

Advertisement