Friday, November 22, 2024

AP | సాగు చేస్తేనే అప్పు.. నకిలీ పంట రుణాలకు చెక్‌..

అమరావతి, ఆంధ్రప్రభ: పంట రుణాల్లో భారీ సంస్కరణలు అమలు చేసేందుకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు, బ్యాంకులు ఉమ్మడిగా శ్రీకారం చుడుతున్నాయి. పంట రుణాలకు ఈ-క్రాప్‌ ను తప్పనిసరి చేసేలా నిబంధనల అమలుకు రంగం సిద్ధమవుతోంది. ప్రభుత్వం ఖరీప్‌, రబీ సీజన్‌ లో ప్రకటించే వివిధ పంటల విస్తీర్ణ లక్ష్యాలకు అనుగుణంగా వ్యవసాయం చేసే రైతులకు మాత్రమే ఇకపై బ్యాంకులు రుణాలిచ్చే అవకాశం ఉంటుంది.

ఈ మేరకు బ్యాంకుల పంట రుణాల రిజస్టర్‌ తో రైతుల వివరాలను పొందుపరిచే ఈ-కర్షక్‌, పంట వివరాలను నమోదు చేసే ఈ-క్రాప్‌ పోర్టల్‌ ను అనుసంధానం చేసే ప్రక్రియను అమలు చేయాలని ప్రభుత్వం ప్రతిపాదించగా రాష్ట్ర స్థాయి బ్యాంకర్స్‌ కమిటీ- (ఎస్‌ ఎల్‌ బీసీ)ఆమోదించింది. దీంతో ఈ-క్రాప్‌ డేటాను అనుసరించే రైతులకు బ్యాంకులు రుణాలందించనున్నాయి. దీని వల్ల అనధికారికంగా అంచనాలకు మించి పంటలు పండించే పద్ధతికి స్వస్తి పలకటంతో పాటు డిమాండ్‌-సప్లయ్‌కు అనుగుణంగా వ్యవసాయోత్పత్తులకు మార్కెట్లో గిట్టుబాటు ధర లభ్యమయ్యే అవకాశం ఉందని ప్రభుత్వం భావిస్తోంది.

- Advertisement -

రాష్ట్రంలో ఖరీఫ్‌ సీజన్‌ లో సుమారు కోటి ఎకరాలు..రబీలో 70 వేల ఎకరాల్లో వివిధ పంటలు పండుతున్నట్టు- అంచనా. రాష్ట్రంలో సొంత భూములు కలిగి వ్యవసాయం చేసే రైతుల కంటే కౌలు రైతులు అధికంగా ఉన్నారు. సుమారు 70 శాతం వ్యవసాయభూముల్లో కౌలు రైతులు పంటలు పండిస్తున్నారు. కేవలం పట్టాదారు పాస్‌ పుస్తకాలు, టైటిల్‌ డీడ్ల ఆధారంగా బ్యాంకులు రుణాలివ్వటంతో వడ్డీ రాయితీతో సహా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అందించే అన్ని ప్రయోజనాలు కేవలం భూ యజమానులకు మాత్రమే దక్కుతున్నాయి.

పంట రుణాలు దేశవ్యాప్తంగా అనర్హులకు అందుతూ దుర్వినియోగమవుతున్నాయని కేంద్ర ప్రభుత్వానికి కూడా నివేదికలు అందాయి. ఈ నేపథ్యంలో పంట రుణాలు అర్హులైన రైతులకు పారదర్శకంగా అందాలంటే ఈ-క్రాప్‌ ఒక్కటే ఏకైక మార్గమని ప్రభుత్వం భావిస్తోంది. రాష్ట్ర ప్రభుత్వం ఏడాదిలో 11 నెలల కాలపరిమితితో కౌలు రైతులకు పంట సాగు హక్కు ధృవీకర(సి.సి.ఆర్‌.సి) పత్రాలు అందిస్తోంది. సిసిఆర్‌ సి ఉన్న కౌలు రైతులకు సొంత భూమి కలిగి వ్యవసాయం చేసే రైతులతో సమానంగా అన్ని ప్రయోజనాలు అందాల్సి ఉంటుంది.

