Saturday, January 4, 2025

AP | నేర నియంత్రణే లక్ష్యం.. పోలీసుల వసతులకు ప్రాధాన్యం : హోంమంత్రి అనిత

  • జనవరి మొదటి వారంలో కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో భేటీ
  • పోలీస్ అకాడమీ శాశ్వత భవనాల నిర్మాణానికి భూసేకరణ పూర్తి
  • పోలీసులకు అత్యాధునిక శిక్షణ కేంద్రాల ఏర్పాటుకు చర్యలు

కేంద్ర ప్రభుత్వ నుంచి నిధులు రాబట్టి పోలీస్ శాఖ అభివృద్ధికి బాటలు వేస్తామని హోంమంత్రి వంగలపూడి అనిత వెల్లడించారు. పోలీస్, అగ్నిమాపక సేవలు, జైళ్లు, విపత్తునిర్వహణ, జిల్లా సైనిక సంక్షేమానికి సంబంధించిన కేంద్ర పథకాల నిధులు రాబట్టడంపై కూటమి ప్రభుత్వం ప్రత్యేక దృష్టిసారించినట్లు స్పష్టం చేశారు.

కేంద్ర హోంశాఖ పార్లమెంటరీ కమిటీ సభ్యుడు, విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్‌తో కలిసి హోంమంత్రి అనిత సోమవారం రాష్ట్ర సచివాలయంలో హోంశాఖ, విపత్తు నిర్వహణ శాఖ ఉన్నతాధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ…

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి రావాల్సిన బకాయిలు, నిధులపై చర్చించినట్లు ఆమె పేర్కొన్నారు. పోలీసులకు తగిన వసతులు, శిక్షణ కేంద్రాల ఏర్పాటుపై చర్చలు జరిపినట్లు హోంమంత్రి తెలిపారు. అందులో భాగంగా సాంకేతిక పరిజ్ఞానంతో కూడిన గ్రేహౌండ్స్, ఆక్టోపస్, సైబర్ సెక్యూరిటీ వంటి కీలక సంస్థలను నెలకొల్పేందుకు కృషి చేస్తామన్నారు.

- Advertisement -

గ్రేహౌండ్స్, ఆక్టోపస్ సంస్థలను ఏర్పాటు చేద్దాం..

ఏపీ పోలీస్ అకాడమీ (ఏపీపీఏ) విషయంలో కూట‌మి ప్రభుత్వం వేగంగా అడుగులు వేస్తోందని హోంమంత్రి తెలిపారు. శాశ్వత భవనాలు నిర్మించేందుకు వీలుగా భూసేకరణ ప్రక్రియ పూర్తయిందని తెలిపారు. ఆక్టోపస్ ట్రైనింగ్ సెంటర్ నిర్మాణానికి ఏలూరు జిల్లా ఆగిరిపల్లి మండలం గొండపల్లిలో 76 ఎకరాల స్థలాన్ని కేటాయించినట్లు తెలిపారు.

విజయనగరం జిల్లా కొత్తవలస మండలం రెల్లి గ్రామంలో పోలీసు శిక్షణ కేంద్రం (గ్రే హౌండ్స్) నిర్మాణానికి 498.23 ఎకరాల భూమిని సేకరించిన‌ట్లు పేర్కొన్నారు. హోం, విపత్తు నిర్వహణ శాఖలకు అవసరమైన సంస్థలు, శిక్షణ కేంద్రాలను ఏర్పాటు చేసి ఏపీలో నేర రహిత సమాజాన్ని నిర్మించడమే కూట‌మి ప్రభుత్వ లక్ష్యమని హోంమంత్రి అనిత స్పష్టం చేశారు.

కేంద్రం నిధులు రాబట్టి పోలీస్ శాఖ అభివృద్ధికి బాటలు..

ఏపీ, తెలంగాణ‌ రాష్ట్రాలు రెండుగా విడిపోయి పది సంవత్సరాలు కావస్తోన్నప్పటికీ కేంద్రం నుండి రావాల్సిన 118 కీలక శిక్షణ సంస్థల ఏర్పాటు జరగలేదని ఎంపీ కేశినేని శివనాథ్ వెల్లడించారు.

హోంమంత్రి అనిత నేతృత్వంలో జనవరి 8, 9 తేదీల్లో కేంద్ర హోంమంత్రి అమిత్ షాహిని కలిసి ఏపీ ప్రభుత్వ ప్రతిపాదనలను వివరిస్తామన్నారు. విపత్తు నిర్వహణకు కేంద్రం నుంచి రావాల్సిన రూ.1150 కోట్ల తాత్కాలిక నిధులు కూడా రాబట్టాలన్నారు. పోలీస్ స్టేషన్లు, జైళ్ల ఆధునీకరణకు కృషి చేస్తామన్నారు.

ఈ సమీక్షా సమావేశంలో హోంశాఖ ప్రత్యేక కార్యదర్శి , ఐజీ విజయకుమార్, ‘ఈగల్’ చీఫ్ ఆకే రవికృష్ణ, ఎస్పీ ఎస్ఐబీ, గీతాదేవి, జైళ్ల శాఖ అడిషనల్ ఎస్పీ రఘు, డీజీ ఫైర్ మాదిరెడ్డి ప్రతాప్, విపత్తునిర్వహణ సంస్థ ఎండీ కూర్మనాథ్, రాష్ట్ర సైనిక్ వెల్ఫేర్ బోర్డు డైరెక్టర్ బ్రిగేడైర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement