Wednesday, November 20, 2024

కోనసీమలో క్రాప్‌ హాలిడే.. తొలకరి సాగుకు రైతులు దూరం…

కాకినాడ, ఆంధ్రప్రభ : పదేళ్ళ క్రితం నాటి పరిస్థితులు తిరిగి కోనసీమలో తలెత్తాయి. 2011లో కాలువల్లో పూడికలు తీయకుండానే నీటి విడుదల చేసిన కారణంగా వరద ముంచెత్తి పంట మొత్తం కోల్పోతామన్న భయంతో కోనసీమ రైతాంగం క్రాప్‌ హాలిడే ప్రకటించింది. సాక్షాత్తు అప్పటి ముఖ్యమంత్రే రైతుల్తో చర్చలు జరిపినా ఈ నిర్ణయం నుంచి రైతులేమాత్రం వెనక్కి తగ్గలేదు. కాగా ఇప్పుడు రబీలో పండిన ధాన్యాన్ని కొనుగోలు చేసిన ప్రభుత్వం ఇంతవరకు చెల్లింపులు పూర్తి చేయలేదు. ఈ సారి ముందస్తుగా ఖరీఫ్‌ మొదలెట్టాలని ప్రభుత్వం సూచించింది. దాదాపు 15రోజులు ముందుగానే కాలువలకు నీటిని విడుదల చేసింది. అయితే రైతుల చేతుల్లో చిల్లిగవ్వలేదు. సాగుకు అవసరమైన పెట్టుబడి అందుబాటులో లేదు. అప్పులు కూడా పుట్టడంలేదు. కాలువలకు మరమ్మతులు నిర్వహించలేదు. ఈ కారణాలన్నింటిని దృష్టిలో పెట్టుకుని తొలకరిలో క్రాప్‌ హాలిడే ప్రకటించాలని కోనసీమ రైతాంగం సనన్నద్దమైంది. తొలుత ఐ పోలవరం మండలంలోని ఒకట్రెండు గ్రామాల్లో ఈ ఉద్యమం మొదలైంది. ఇది ముమ్మిడివరం మండలం కొత్తలంక గ్రామానికి పాకింది. అక్కడ్నుంచి చినకొత్తలంక, కర్రివాని రావు, అయినాపూరం గ్రామాలకు విస్తరించింది. ఆ తర్వాత ఉప్పలగుప్తం, కాట్రేనికోన, అల్లవరం రైతులు కూడా ఖరీఫ్‌లో పంట విరామానికి సన్నద్దమయ్యారు. ఇప్పటికే 9మండలాల రైతులు ఈ నిర్ణయానికొచ్చేశారు. కోనసీమలోని మిగిలిన 7మండలాలకు కూడా ఇప్పుడీ ఉద్యమం వేగంగా విస్తరిస్తోంది. మంగళవారం ఐ పోలవరం మండల కేంద్రంలో రైతులు సమావేశమయ్యారు. పంట విరామాన్ని పాటిస్తున్నట్లు తహశీల్ధార్‌కు అల్టిమేటం జారీ చేశారు. అలాగే ముమ్మిడివరంలోనూ రైతు సంఘ ప్రతినిధులు తహశీల్ధార్‌ కార్యాలయాన్ని ముట్టడించారు. ధాన్యం సొమ్ముల బకాయిని వెంటనే విడుదల చేయాలంటూ డిమాండ్‌ చేశారు. మండల వ్యాప్తంగా తొలకరిని సాగు చేయడంలేదంటూ తహశీల్ధార్‌కు స్పష్టం చేశారు.

