శ్రీకాకుళం జిల్లాలో 15 నుండి 18 సంవత్సరాల వయస్సు గల పిల్లలకు వాక్సినేషన్ కార్యక్రమం సోమవారం ప్రారంభం అయింది. జిల్లా కలెక్టర్ శ్రీకేష్ లాఠకర్ పలు కేంద్రాలు, పాఠశాలల్లో తనిఖీ చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. జిల్లాలో 15 నుండి 18 సంవత్సరాల వయస్సు గల పిల్లలు 1.34 లక్షలు ఉన్నారన్నారు. వీరందరికీ వాక్సినేషన్ పూర్తి చేసేందుకు కార్యాచరణ ప్రణాళిక తయారు చేశామని తెలిపారు. శ్రీకాకుళం జిల్లాలో 929 గ్రామ, వార్డు సచివాలయాలలో వాక్సినేషన్ కేంద్రాలు ఏర్పాటు చేశామని పేర్కొన్నారు. ప్రతి ఒక్కరూ వాక్సినేషన్ వేసుకోవాలని తద్వారా కరోనా నుండి రక్షణ లభిస్తుందన్నారు. జిల్లాలో మొదటి డోసు వాక్సినేషన్ ఇప్పటికే శత శాతం పూర్తి చేశామన్నారు.
రెండవ డోసు 70 శాతం పూర్తి అయ్యిందని, అందరూ రెండవ డోసు వేసుకొని కరోనా నుండి సురక్షితంగా ఉండాలని ఆయన సూచించారు. 15 నుండి 18 సంవత్సరాల వయస్సు గల పిల్లలు అందరూ వాక్సినేషన్ వేసుకోవాలన్నారు. పిల్లలకు కోవాక్సిన్ టీకా ఇస్తున్నమన్న కలెక్టర్.. వాక్సిన్ సురక్షితమైనదని చెప్పారు. విద్యార్థులతో వాక్సినేషన్ పై ముఖాముఖి మాట్లాడారు. ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాలని, వాక్సినేషన్ పొందాలని సూచించారు. చుట్టు ప్రక్కల ఉన్నవారికి తెలియజేయాలని కలెక్టర్ కోరారు.