సీసీఆర్‌ సీ ఉన్న కౌలు రైతులు ఈ-క్రాప్‌ లో తాము పండించే పంట వివరాలను నమోదు చేసి రైతు భరోసా కేంద్రాల ద్వారా ధృవీకరణ పత్రాలు తీసుకోవచ్చు. ఈ-క్రాప్‌, బ్యాంకు లోన్‌ రిజస్టర్‌ లను అనుసంధానం చేశాక కేవలం వ్యవసాయం చేసే వారికి మాత్రమే రుణాలు అందుతాయి. ఈ విధానాన్ని అవలంబించటం వల్ల అనర్హుల జాబితా తగ్గిపోవటంతో పాటు- వ్యవసాయ పంటల క్రమబద్దీకరణ, సమతుల్యత సాధ్యపడుతుందని అధికారులు చెబుతున్నారు.

రబీ నుంచే మొదలు

ఈ ఏడాది రబీ నుంచే రాష్ట్రంలో అమలు చేస్తున్న డాక్టర్‌ వైఎస్‌ఆర్‌ సున్నా వడ్డీ పంట రుణాలను నూటికి నూరు శాతం ఈ-క్రాప్‌ డేటా ఆధారంగా మంజూరు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. వ్యవసాయ చేస్తున్న భూ యజమానులైన రైతులు, కౌలు రైతుల వివరాలను సేకరించి ఈ-క్రాప్‌ డేటాను అనుసంధానం చేయాల్సి ఉంటుంది. వారిలోనూ లక్ష రూపాయల లోపు బ్యాంకుల నుంచి రుణాలు తీసుకుని నిర్ణీత సమయంలో చెల్లించిన వారి వివరాలను మాత్రమే సున్నా వడ్డీ పంట రుణాల పోర్టల్‌ (ఎస్‌.వీ.పీ.ఆర్‌)లో నమోదు చేయనున్నారు.

దీని వల్ల అర్హులైన వారికి మాత్రమే లబ్ది కలుగుతుంది. ఉదాహరణకు ఖరీప్‌ – 2020ను పరిగణలోకి తీసుకుని ఇటీవల బ్యాంకుల నుంచి గణాంకాలు విస్తుగొలిపేలా ఉణ్నాయి. ఆ ఏడాది 11.03 లక్షల మంది రైతులు బ్యాంకుల నుంచి 6,389 కోట్ల పంట రుణాలు తీసుకున్నారు. వారు బ్యాంకుకు చెల్లించే 7 శాతం వడ్డీలో 4 శాతాన్ని కేంద్ర ప్రభుత్వం తిరిగి చెల్లిస్తుంది. 4 శాతం శాతం చొప్పున కేంద్రం రూ 232.35 కోట్లు చెల్లించాల్సి ఉండగా..ఈ-క్రాప్‌ డేటా ఆధారంగా చూస్తే రూ 112.71 కోట్లు మాత్రమే చెల్లించాల్సి ఉందని లెక్కలు చెబుతున్నాయి.

టైటిల్‌ డీడ్‌, పాస్‌ పుస్తకాల ఆధారంగా బ్యాంకులు 11.03 లక్షల మందికి రుణాలందించినా వారిలో ఈ-క్రాప్‌ లో పంట వివరాలు నమోదు చేసిన రైతులు కేవలం 6.67 లక్షల మంది మాత్రమే. మిగతా వాళ్లంతా అసలు పంటలు పండించారా, లేదా అనే గణాంకాలు లేవు. 2020 ఖరీప్‌ లెక్కులే కాకుండా ఆ తరువాత కాలంలో అన్ని సీజన్లలో బ్యాంకుల నుంచి తీసుకున్న రుణాల పరిస్థితి కూడా దీనికి భిన్నంగా లేదని కేంద్ర వ్యవసాయశాఖ ప్రకటించింది. ఈ నేపథ్యంలో ఈ-క్రాప్‌ ను పంటరుణాలకు తప్పనిసరి చేయటం ద్వారా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చెల్లించే సబ్సిడీ, ఇతర రాయితీలు భారీగా తగ్గుముఖం పట్టే అవకాశం ఉందని అంచనా.

Advertisement

తాజా వార్తలు

Advertisement