తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు అరెస్టును సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ ఖండించారు. చంద్రబాబును అరెస్ట్ చేయడంపై ఆయన స్పందిస్తూ… ఏదైనా ఉంటే ముందస్తు నోటీసులు ఇచ్చి చర్యలు తీసుకోవాల్సిందన్నారు. పోలీసులు అర్ధరాత్రి హంగామా సృష్టించాల్సిన అవసరమేంటని ప్రశ్నించారు. లోకేశ్ సహా టీడీపీ నేతలను నిర్బంధించడం దుర్మార్గమని వ్యాఖ్యానించారు.
మాజీ ముఖ్యమంత్రి, తెదేపా జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబును పోలీసులు అరెస్టు చేసిన విషయం తెలిసిందే. స్కిల్ డెవలెప్మెంట్ కేసుకు సంబంధించి ఆయనను అదుపులోకి తీసుకున్నట్లు సీఐడీ పోలీసులు తెలిపారు. ఆయన అరెస్టును నిరసిస్తూ ఏపీవ్యాప్తంగా పార్టీ శ్రేణులు తీవ్ర నిరసన వ్యక్తం చేస్తున్నాయి. దీంతో పలువురు నాయకులను పోలీసులు గృహనిర్బంధం చేశారు.