వంట నూనెకు కృత్రిమ కొరత సృష్టించి అధిక ధరలకు విక్రయిస్తే క్రిమినల్ కేసులు పెట్టి కఠిన చర్యలు తీసుకుంటామని ఒంగోలు జిల్లా సంయుక్త కలెక్టర్ జె.వెంకటమురళి హెచ్చరించారు. వంట నూనె హోల్సేల్, రిటైల్ ఏజెన్సీల అసోసియేషన్ నాయకులతో సోమవారం స్థానిక ప్రకాశం భవనంలోని తన ఛాంబరులో ఆయన అత్యవసర సమావేశం నిర్వహించారు. వంట నూనె కంపెనీలు, సరఫరాదారులు లాభాలు ఆశించకుండా సాధారణ ధరకు విక్రయించాలని జె.సి.మురళి తెలిపారు. ప్రభుత్వానికి ప్రజలకు ఎలాంటి ఇబ్బంది కలుగకుండా చూడాలని ఆయన సూచించారు. నల్లబజారులో అధిక ధరలకు వంటనూనెను అక్రమంగా విక్రయిస్తే వారి లైసెన్స్లు రద్దు చేస్తామన్నారు. ఉక్రెయిన్ యుద్ధాన్ని సాకుగా చూపి నూనె కంపెనీదారులు అధిక ధరలకు విక్రయిస్తున్నారని ఆరోపణలపై ప్రభుత్వం స్పందించిందన్నారు. స్థిరమైన మార్గదర్శకాలతో ఈనెల 11న జి.వో. నెం.4ను జారీ చేసిందన్నారు. ప్రభుత్వ ఉత్తర్వుల మేరకు వంటనూనె హోల్సేల్, రిటైల్ వ్యాపారులు తక్షణహే తమ ఏజెన్సీ పేర్లను ఆన్లైన్లో నమోదు చేసుకోవాలన్నారు. ప్రతి రోజు వారికి వచ్చే నూనె, వారివద్ద నిల్వలను ప్రభుత్వం ప్రవేశపెట్టిన వెబ్ పోర్టల్లో ఎప్పటికప్పుడు నమోదు చేయాలన్నారు. ఆసంస్థలు నమోదు చేసిన వివరాల ఆధారంగా విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్, పుడ్సేప్టీ అధికారులు, తూనికలు మరియు కొలతలు అధికారులు బృందాలుగా ఏర్పడి నిరంతరం తనిఖీలు చేయాలని ప్రభుత్వం ఆదేశించిందన్నారు.
ప్రభుత్వం సూచించిన ప్రమాణాలు పాటించడంపై అధికారులు డికాయ్ ఆపరేషన్ పక్కాగా నిర్వహించాలని జెసి ఆదేశించారు. హోల్సేల్ వ్యాపారుల వద్ద 500 క్వింటాల్ల వంట నూనె, 2000 క్వింటాల్ల నూనె విత్తనాలకు మించి ఉండరాదన్నారు. రిటైల్ వ్యాపారుల వద్ద 30 క్వింటాళ్ల వంటనూనె, 100 క్వింటాళ్ల వంటనూనె విత్తనాలు మాత్రమే ఉండాలని ఆయన చెప్పారు. యుద్ధాన్ని సాకుగా చూపి అధిక ధరలకు వంటనూనె విక్రయించడం నేరమన్నారు. ఎమ్మార్పీ ధరలకంటే అధికంగా విక్రయిస్తే కేసు నమోదు చేస్తామన్నారు. నూనె ప్యాకట్లపై ఎమ్మార్పీ ధరలను తుడిచివేయడం, కృత్రిమ కొరతను సృష్టించడం, అక్రమ నిల్వలను ఉంచితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు నూనె తరలించే వాహనాలను ట్రాకింగ్ చేస్తామన్నారు. ప్రస్తుతం కంపెనీలు ప్యాకింగ్ లేకుండా విడిగా విక్రయిస్తున్నాయని వ్యాపారులు జెసికి వివరించారు. వాటి ధరలను ప్రభుత్వం సూచించిన మేరకు విక్రయించాలని ఆయన తెలిపారు.
లోకల్ టు గ్లోబల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్బుక్, ట్విటర్, టెలిగ్రామ్ పేజీలను ఫాలో అవ్వండి..