చిత్తూరు జిల్లాలో కురిసిన భారీ వర్షాలకు నష్టపోయిన బాధితులను ప్రభుత్వం ఆదుకోవాలని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె రామకృష్ణ డిమాండ్ చేశారు. ముంపు బాధితులకు సాయంగా ప్రభుత్వం ఇస్తున్న రూ. 2 వేలు సరిపోదని రూ. 5 వేల రూపాయలు తక్షణ సాయం అందజేయాలని కోరారు. బుధవారం తిరుపతి నగరంలో వరద ముంపు ప్రాంతాల్లో సిపిఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి ముప్పాళ్ల నాగేశ్వరరావు, రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు హరినాథ్ రెడ్డి, జిల్లా, నగర నాయకుల బృందం పర్యటించింది. ఆటోనగర్, కొరమెను గుంట, దేముడు కాలనీ తదితర ప్రాంతాల్లో పర్యటించారు. ప్రజల ఇబ్బందుల్ని అడిగి తెలుసుకున్నారు. దేముడు కాలనీలో పేదలకు అన్నదానం చేశారు.
ఈ సందర్భంగా కె.రామకృష్ణ మాట్లాడుతూ తిరుపతి నగరం పరిసర ప్రాంతాల్లో ఉన్న చెరువులన్నీ ఆక్రమణకు గురి కావడంతో నేడు సిటీ మొత్తం ముంపునకు గురైందన్నారు. కొరమేను గుంట చెరువును సైతం ఆక్రమించుకునేందుకు కొందరు నాయకులు ప్రయత్నిస్తున్నారని పేర్కొన్నారు. అటువంటి వారిపై తక్షణం క్రిమినల్ కేసు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. భారీ వర్షాలతో తిరుపతిలోనీ అన్ని పురవీధులు జలమయం అయ్యాయని, ఇళ్ల లోకి నీళ్లు చేరడం తో ప్రజలు చాలా ఇబ్బందులు పడుతున్నారనీ అన్నారు. స్మార్ట్ సిటీ తిరుపతి అని ప్రగల్బాలు పలుకుతున్నారని, నేటి దుస్థితికి ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరే కారణమన్నారు. వారిని రాష్ట్ర ప్రభుత్వం తక్షణం ఆదుకోవాలని కోరారు. ముపునకు గురైన వారికి మంచి ఏరియా లో మూడు సెంట్ల భూమి కేటాయించి, పక్క గృహాలు నిర్మించి ఇవ్వాలని కోరారు. ప్రభుత్వం ఒక సెంటు భూమిని కేటాయించే ఆలోచన పూర్తిగా విరమించుకోవాలని డిమాండ్ చేశారు.
లోకల్ టు గ్లోబల్.. ఆంధ్రప్రభ న్యూస్ కోసం ఫేస్బుక్, ట్విట్టర్ పేజీలను ఫాలో అవ్వండి..