Friday, November 22, 2024

ఎపి అన్న‌దాత న‌డ్డి విరిచిన అకాల వ‌ర్షాలు…

అమరావతి, ఆంధ్రప్రభ బ్యూరో : అకాల వర్షాలు అన్నదాతల వెన్ను విరుస్తున్నాయి. గతంలో ఎన్నడూ లేని విధంగా మార్చి, ఏప్రిల్‌ మండు వేసవిలో అకాల వర్షాలు రైతులను వెంటాడుతు న్నాయి. తాజాగా ఆదివారం రాష్ట్రవ్యాప్తంగా పలు జిల్లాల్లో పిడుగులతో కూడిన భారీ వర్షం కురిసింది. కొన్ని ప్రాంతాల్లో బలమైన ఈదురు గాలులకు అరటి, మామిడి పంటలు దెబ్బ తిన్నాయి. గోదావరి జిల్లాల్లో అత్యధికంగా 75 వేల ఎకరాలకుపైగా పంటలు దెబ్బతిన్నట్లు ప్రాథమిక అంచనా. అదే జిల్లాలో మరికొన్ని ప్రాంతాల్లో కొనుగోలు కోసం కుప్పలు పోసిన ధాన్యం తడిసి ముద్దైంది. అలాగే కృష్ణా జిల్లాలో మరో 10 వేల టన్నుల ధాన్యం అకాల వర్షానికి తడిసిపోయింది. ఇదే జిల్లాలో వేర్వేరు ప్రాంతాల్లో పిడుగులు పడి ఐదు వరి ధాన్యం కుప్పలు దగ్ధమయ్యాయి. ఒకటి రెండు రోజుల్లో ధాన్యాన్ని కొనుగోలు కేంద్రాలకు తరలించి విక్రయించాలని చూస్తున్న రైతులకు అకాల వర్షం కోలుకోలేని దెబ్బ తీసింది. గత నెలలో కురిసిన వర్షాలకు రాష్ట్రంలోని వివిధ జిల్లాల్లో రెండు లక్షల ఎకరాలకుపైగా పంటలు దెబ్బతిన్నాయి. సుమారు రూ.400 కోట్లకుపైగా విలువైన పంటను రైతులు కోల్పోయారు. ఆ షాక్‌ నుండి కర్షకులు తేరుకోకముందే ఆదివారం మరోసారి ప్రకృతి రైతులపై కన్నెర్ర చేసింది. దీంతో అమ్మకానికి సిద్ధంగా ఉన్న ధాన్యం కళ్లముందే తడిసి ముద్దైంది. గోదావరి జిల్లాలతోపాటు కృష్ణా, గుంటూరు, ప్రకాశం, నెల్లూరు జిల్లాల్లోని మరికొన్ని ప్రాంతాల్లో పిడుగులతో కూడిన భారీ వర్షానికి వరి పంటతోపాటు సజ్జ, మొక్క జొన్న వంటి ఆరుతడి పంటలు, కాపుకు వచ్చిన అరటి, మామిడి తోటలు పూర్తిగా దెబ్బతిన్నాయి. దీంతో కోట్లాది రూపా యల విలువైన పంటలను రైతులు మరోసారి కోల్పోవాల్సి వచ్చింది. పంట నష్టాలపై అధికారులు పూర్తిస్థాయి సర్వే చేస్తే నష్టాల అంచనా మరింత పెరిగే అవకాశం ఉంది.

