న్యూఢిల్లీ, ఆంధ్రప్రభ : మనదేశంలో 2022-23 సంవత్సరంలో 19 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలు ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన పథకాన్ని అమలు చేస్తున్నాయని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. 2022 ఖరీఫ్ సీజన్‌లో ఈ పథకంలో చేరేందుకు ఏపీ అంగీకరించిందని కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి నరేంద్ర సింగ్ తోమర్ నరసరావుపేట ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు అడిగిన ప్రశ్నలకు మంగళవారం బదులిచ్చారు. ఈ పథకంలో కొన్ని సవరణల వల్ల రాష్ట్రాలపై పెరిగిన భారం, కొన్ని రాష్ట్రాలు ఈ పథకం నుంచి వైదొలిగాయా? వీటిపై కేంద్రం తీసుకుంటున్న చర్యలేంటని శ్రీకృష్ణదేవరాయలు ప్రశ్నించారు.
1999-2000లో నేషనల్ అగ్రికల్చర్ ఇన్సూరెన్స్ స్కీమ్ పథకం కింద కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య ప్రీమియం సబ్సిడీ షేరింగ్ విధానం 50:50గా ఉండగా, ఆ తర్వాత దాన్ని సవరించారని కేంద్రమంత్రి తెలిపారు. 2022 ఖరీఫ్ సీజన్ నుంచి ఈశాన్య రాష్ట్రాలకు 90:10గా ఉందని వివరించారు. వాతావరణ పరిస్థితుల ఆధారంగా ఎక్కువ పంటలను కవర్ చేసుకోవడానికి, ఎదురయ్యే పంట నష్టాలను నమోదు చేసుకోవడానికి రాష్ట్రాలకు మరింత స్వేచ్ఛ ఇచ్చినట్లు తోమర్ వెల్లడించారు. రాష్ట్రాల అభ్యర్థనల ప్రకారం ప్రత్యామ్నాయ రిస్క్ మేనేజ్‌మెంట్ మోడళ్లను కూడా ప్రత్యేక అంశంగా ఆమోదించినట్టు జవాబులో పేర్కొన్నారు.
లోకల్ టు గ్లోబల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్బుక్, ట్విటర్, టెలిగ్రామ్ పేజీలను ఫాలో అవ్వండి.