ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన ఇవాళ 41వ అథారిటీ సీఆర్డీఏ సమావేశం జరిగింది. ఉండవల్లిలోని సీఎం నివాసంలో జరిగిన సమావేశానికి మంత్రి నారాయణ, సీఆర్డీఏ, ఏడీసీ అధికారులు హాజరయ్యారు. ఈ సందర్భంగా రాజధాని అమరావతి నిర్మాణ పనులపై చర్చించారు. మొత్తం 23 అంశాలే అజెండాగా అథారిటీ సమావేశం కొనసాగింది.
ఈ సమావేశంలో అమరావతి అభివృద్ధి పనులకు సీఆర్డీఏ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. రూ.2,498 కోట్లతో రహదారుల పనులకు అథారిటీ ఆమోదం తెలిపిందని మంత్రి నారాయణ తెలిపారు. రూ.1508 కోట్లతో పాలవాగు, కొండవీటి వాగు నిర్మాణం చేపట్టాలని నిర్ణయించారు. సీఆర్డీఏ పరిధిలో రూ.3,523 కోట్లతో గెజిటెడ్, నాన్ గెజిటెడ్ అధికారులు, కార్యదర్శులు, ప్రధాన కార్యదర్శుల భవనాల నిర్మాణానికి అనుమతి లభించింది.
అనుమతులు వచ్చిన పనులు జనవరి నుంచి ప్రారంభం కానున్నాయని మంత్రి నారాయణ తెలిపారు. ఈనెల 15లోపు ఐదు ఐకానిక్ టవర్లకు డిజైన్లు వస్తాయని, నెలాఖరులోపు డిజైన్లు ఆమోదం పొందితే టెండర్లు పిలుస్తామని మంత్రి నారాయణ వెల్లడించారు. అంతర్జాతీయ స్థాయిలో అన్ని రకాల సౌకర్యాలు కల్పించాలని సీఎం చంద్రబాబు ఆదేశించారని మంత్రి నారాయణ ఈ సందర్భంగా వెల్లడించారు.