జిల్లాల్లో ఇలా…
ప్రకృతిని నమ్ముకుని పంటను సాగుచేస్తున్న అన్నదాతలకు అనేక సందర్భాల్లో వాతావరణం కలసివస్తున్నప్పటికీ ప్రస్తుత సీజన్‌లో మాత్రం పంటను తడపాల్సిన చినుకే అకాల వర్ష రూపంలో అన్నదాతను చిదిమేస్తుంది. ఆదివారం కురిసిన అకాల వర్షాలకు కోనసీమ జిల్లాలోని అమలాపురం ప్రాంతంలో తెల్లవారు ఝాము నుండి ఎడతెరపి లేకుండా కురిసిన వర్షాలకు జిల్లా వ్యాప్తంగా సుమారు 1.72 లక్షల ఎకరాల్లో సాగు చేసిన పంటలో ఎక్కువ శాతం పంట దెబ్బతింది. ఇప్పటి వరకూ 30 శాతం పైగా విస్తీర్ణంలో కోతలు పూర్తయ్యాయి. అక్కడక్కడా ధాన్యం కొనుగోలు ప్రారంభమయ్యాయి. అయితే, అకాల వర్షం కొనుగోలుకు సిద్దంగా ఉన్న ధాన్యాన్ని తడిపేయడంతో చేతికొచ్చిన పంట చేజారింది. దీంతో రైతులు కంటతడి పెడుతున్నారు. కొనుగోలు కేంద్రాల వద్ద ధాన్యం విక్రయించేందుకు జరుగుతున్న పలు లోపాల వల్లే ఈప్రాంతంలో రైతులు ఎక్కువ ధాన్యాన్ని నష్టపోవాల్సి వచ్చిందంటూ రైతులు ఆవేదన వ్యక్తంచేస్తున్నారు. అలాగే ముమ్మడివరం నియోజకవర్గ పరిధిలో వందలాది ఎకరాల్లో చేతికి అందిన పంట నీటిపాలైంది. కొన్ని ప్రాంతాల్లో కయ్యల్లోనే ధాన్యం ఉంది. మరో రోజు వర్షం కురిస్తే మాత్రం రైతులు పూర్తిగా పంటలపై ఆశలు వదులుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. అలాగే ఇదే ప్రాంతంలో ఈదురు గాలులకు కొబ్బరిచెట్లు నేలకొరిగాయి. కృష్ణా జిల్లా పరిధిలో కురిసిన వర్షానికి ఆరపోసిన ఐదు ధాన్యం కుప్పలపై పిడుగులు పడటంతో పూర్తిగా దగ్ధమయ్యాయి. దీంతో ఆప్రాంతానికి చెందిన రైతులు ప్రస్తుత సీజన్‌లో పంటను మొత్తం కోల్పోవాల్సి వచ్చింది.

అదేవిధంగా రాజోలులో 261 ఎకరాల్లో ధాన్యం, మరో 420 ఎకరాల్లో కుప్పలు పోసిన వరి పూర్తిగా తడిసి ముద్దైంది. మోపిదేవి, మోళ్లమర్రు, రాంనగర్‌, చల్లపల్లి తదితర ప్రాంతాల్లో కూడా పంటలు దెబ్బతిన్నాయి. ప్రకాశం, నెల్లూరు జిల్లాల పరిధిలోని ఉలవపాడు, కందుకూరు, కావలి తదితర ప్రాంతాల్లో ఈదురు గాలులకు మామిడి కాయలు నేల రాలాయి. దీంతో ప్రతి వేసవిలో ఇతర దేశాలకు ఎగుమతి చేసే ఉలవపాడు బంగినపల్లి రైతుకు ఆరంభంలోనే ఎదురుదెబ్బ తగిలినట్లయింది. త నెల మార్చిలో కురిసిన అకాల వర్షాలు, వడగండ్ల వర్షానికి రాష్ట్ర వ్యాప్తంగా 10 జిల్లాల పరిధిలో సుమారు 2 లక్షల ఎకరాల్లో పంట దెబ్బతింది. అలాగే రూ. 400 కోట్లకుపైగా విలువైన పంటలను రైతులు కోల్పోవాల్సి వచ్చింది. వ్యవసాయ శాఖ ప్రాథమిక అంచనాలను కూడా సిద్ధం చేసింది. వడగండ్ల వాన కురిసిన ప్రాంతాల్లో కనిష్టంగా ఒక ఎకరాకు రూ. 20 వేల వరకూ నష్టం వచ్చినట్లు అంచనా వేసింది. అప్పట్లో వరి, మొక్కజొన్న రైతులు ఎక్కువగా నష్టపోయారు. ఆషాక్‌ నుండి రైతులు కోలుకోక ముందే తాజాగా ఆదివారం పిడుగులతో కూడిన భారీ వర్షం అన్నదాతల వెన్ను విరిచింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement