బి.కొత్తకోట,(ప్రభాన్యూస్ ): కానగుల కుంట చెరువు నీళ్ళు హంద్రీనీవా కాలువ లోకి వెళ్లకుండా తగు చర్యలు తీసుకోవడంలో అధికారుల నిర్లక్ష్య వైఖరికి నిరసనగా పలువురు సిపిఐ నాయకులు సదరు గండి పడిన ప్రాంతాన్ని శుక్రవారం సందర్శించి నిరసన తెలియజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రస్తుతం కురుస్తున్న వర్షాలకు బీ.కొత్తకోట పట్టణ సమీపంలో ఉన్న కానుగల కుంట చెరువుకు, కట్టుకాలువ మరియు జెర్రిపోతు కాలువల ద్వారా భారీగా వర్షపు నీరు వచ్చి చేరుతుంది అని, అయితే చెరువులో హంద్రీ-నీవా కాలువ తవ్వడంవల్ల భారీగా చేరుతున్న వర్షపునీరు చెరువు నిండకుండా మధ్యలోని హంద్రీ-నీవా కాలువల్లోకి వృధాగా పోతున్నాయని వారు ఆవేదన చెందారు.
తాత్కాలికంగా ఏర్పాటు చేసిన మట్టికట్టను,ముళ్ల చెట్లను యంత్రాలతో తొలగించిన ఆనవాళ్లు ఉన్నాయని,ఎవరు ఎందుకు అలా చేశారో అధికారులు నిగ్గు తేల్చి వారి మీద కఠిన చర్యలు తీసుకోవాలని, నీరు వృధాగా కాలువలోకి వెళ్ళకుండా యుద్ధ ప్రాతిపదికన మట్టికట్టను ఏర్పాటు చేసి, చెరువును నింపి పట్టణ ప్రజల తాగునీటి సమస్యను తీర్చాలని వారు డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సిపిఐ నియోజకవర్గ కార్యదర్శి యస్.మనోహర్ రెడ్డి,మండల నాయకులు ఎం.అష్రఫ్అల్లి, యస్.తంబయ్యశెట్టి, ఏ.శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు.
లోకల్ టు గ్లోబల్..రియల్ టైమ్ న్యూస్ అప్ డేట్స్ కోసం..ప్రభన్యూస్ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
https://twitter.com/AndhraPrabhaApp, https://www.facebook.com/andhraprabhanewsdaily