గుంటూరు క్రైo, (ప్రభా న్యూస్): పెద్ద మొత్తంలో నగదు తీసుకువెళ్తున్న వారిని గుర్తించి, వెంబడించి ఆదమరిచి ఉన్న సమయంలో డబ్బు చోరీ చేసే ముఠాలోని ఓ దొంగను సౌత్ డిఎస్పి ఆధ్వర్యంలో మేడికొండూరు పోలీసులు అరెస్టు చేశారు. సోమవారం కేసుకు సంబంధించిన వివరాలను విలేకర్ల సమావేశంలో డీఎస్పీ ప్రశాంతి వివరించారు. ఈ నెల 11వ తేదీన సుమారు 12గంటల ప్రాంతంలో మనోజ్ తన అప్పి ఆటో లో బాడుగకు సత్తెనపల్లి, నరసరావుపేట వెళ్ళాడు. ఈ క్రమంలో నరసరావుపేటలో మహాలక్ష్మి ఎలక్ట్రానిక్ షాప్ నుండి సామాన్లు పంపుటకు అడ్వాన్స్ గా 2.25 లక్షలు తీసుకున్నాడు. అనంతరం మనోజ్ నిద్ర వస్తుంటే పేరేచర్ల బ్రిడ్జి సమీపంలోని హనుమాన్ హోటల్ వద్ద తన ఆటోను (ap07tg7516) నిలిపి డబ్బు సంచిని తన ఆటోలోనే ఉంచి టీ తాగడానికి వెళ్ళాడు.
అయితే ఆటోను నరసరావుపేట నుండి వెంబడిస్తున్న దొంగలు అదును దొరికిందని ఆటోలో సీటు కింద పెట్టిన నగదును తీసుకొని ఉడాయించారు. టీ తాగి వచ్చిన అనంతరం ఆటోడ్రైవర్ మనోజ్ సీటు కింద గమనించగా డబ్బు కనిపించలేదు. వెంటనే మనోజ్ మేడికొండూరు పోలీసులను ఆశ్రయించాడు. కేసును ఛాలెంజ్ గా తీసుకున్న సౌత్ డి.ఎస్.పి ప్రశాంతి కర్నాటక రాష్ట్రం, శివమొగ్గ జిల్లా, భద్రావతి టౌన్ కి చెందిన పరశురామ సురేష్ ను అదుపులోకి తీసుకొని విచారించారు.
విచారణలో సురేష్ తో పాటు మరో ఇద్దరు నిందితులు ఉన్నట్లు వెల్లడైంది. సురేష్ ను అదుపులోకి తీసుకొని మేడికొండూరు పోలీసులు అతని వద్దనుండి 1,26,000నగదును స్వాధీనం చేసుకున్నారు. అయితే నిందితుడు సురేష్ గూడూరులో మరో చోరీ కేసు చేసినట్లు విచారణలో ఒప్పుకున్నట్లు సౌత్ డి.ఎస్.పి తెలిపారు. ఈ కేసును పరిష్కరించడానికి సహకరించిన మేడికొండూరు సిఐ మారుతి కృష్ణ, ఎస్సై నరహరి, కానిస్టేబుళ్లు కే గోపాల్ కృష్ణ, డేవిడ్ లను డిఎస్పీ అభినందించారు.
లోకల్ టు గ్లోబల్.. ఆంధ్రప్రభ న్యూస్ కోసం ఫేస్బుక్, ట్విట్టర్ పేజీలను ఫాలో అవ్వండి..