ఈ సందర్భంగా రైతు సంఘ ప్రతినిధులు మాట్లాడుతూ జలవనరుల శాఖ రూ.50కోట్లతో కోనసీమలో క్లోజర్‌ పనులు చేపట్టాల్సుంది. కానీ ఒక్క పిల్లకాలువ కూడా మరమ్మతులు చేయలేదు. చేయకుండానే సాగు నీటిని ఈ నెల 1వ తేదీన కాలువలకు విడుదల చేశారు. పలుచోట్ల లాకులు, గేట్లు, శిథిలావస్థకు చేరుకున్నాయి. ఈ దశలో సాగు చేస్తే అక్టోబర్‌, నవంబర్‌ మాసాల్లో వచ్చే భారీ వర్షాలకు, వరదలకు భూములన్నీ మునిగిపోయే ప్రమాదముంటుందన్నారు. అప్పులు చేసి చేపట్టిన సాగు ప్రకృతి కన్నెర్రకు గురౌతోందన్నారు. కనీసం అప్పు చేద్దామన్నా దిక్కులేని పరిస్థితి నెలకొందన్నారు. ప్రభుత్వం చెల్లించాల్సిన బకాయిలు ఇవ్వలేదన్నారు. రాన్రాను సాగు తీవ్ర వ్యయభరితంగా మారిందన్నారు. పెట్టిన పెట్టుబడికి ప్రభుత్వం ప్రకటిస్తున్న మద్దతు ధఱకు మధ్య తీవ్ర వ్యత్యాసం ఉంటోందంటూ వాపోయారు. ఏటా ఎకరానికి 15వేల వరకు నష్టం వస్తోందన్నారు. పైగా ధాన్యం సేకరించిన తర్వాత నెలల తరబడి అధికారులు చెల్లింపుల కోసం తమ చుట్టూ తిప్పుకుంటున్నారన్నారు. వరి నాట్లు, కోతల సమయంలో ఉపాధి హామీ పథకాన్ని నిలుపు చేయాలని రైతులు ఎంతగా డిమాండ్‌ చేసినా ప్రభుత్వం పట్టించుకోవడంలేదన్నారు. దీంతో కూలీలు దొరకడంలేదు.. దొరికినా అధిక మొత్తం చెల్లించాల్సొస్తోంది. ఎరువులు, పురుగుల మందులు, డీజిల్‌ ధరలు పెరిగాయంటూ ఐలాండ్‌ రైతు సంఘ నాయకులు జంపన భీమరాజు, సోమయాజుల సుబ్బారావు, కాశిబాబులు స్పష్టం చేశారు.

ఫలించని చర్చలు..

కోనసీమ రైతాంగ ప్రతినిధుల్తో అమలాపురం ఆర్‌డిఓ వసంతరాయుడు మంగళవారం చర్చలు జరిపారు. రైతుల్ని బుజ్జగించేందుకు ప్రయత్నించారు. రైతుకు ప్రభుత్వం అన్ని విధాలా సహకరిస్తోందన్నారు. వ్యవసాయోత్పత్తులకు గిట్టుబాటు ధర కల్పిస్తామన్నారు. రైతుల డిమాండ్‌ను సిఎమ్‌ దృష్టికి తీసుకెళ్తామన్నారు. మైనర్‌, మేజర్‌ డ్రైన్లను ఆధునీకరిస్తామన్నారు. ముంపు బెడద లేకుండా చూస్తామన్నారు. పంట విరామ ప్రకటనను ఉపసంహరించుకోవాలని కోరారు. పంట విరమణకు సిద్దమైన రైతులపై మంత్రి పినిపే విశ్వరూప్‌ చేసిన వ్యాఖ్యలు ఈ సందర్భంగా ప్రస్తావ నకొచ్చాయి. వీటిపై రైతు సంఘ ప్రతితనిధులు ఆర్‌డిఓ వద్ద తీవ్ర అభ్యంతరం తెలిపారు. వాటిని పట్టించుకోవద్దంటూ ఆర్‌డిఓ రైతులకు సూచించారు. అయితే రైతులు మాత్రం ఆర్‌డిఓ అభ్యర్ధనను ఏమాత్రం మన్నించలేదు. పంట విరామానికి కట్టుబడుున్నట్లు తేల్చిచెప్పేశారు. పైగా ఈ సారి సాగు విరమిస్తే ఎకరానికి పదివేల వరకు తమకు మిగులుతాయని, సాగు చేస్తే పదివేలకు పైగా నష్టపోవడం తప్పదని స్పష్టంచేశారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి.

Advertisement

తాజా వార్తలు

Advertisement