Wednesday, November 13, 2024

AP | వాల్ పోస్ట‌ర్లు తింటూ క‌డుపు నింపుకుంటున్న గోమాత‌లు

  • ఇంత గ‌డ్డి వేసే వారు లేక అల‌మ‌టిస్తున్న గోవులు
  • గోశాల‌లున్నా …నిధులు లేక డీలా
  • ఆహారం కోసం రోడ్ల‌పైకి వ‌దిలేస్తున్న య‌జ‌మానులు
  • ప్లాస్టిక్ క‌వ‌ర్ ల‌ను సైతం తింటూ రోగాల పాల‌వుతున్న ప‌శువులు
  • వాటిపై క‌రుణ చూపాలంటున్న ప్ర‌జ‌లు

పులివెందుల, (ఆంధ్రప్రభ) : పక్షులకు ఆకలి తీరాలంటే గింజలు తినాలి, పులి ఆకలి తీరాలంటే వేటాడి మాంసం తినాలి, మనిషి ఆకలి తీరాలంటే అన్నం తినాలి, ఆవులు ఆకలి తీరాలంటే గడ్డి తినాలి, ఆకలి దప్పులు తీర్చుకునేందుకు కొన్ని గోమాతలు గోడపత్రాలను పీక్కుని తింటున్నాయి. వాటి యమాజనులు పట్టించుకోకపోవడంతో అవి పట్టణ పరిధిలోనే సంచరిస్తూ కుళ్లిపోయిన కూరగాయలు, ప్లాస్టిక్ కవర్లలో పారేసిన వస్తువులను ప్లాస్టిక్ కవర్ తో సహా తిని ఆవులు అనేక రోగాల బారిన పడుతున్నాయి. ఆవులు ప్లాస్టిక్ కవర్లు తినడం వల్ల అవి కడుపులో అరగక ముక్కుల నుండి వ్యర్ధ పదార్థం కారుతూ దుర్వాసనలు వెదజల్లుతున్నాయి.

ప్లాస్టిక్ కవర్లు తిని ఆవులకు పుండ్లు లేసి ఎన్నో ఆవులు మరణించిన‌ రోజులు కూడా ఉన్నాయి. మనుషులకు రోగాలు వస్తే ఇంట్లో వారికి చెప్పుకుంటాం. కానీ అవి ఎవరికి చెప్పుకుంటాయి. పూర్వం పెద్దలు చెప్పేవారు ఇంట్లో ఎవరికైనా జ్వరం గాని ఇతర రోగాలు వస్తే ఇంట్లో వాటి గురించి మాట్లాడుకునేటప్పుడు ఆవులు వారి మాటలు విని ఆ రోగానికి సంబంధించిన ఆకులు తిని వచ్చి పాలిచ్చేటివని, ఆ పాలు తాగడంతో వారికి రోగాలు నయమయ్యేటని చెప్పేవారు. అలాంటి ఆవులను ఇప్పుడు పట్టించుకునేవారు లేక రోడ్లపై ఎక్కడపడితే అక్కడ తిరుగుతూ కనిపిస్తున్నాయి.

- Advertisement -

ఒక్కోసారి గుంపులు గుంపులుగా తిరుగుతూ రోడ్లపై పడుకుంటున్నాయి. దీని వల్ల వాహనదారులకు ఆటంకం ఏర్పడుతోంది. గతంలో ప్రభుత్వాలు ఆవులు, గేదెలు ఉన్న యజమానులకు పశుగ్రాశాన్ని ఉచితంగా అందజేసేవారు. కానీ ఇప్పుడు ప్రభుత్వం ఇవ్వడం మానివేయడంతో యజమానులు కూడా వాటిని పట్టించుకోవడం మానేసి వాటిని రోడ్లపైకి వదలడం నేర్చుకున్నారు. గడ్డి తినాల్సిన ఆవులు ఇలా గోడపత్రికలు, ప్లాస్టిక్ కవర్లు, వివిధ రకాల తిండి తినడం వల్ల వివిధ రోగాల బారిన పడుతున్నాయి. కళ్లెదుటే అవి అనారోగ్యానికి గురవుతున్నాయి.

ఇంత జరుగుతున్నా వాటియజమానులు పట్టించుకోలేదనే విమర్శలు లేకపోలేదు. ఇప్పటికైనా అధికారులు, ప్రజా ప్రతినిధులు, స్పందించి బజారులో విచ్చలవిడిగా సంచరిస్తున్న ఆవులను వాటి యజమానులకు అప్పగించడమా.. లేక గోశాలకు తరలించడమా ఏదో ఒకటి చేయాల్సిన అవసరం ఉంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement