(కడప బ్యూరో – ప్రభ న్యూస్) : వైఎస్ఆర్ జిల్లాలో పోలీస్ శాఖ సమర్ధవంతంగా పనిచేయడం వల్లే 2023 లో నేరాలు గణనీయంగా తగ్గాయని, పోలీసులు సమష్టిగా పనిచేయడం వల్లనే ఇది సాధ్యమైందని జిల్లా ఎస్.పి సిద్దార్థ్ కౌశల్ పేర్కొన్నారు. జిల్లా క్రైమ్ రివ్యూ పై ఎస్పీ మాట్లాడుతూ… పోలీసింగ్ లో వినూత్నమైన మార్పులు తీసుకురావడంతోనే ఇది సాధ్యమైనదని, మరింత ద్విగుణీకృత ఉత్సాహంతో 2024 లో మరింత మెరుగైన పోలీసింగ్ తో ప్రజలకు ఉత్తమమైన సేవలు అందిస్తామన్నారు. గత సంవత్సరంతో పోల్చుకుంటే 2023లో అన్ని రకాలైన నేరాలు నియంత్రణలో గణనీయమైన మార్పు కనిపించిందన్నారు. గతంలో నమోదైన కేసులతో పోల్చుకుంటే ఎక్కువ స్థాయిలో నేరాలను నియంత్రించడంలో పోలీసులు సఫలీకృతమయ్యారు.
గణనీయంగా నేరాలు తగ్గుదల:..
విజిబుల్ పోలీసింగ్, అసాంఘీక శక్తులపైనా నిఘా, అవగాహన కార్యక్రమాలను చేపట్టడం, పీడీ యాక్ట్ ప్రయోగం, నాటుసారా, అక్రమ మద్యంపై ఉక్కుపాదం మోపడం, కన్విక్షన్ బేస్డ్ పోలీసింగ్ పై ప్రత్యేక దృష్టి సారించడం, గంజాయి పైన కట్టడి వాళ్ళ నేరాలు తగ్గుముఖం పట్టాయని జిల్లా ఎస్.పి తెలియచేశారు. శరీర ఘాత నేరాల్లో (బాడిలి అఫెన్సెస్) లో గణనీయమైన తగ్గుదల నమోదైందన్నారు. గత ఏడాది 951 కేసులు నమోదు కాగా 2023లో 681 కేసులు నమోదై 29శాతం తగ్గుదల నమోదైందన్నారు.
ప్రాపర్టీ నేరాల కేసుల్లో 26 శాతం తగ్గుదల:..
2022 సంవత్సరంలో మొత్తం 407 ప్రాపర్టీ నేరాల కేసులు నమోదు కాగా, ఈ ఏడాది 303 కేసులు నమోదై 26శాతం తగ్గుదల నమోదైందన్నారు. ఇందులో రాత్రి దొంగతనాలకు సంబంధించి గత ఏడాది 124 నమోదు కాగా, 2023లో 78 కేసులు నమోదై 37శాతం తగ్గుదల నమోదైందన్నారు. సాధారణ దొంగతనాలకు సంబంధించి 2022లో 252 కేసులు, 2023లో 195 కు అనగా 23 శాతం తగ్గాయన్నారు. జిల్లాలో అసాంఘీక కార్యకలాపాలపై ఉక్కు పాదం మోపి దాడులు నిర్వహించి 943 కేసులు నమోదు చేసి 4,453 మందిని అరెస్ట్ చేయడం జరిగిందన్నారు. వారి నుండి రూ.1,70,80,792 స్వాధీనం చేసుకున్నారు. జిల్లాలో ఎర్ర చందనం అక్రమ రవాణాపై ఉక్కు పాదం మోపి 13 కేసులు నమోదు చేసి 72 మందిని అరెస్టు చేశారు. 4,260 కిలోల బరువున్న 194 దుంగలను, 18 వాహనాలను స్వాధీనం చేసుకున్నారు.
గంజాయి విక్రయాలపై ముమ్మర దాడులు:..
గంజాయి విక్రయాలపై ముమ్మరంగా దాడులు నిర్వహించి 26 కేసులు నమోదు చేసి 172 మందిని అరెస్టు చేశారు. 310 కిలోల గంజాయి, 13 వాహనాలను స్వాధీనం చేసుకున్నారు. జిల్లాలో పదే పదే నేరాలకు పాల్పడుతున్న 8 మందిపై పి.డి చట్టం ప్రయోగించారు. అదేవిధంగా జిల్లాలో ఈ ఏడాది 545 కేసులు నమోదు చేసి 679 మందిని అరెస్టు చేశారన్నారు. 3,413 లీటర్ల అక్రమ మద్యాన్ని స్వాధీనం చేసుకున్నారు. ఎస్.సి ఎస్.టి (అత్యాచార నిరోధక చట్టం) కేసులు గత ఏడాదితో పోల్చితే 22శాతం తగ్గాయి. 2022 సంవత్సరంలో 147 కేసులు నమోదు కాగా, ఈ ఏడాది 115 కేసులు నమోదయ్యాయి.
రోడ్డు ప్రమాదాల్లో 30 శాతం తగ్గుదల:..
జిల్లాలో రోడ్డు భద్రతా నిబంధనలపై వాహనదారులకు అవగాహన కల్పించడం, డ్రంకెన్ డ్రైవ్ పై ప్రత్యేక దృష్టి పెట్టడం వాళ్ళ రోడ్డు ప్రమాదాల్లో గత ఏడాదితో పోల్చితే 30శాతం తగ్గుదల నమోదైంది. గత ఏడాది మొత్తం 801 కేసులు నమోదు కాగా, ఈ ఏడాది భారీగా తగ్గి 625 కేసులు నమోదయ్యాయి. ప్రాణాంతక రోడ్డు ప్రమాదాల్లో 2022 లో 369, 2023 లో 323 అనగా 12 శాతం, సాధారణ ప్రమాదాల్లో 2022 లో 432, 2023 లో 302 నమోదై 30 శాతం తగ్గుదల నమోదైంది. రోడ్డు ప్రమాదాల్లో 2022లో 403 మంది మరణించగా, ఈ ఏడాది 367 మంది మరణించారు. 9 శాతం తగ్గుదల నమోదైందన్నారు. 2022లో 837 మంది గాయపడగా, ఈ ఏడాది 722 మంది గాయపడ్డారు. 14శాతం తగ్గుదల నమోదైంది. ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించిన వారిపై ఎం.వి చట్టం ప్రకారం 1,64,803 కేసులు నమోదు చేసి, రూ. 4,06,54,135 జరిమానా విధించడం జరిగింది. డ్రంకెన్ డ్రైవ్ లో భాగంగా మద్యం సేవించి వాహనాలు నడిపే వారిపై 1540 కేసులు నమోదు చేసి 1,540 మందిని అరెస్ట్ చేసారు. డేంజరస్ డ్రైవింగ్ చేస్తున్న 545 మందిపై 545 కేసులు నమోదు చేయడం జరిగింది. 2022 లో 25 కిడ్నాప్ కేసులు నమోదు కాగా, ఈ ఏడాది 16 కేసులు నమోదై 36 శాతం తగ్గుదల నమోదైంది.
మహిళలపై నేరాలు:…
మహిళలపై నేరాలకు సంబంధించి 2022 లో 732 నమోదు కాగా, 2023లో 689 కేసులు నమోదై 6 శాతం తగ్గుదల నమోదైంది. ఇందులో వరకట్న హత్యలు గత ఏడాది 4 కేసులు, నమోదు కాగా ఈ ఏడాది ఒక్క కేసు మాత్రమే నమోదై 75 శాతం తగ్గుదల నమోదైందన్నారు. వరకట్న వేధింపుల మరణాలు గత ఏడాది 7కేసులు, ఈ ఏడాది 4 కేసులు నమోదై 42 శాతం తగ్గాయన్నారు. ఆత్మహత్యకు ప్రేరేపించిన కేసులకు సంబంధించి గత ఏడాది 15 ఈ ఏడాది 12 నమోదయ్యాయన్నారు. 20 శాతం తగ్గాయన్నారు. మహిళల కిడ్నాప్ కు సంబంధించి 2022 లో 16, 2023 లో 9 నమోదయ్యాయన్నారు. 43 శాతం తగ్గాయన్నారు. మహిళలపై దౌర్జన్యం కేసుల్లో 2022 లో 251 కేసులు నమోదు కాగా, ఈ ఏడాది 175 కేసులు నమోదయ్యాయన్నారు. 29 శాతం తగ్గుదల నమోదైందన్నారు. అత్యాచార యత్నం కేసులు 2022లో 8, 2023లో 8 నమోదయ్యాయన్నారు. సైబర్ నేరాలకు సంబంధించి గత ఏడాది 83 కేసులు నమోదు కాగా, ఈ ఏడాది 71కేసులు నమోదై 14శాతం తగ్గుదల నమోదైందన్నారు.
హత్య కేసులు :…
2022 లో 51 హత్య కేసులు నమోదు కాగా, ఈ ఏడాది 49 నమోదయ్యాయి. 4 శాతం తగ్గుదల నమోదయింది. హత్యాయత్నం కేసుల్లో 2022 లో 102, ఈ ఏడాది 82 నమోదై 20 శాతం తగ్గాయి. 2022 లో 50 అత్యాచార కేసులు నమోదు కాగా, ఈ ఏడాది 39 నమోదై 22 శాతం తగ్గాయి. సింపుల్ హర్ట్స్ (గాయం కలుగచేయడం) కేసుల్లో 2022 లో 700 నమోదు కాగా, ఈ ఏడాది 465 నమోదై 33 శాతం తగ్గుదల నమోదైందన్నారు.
చీటింగ్ కేసులు:..
చీటింగ్ కేసులు 2022 లో 218 నమోదు కాగా, ఈ ఏడాది 317 నమోదయ్యాయి. 2022 లో 582 మిస్సింగ్ కేసులు నమోదు కాగా, 526 మందిని ఆచూకీ కనుగొని తిరిగి కుటుంబ సభ్యులకు అప్పగించారన్నారు. ఈ ఏడాది 562 కేసులు నమోదు కాగా, 512మంది ఆచూకీ కనుగొని కుటుంబ సభ్యుల చెంతకు చేర్చారు. కోర్టు మానిటరింగ్ సెల్ ఏర్పాటుతో ఫాస్ట్ ట్రాక్ కేసులపై పోలీస్ అధికారులు ప్రత్యేక దృష్టి సారించారు. కేసుల విచారణ త్వరితగతిన జరిగి సాక్ష్యాధారాలతో నేర నిరూపణ చేసి నేరస్థులకు శిక్ష పడేలా కృషి చేస్తున్నారన్నారు. మొత్తం 550 కేసులను ఫాస్ట్ ట్రాక్ కేసులుగా గుర్తించగా, అందులో 68 కేసుల్లో నేరస్థులకు సంబంధిత కోర్టులు శిక్ష విధించాయన్నారు. కేసుల్లో నేరారోపణలు రుజువు చేసి 57 శాతం కన్విక్షన్ రేట్ సాధించడం జరిగిందన్నారు. జిల్లాలోని వివిధ పోలీస్ స్టేషన్ల పరిధిలో నమోదైన తీవ్రమైన 11 కేసుల్లో ముద్దాయిలకు కోర్టులో సాక్ష్యాధారాలతో నేర నిరూపణ చేసి యావజ్జీవ కారాగార శిక్ష విధించేలా పోలీస్ అధికారులు సమష్టిగా కృషి చేశారన్నారు. ఈ ఏడాది నమోదైన కేసులతో పాటు ప్రారంభంలో ఉన్న కేసులు మొత్తం 8189 కేసులు ఉండగా, గణనీయంగా తగ్గించి ప్రస్తుతం వాటి సంఖ్య 1894 కేసులుగా ఉన్నాయని ఎస్పీ కౌశల్ తెలిపారు.