ఏపీ సీఎం వైఎస్ జగన్ కి సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె రామకృష్ణ లేఖ రాశారు. ఇటీవల అసని తుఫాన్ వల్ల రైతులకు చేతికొచ్చిన పంటలు దెబ్బతిన్నాయని లేఖలో పేర్కొన్నారు. తుఫాన్, వరదల కారణంగా జరిగిన పంట నష్టాన్ని అంచనా వేసి, తక్షణమే రైతాంగానికి నష్టపరిహారం అందించాలని డిమాండ్ చేశారు. దాదాపు ఎకరాకు రూ.50 వేల నుండి లక్ష వరకు నష్టం జరిగిందని తెలిపారు. 2021 నవంబర్ 18 నుండి 23 వరకు కడప, చిత్తూరు, నెల్లూరు, అనంతపురం, కర్నూలు జిల్లాల్లో భారీ వర్షాలు కురిసి లక్షలాది ఎకరాల్లో పంట నష్టంతోపాటు 65 మందికి పైగా చనిపోయారని లేఖలో తెలిపారు. అన్నమయ్య, ఫించా ప్రాజెక్టులు తెగిపోవటం, ఇళ్లు కూలిపోవడం, వాగులు వంకలు పొంగి పొరలటం జరిగిందన్నారు. 6 మాసాలు గడిచినప్పటికీ పంటలు నష్టపోయిన రైతులకు పరిహారం ఇప్పటివరకు అందలేదని ఆయన మండిపడ్డారు. రాష్ట్ర ప్రభుత్వం రైతుల బాధలు పట్టించుకోకపోవడం తగదని రామకృష్ణ లేఖలో పేర్కొన్నారు.
Advertisement
తాజా వార్తలు
Advertisement