ఏపీ వ్యాప్తంగా ఈ నెల 20వ తేదీన ప్రత్యేక టీకా డ్రైవ్ చేపట్టనున్నట్లు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ ముఖ్య కార్యదర్శి అనిల్ కుమార్ సింఘాల్ తెలిపారు. కరోనా కారణంగా తల్లిదండ్రులు కోల్పోయిన పిల్లలను రాష్ట వ్యాప్తంగా 124 మంది పిల్లలను గుర్తించామన్నారు. వారిలో 86 మంది పేరున రూ.10 లక్షల చొప్పున నగదు డిపాజిట్ చేశామన్నారు. మంగళగిరిలోని ఏపీఐఐసీ భవనంలో శుక్రవారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. గడిచిన 24 గంటల్లో 1,07,764 శాంపిళ్ల టెస్టులు నిర్వహించగా, 6,341 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయని, 57 మంది మృతి చెందారని తెలిపారు. రాష్ట్రంలో కరోనా కేసులు రోజు రోజుకూ తగ్గుముఖం పడుతున్నాయన్నారు.
ప్రత్యేక టీకా డ్రైవ్ క్యాంపెయిన్ లో 45 ఏళ్లు పైబడిన వారితో పాటు అయిదేళ్లలోపు పిల్లలు కలిగిన తల్లులకు టీకా వేయనున్నామన్నారు. ఇప్పటికే ఒకే రోజు 6 లక్షలకు పైగా డోసులు వేసిన ఘనత రాష్ట్ర ప్రభుత్వం సాధించిందన్నారు. ఇప్పటి వరకూ రాష్ట్ర వ్యాప్తంగా 1,22,83479 మందికి టీకా వేశామని తెలిపారు. వారిలో 26,41,000 మందికి రెండు డోసులు, 71 లక్షల మంది ఒక డోసు వేశామని తెలిపారు. జూన్ నెలకు సంబంధించి 2,66,000 మందికి కొవాగ్జిన్, 2,10,000 మంది కొవిషీల్డ్ సెకండ్ డోసు వేయాల్సి ఉందన్నారు. 5,29,000 మంది అయిదేళ్లలోపు పిల్లలు కలిగిన తల్లులకు మొదటి డోసు వేశామన్నారు.
కరోనా థర్డ్ వేవ్ వచ్చే అవకాశముందన్న నిపుణులు సూచనలను దృష్టిలో పెట్టుకుని 12,187 ఆక్సిజన్ కాన్సంట్రేటర్లు కొనుగోలు చేయగా, 4,175 ఇప్పటికే వచ్చాయని, మిగిలిన 8 వేలు ఈ నెలాఖరుకు రాష్ట్రానికి రానున్నాయన్నారు. ఈ నెల 24వ తేదీన 10 వేల డి టైప్ సిలెండర్లు రానున్నాయన్నారు. 50 బెడ్లు, అంతకన్నా ఎక్కువ సామర్థ్యం ఉన్న ఆస్పత్రుల్లో ఆక్సిజన్ సదుపాయాల ఏర్పాటుకు రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందన్నారు. రూ.267.08 కోట్లతో వ్యయంతో ఆక్సిజన్ ప్లాంట్లు, ఆక్సిజన్ బెడ్లు, డీజీ సెట్లు, ట్రాన్స్ ఫార్మర్లు ఏర్పాటు చేయనున్నట్లు ఆయన తెలిపారు. 28 లోకేషన్లలో ఆక్సిజన్ ప్లాంట్లు(పీఎస్ఏ) కేంద్రం మంజూరు చేసిందని, రాష్ట్ర ప్రభుత్వం సొంతంగా 113 లోకేషన్లలో ఈ ప్లాంట్లు ఏర్పాటు చేయనుందన్నారు.