పవిత్ర రంజాన్ మాసం ఉపవాసాలు ఆదివారం ప్రారంభం కానున్నాయి. శనివారం సాయంత్రం ఆకాశాన నెలవంక దర్శనమిచ్చిన దరిమిలా ఆదివారం సహార్ తో ఉపవాస క్రతువుకు ముస్లిం సోదరులు శ్రీకారం చుడతారు. 7ఏళ్ల బాలుడు మొదలుకొని 70 ఏళ్ల వృద్ధుడు వరకూ ఆడ మగ అనే తేడా లేకుండా ప్రతి ఒక్కరూ ఉపవాసం ఉండాలి అనేది ఇస్లాం లో ఒక విధి గా ఉండటంతో ప్రతి ఇంటా ఆధ్యాత్మికత నెలకొంది.
ఎ.కొండూరు, (ప్రభన్యూస్) : ఇస్లాంలో ఐదు మూలస్థంభాలు ఒకటిగా నిలిచే రోజా (ఉపవాసం) ను ముస్లింలు ఎంతో భక్తి శ్రద్ధలతో పాటిస్తారు. నెలవంక దర్శనంతో ప్రారంభమయ్యే ఉపవాసాలు నెల రోజుల అనంతరం తిరిగి నెలవంక దర్శనంతో ముగుస్తాయి. వరాల వసంతంగా అపార శుభాలు కురిపించే మాసంగా రంజాన్ ఉపవాసాల నెలను విశ్వసిస్తుంటారు. అరబ్బీ భాషలో ఉపవాస వ్రతాన్ని సౌమ్ గా పిలుస్తారు. సౌమ్ అంటే చేస్తున్న పని నుండి ఆగిపోవడం, దానిని విడనాడటం. శాస్త్ర పరిభాషలో సూర్యోదయం మొదలు కొని సూర్యాస్తమయం వరకు ఆహారం తినడం మంచినీళ్లు తాగడం సంభోగం వంటి అవసరాలను మానుకోవడాన్నే సౌమ్ అర్థం పరమార్థం. అయితే పై మూడు అవసరాలు వీడినంతమాత్రాన ఉపవాస లక్ష్యం నెరవేరదు. చెడు పనులు చెడు అలవాట్లు చెడు ఆలోచనలు కూడా దీక్షాపరులు ఉపవాస సమయంలో తప్పనిసరిగా దూరంగా ఉండి తీరాల్సిందే. ఉపవాస సమయం దాదాపు 14 గంటల పాటు ఉంటుంది. ఈ సమయంలో ఉపవాస వ్రతానికి భంగం కలిగే ఎటువంటి చేష్టలకు పాల్పడకుండా ఎంతో నిష్ఠగా శుద్ధిగా ఉండాలి. రంజాన్ నెలకు ఇంతగా ప్రాముఖ్యత రావడానికి ప్రధాన కారణం ఆ నెలలో పవిత్ర దివ్యఖురాన్ షరీఫ్ అవతరించడమే. అందుకే ఈ నెలకు ఇస్లాంలో ఎంతో విశిష్టత మరింత ప్రాముఖ్యత సంతరించుకుంది. ఉపవాసమును రోజా గా పిలుస్తారు. ఉపవాసంను ఉపక్రమించడాన్ని సహరి గా, విరమణను ఇఫ్తార్ గా అరబ్బీలో పేర్కొనడం జరిగింది. సూర్యోదయంకు ముందు గానే ఆహార పానీయాలు తీసుకోవడం ద్వారా సహరీని పాటిస్తారు. సూర్యాస్తమయం కాగానే అల్పాహారం ద్వారా దీక్షను విరమించటం ఒక ఆచారంగా వస్తుంది.
పుణ్య కార్యాలకు పెద్దపీట
రంజాన్ ఉపవాసాల మాసం కొనసాగే 30 రోజులు పుణ్యకార్యాలు చేసేందుకు దీక్షాపరులు తాపత్రయపడుతుంటారు. ఆకలి దప్పికలతో అల్లాడే పేదలకు అన్నదానం చేస్తుంటారు. బీదా బిక్కి కి ఆర్థిక సహాయం వస్త్రదానం ఇలా దేవుడి (అల్లాహ్ ) కరుణా కటాక్షాలను పొందేందుకు తనకు చేతనైనంత సహాయాన్ని అందిస్తుంటారు. ఇలా చేయాలని కూడా విధిగా నిర్ణయించింది ఇస్లాం. ఈ మాసం లో చనిపోయిన వ్యక్తికి ఎటువంటి నరకబాధలు లేకుండానే తిన్నగా స్వర్గప్రాప్తి కలుగు తుందని పవిత్ర దివ్య ఖురాన్ షరీఫ్ బోధిస్తుంది. పేదల ఆకలి దప్పికలు సర్వమానవాళికి తెలియజేయాలనేది ఉపవాసాల మాసం ప్రధాన ఉద్దేశంగా చెబుతుంటారు. ప్రతి దీక్షాపరులు దానధర్మాలకు పెద్దపీట వేస్తుంటారు. ఈ మాసంలో ఇలా బీదా బిక్కి కష్టనష్టాల్లో భాగం పంచుకుంటేనే దేవుడి కృపకు దగ్గర కాగలమనేది ప్రతి ముస్లిం ప్రగాఢ విశ్వాసం ఇందుకు తగ్గట్టుగా నిరుపేదలకు సహాయాలు ఈ మాసంలో ఎక్కువగా చేస్తుంటారు.
రోజా నియమాలు
రోజాకు ఉపక్రమించే దీక్షాపరులు విధిగా నియ్యత్ చేయాలి. రోజా ఉన్న సమయంలో నోట్లో వెలువడే లాలాజలం వెంటనే ఉమ్మి వేయాలి. ఆకలి దప్పిక లతో అల్లాడే ఒక బీదా బిక్కికి కడుపునిండా భోజనం తినిపించాలి. గర్భిణీలు, వయోవృద్ధులు,రోగులు, బాలింతలకు, ప్రయాణికులకు రోజా నుంచి మినహాయింపు ఉంది. అయితే రోజా మాసం ముగిసినప్పటికీ ఆ తర్వాత కాలంలో ఎన్ని రోజులు రోజాను కొనసాగించలేదో అన్ని రోజులు రోజాను కొనసాగించాలనే నియమం ఉంది.
షబే ఖదర్ కోసం జాగరణ
రంజాన్ ఉపవాసాల మాసం చివర్లో ఐదు జాగరణ రాత్రులు ఉన్నాయి. ఇందులో ఒక రాత్రివేళ సర్వమానవాళికి సంబంధించిన తలరాతలు దేవుడిచే లిఖిమ్ చడం జరుగుతుంది. అయితే అది ఏ రాత్రి అనేది ఇస్లాం లో ఎక్కడా స్పష్టంగా తెలియజేయలేదు. ఉపవాసాల మాసంలోని 21, 23, 25, 27, 29 వ రాత్రులు గా పేర్కొన్నారు. ఆ ముఖ్యమైన రాత్రిని షబే ఖదర్ గా పిలవడం జరుగుతుంది. ఆ రాత్రిని అందుకునే క్రమంలో ముస్లిములు ఐదు రోజులపాటు జాగారం చేస్తారు. ఈ జాగరణల వేళ లైలతుల్ ఖదర్ గాను, షబే ఖదర్ గాను పేర్కొంటారు.
తరావీహ్ నమాజ్ విశిష్టత
రాత్రిపూట ఇషా నమాజ్ తర్వాత తప్పనిసరిగా ఆచరించే ప్రత్యేక నమాజ్ ను తరావీహ్ గా పిలుస్తారు. దాదాపుగా ప్రతి మసీదులో రాత్రి 9 గంటలకు ప్రారంభమయ్యే ఈ తరావీహ్ నమాజ్ 11 గంటల వరకు కొనసాగుతుంది.
నెలవంక దర్శనంతో ఈద్
30 రోజుల పాటు ఉపవాస దీక్షలు ముగించిన అనంతరం ఆకాశాన నెలవంకను చూసిన మరుసటి రోజున
ఈద్ (పండుగ) ను జరుపుకుంటారు. ఈద్గాహ్ లో సామూహిక ప్రార్థనలు చేస్తారు. ఒకరినొకరు ఆలింగనం చేసుకోవడం ద్వారా ఈద్ శుభాకాంక్షలు తెలియజేసుకుంటారు. ఈద్గాలో పఠించే నమాజ్ కు వెళ్లే కొన్ని గంటల ముందుర ప్రతి ఒక్కరూ పిత్రా( దానం) చెల్లించాల్సి ఉంటుంది. అది ఎవరి కంటే బీదా బిక్కీ, నిరుపేదలకు, ఎందుకంటే వారు ఆఫిత్రా తో ఈద్ జరుపుకునేందుకు సదవ కాశం కలుగుతుందని ఇస్లాం చెబుతుంది. ఫిత్రా ఎంతమేరకు చెల్లించాలనేది రంజాన్ ఉపవాసాల మాసం ముగియడానికి కొద్ది రోజుల ముందర మత పెద్దలు నిర్ణయిస్తారు. ఆ నిర్ణయాన్ని బహిరంగంగా వెల్లడించడం జరుగుతుంది.