సీపీఐ జాతీయ కార్యదర్శి కే నారాయణ ఇంట్లో విషాదం చోటు చేసుకుంది. నారాయణ సతీమణి వసుమతి దేవి (67) గురువారం సాయంత్రం కన్నుమూశారు. వసుమతి దేవి గుండెపోటుకు గురవ్వడంతో తిరుపతిలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చేర్పించారు. ఆమె చికిత్సపొందుతూ గురువారం సాయంత్రం తుదిశ్వాస విడిచారు. భార్య మరణంతో సీపీఐ నేత నారాయణ కన్నీటి పర్యంతమయ్యారు. వసుమతి దేవి 1976 సంవత్సరంలో తిరుపతి మహిళా యూనివర్సిటీ లో ఎమ్మెస్సీ చదువుతున్న సందర్భంగా అఖిల భారత విద్యార్థి సమాఖ్య ఏఐఎస్ఎఫ్ కార్యక్రమాలలో చురుకుగా పాల్గొన్నారు.
అదే సమయంలో విద్యార్థి, యువజన విభాగాలకు నాయకత్వం వహిస్తున్న కె.నారాయణ తో వసుమతి దేవికి పరిచయం ఏర్పడింది. 1986వ సంవత్సరం వర్కింగ్ ఉమెన్స్ ఆర్గనైజేషన్ లో చిత్తూరు జిల్లా శాఖకు నాయకత్వం వహించారు. నారాయణ తో వివాహం జరిగిన అనంతరం ఆయన కమ్యూనిస్టు పార్టీ ఉద్యమాల్లో కీలక పాత్ర పోషిస్తున్న తరుణంలో కుటుంబ బాధ్యతలు చూస్తూ సహకరిస్తు వచ్చారు. తల్లి కంటి ఎదురుగా మృతి చెందడం తో నారాయణ కుమారుడు, కుమార్తె కన్నీరు, మున్నీరుగా విలపించారు. వసుమతి దేవి మృతి పట్ల పలువురు రాజకీయ పార్టీ నేతలు, సినీ ప్రముఖులు సంతాపం తెలియజేశారు.
శుక్రవారం ఉదయం 11 గంటలకు నగరి నియోజకవర్గం ఐనంబాకం గ్రామంలో అంత్యక్రియలు జరుగుతుంది. వసుమతి దేవి మృతి పట్ల సీపీఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు హరినాథ్ రెడ్డి, జిల్లా కార్యదర్శి రామానాయుడు,బి.తులసేంద్ర,టి.జనార్ధన్, సీపీఐ ప్రజా సంఘాల నాయకులు, సిపిఎం జిల్లా కార్యదర్శి నాగరాజు, టిడిపి నేతలు నాని, నరసింహ యాదవ్, సుగుణమ్మ తదితరులు సంతాపం తెలియజేశారు.
తెలంగాణ సీఎం కేసీఆర్ సంతాపం..
సిపిఐ జాతీయ కార్యదర్శి కె.నారాయణ సతీమణి మరణం పట్ల తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు సంతాపం ప్రకటించారు. వారి కుటుంబ సభ్యులకు కెసిఆర్ తన ప్రగాఢ సానుభూతిని తెలిపారు.