Tuesday, November 26, 2024

కోవిడ్‌ అలర్ట్‌ ! 38 రకాల మందులు అందుబాటులోకి.. ప్రతి సోమ, గురువారాల్లో స్టాక్‌ వెరిఫికేషన్‌

అమరావతి, ఆంధ్రప్రభ : ప్రస్తుతం దేశాన్ని వణికిస్తున్న కోవిడ్‌ కొత్త రకం వేరియంట్‌ బీఎఫ్‌-7ను సమర్ధవంతంగా ఎదుర్కొనేందుకు రాష్ట్ర ప్రభుత్వం సన్నద్ధమౌతోది. కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ ఆదేశాలను అనుసరించి, రాష్ట్రంలోని డ్రగ్స్‌ కంట్రోల్‌ అడ్మినిస్ట్రే షన్‌ అధికారులు (డీసీఏ) ఈమేరకు చర్యలకు ఉపక్రమిస్తోంది. రాష్ట్రంలోని అన్ని మెడికల్‌ స్టోర్స్‌లో మందుల కొరత లేకుండా ఉండేలా చర్యలు తీసుకుంటోంది. కొత్త కోవిడ్‌ వేరియంట్‌ నియంత్రణకు అవసరమైన మందులను అందుబాటు-లోకి తీసుకొచ్చేలా చర్యలు చేపడుతున్నారు. మొత్తంగా 38 రకాల మందులను అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకుంటోంది. వీటిలో అజిత్రోమైసిన్‌, డాక్సీసైక్లిన్‌, ఐవర్‌మెక్టిన్‌, మిథైల్‌ప్రెడ్నిసోలోన్‌, హెపారిన్‌, డెక్సామెథాసోన్‌, జింక్‌ సల్ఫేట్‌, జింక్‌తో కూడిన బి కాంప్లెక్స్‌, విటమిన్‌ డి, విటమిన్‌ సి, ఎన్‌-ఎసిటిలీన్‌ సిస్టీన్‌, పారాసెటమాల్‌, మోలినెట్‌లిలైజ్‌, ఎసిటైల్‌ వంటి 38 రకాల కోవిడ్‌ అత్యవసర మందులను డీసీఏ గుర్తించింది.

లెవోసెటిరిజైన్‌, పాంటోప్రజోల్‌, యాంటాసిడ్‌ ట్యాబ్‌, ఫేవిపిరావిర్‌, అజ్వుడిన్‌, బారిసిటినిబ్‌, బెవాసిజుమాబ్‌, డారునావిర్‌, ఎల్బాస్విర్‌, హ్యూమన్‌ ఇంటర్‌ఫెరాన్‌ బీటా, లోపినావిర్‌, మోయిన్‌పిరవిర్‌, రిటోనావిర్‌, టోసిలిజుమాబ్‌, 2-డీజీ, కోటెయిక్సాపాజిన్‌, రెమెడిక్సావిరికోల్‌ మరియు పీపీఈ కిట్‌లు మరియు ఎన్‌-95 మాస్క్‌లు కాకుండా ఇంట్రావీనస్‌ ఇమ్యునోగ్లోబులిన్‌ వంటి వాటిని పూర్తిస్థాయిలో ఏర్పాటు చేసందుకు అవసరమైన చర్యలు ప్రారంభిస్తోంది.

- Advertisement -

ఏడీ స్థాయి అధికారులతో పర్యవేక్షణ..

అసిస్టెంట్‌ డైరెక్టర్‌ స్థాయి అధికారులు తమ పరిధిలోని హోల్‌ సేల్‌ డిస్ట్రిబ్యూటర్ల నుండి ప్రతి సోమ, గురువారాల్లో స్టాక్‌ వివరాలను తమకు అందజేయాలని ఉన్నతాధికారులు ఇప్పటికే ఆదేశించారు. దీంతో రాష్ట్రవ్యాప్తంగా ఉన్న రి-టైల్‌ ఫార్మసీల్లో అందుబాటు-లో ఉన్న మందుల స్టాక్‌పై వారికి అవగాహన కలుగనుంది. ప్రభుత్వ, ప్రైవేట్‌ ఆసుపత్రుల్లో ప్రెజర్‌ స్వింగ్‌ అబ్సార్ప్షన్‌ ఆక్సిజన్‌ ప్లాంట్‌లపై నిఘా ఉంచి, వాటి ప్రస్తుత పరిస్థితిని పరిశీలించాలని స్పష్టమైన ఆదేశాలిచ్చారు. డ్రగ్స్‌ కంట్రోల్‌ అడ్మినిస్ట్రేషన్‌కి చెందిన ఒక సీనియర్‌ అధికారి మాట్లాడుతూ, కోవిడ్‌ నివారణకు అవసరమైన మొత్తం 38 రకాల మందుల స్టాక్‌ పొజిషన్‌ను క్రమం తప్పకుండా తనిఖీ చేస్తామని తెలిపారు. రాష్ట్రంలో కోవిడ్‌-19 ముప్పును ఎదుర్కొనేందుకు మా సన్నాహాల్లో ఎలాంటి కొరత లేకుండా చూస్తామని చెప్పారు. అయితే, రాష్ట్రంలో ఇప్పటివరకు ఒక్క కరోనా వైరస్‌ కొత్త వేరియంట్‌ బీఎఫ్‌-7 కేసు కూడా నమోదు కానందున, ఎంత అవసరమైన ఔషధాల స్టాక్‌ అందుబాటు-లో ఉండాలనే దానిపై డీసీఏ అధికారులు ఎటు-వంటి ఆదేశాలు జారీ చేయలేదని, ముందుగా ఆక్కడి నుండి వచ్చిన ఆదేశాల మేరకు తామంతా అప్రమత్తమవుతున్నామని వెల్లడించారు. ఈమేరకు మాక్‌ డ్రిల్‌ కూడా నిర్వహిస్తున్నామని వెల్లడించారు.

కోవిడ్‌ కేసులిలా..

మరోవైపు రాష్ట్రంలో ప్రస్తుతం నాలుగు కోవిడ్‌ -19 కేసులు యాక్టివ్‌గా ఉన్నాయని, మరో 23.24 లక్షల మందికి పాజిటివ్‌గా కేసులు నయమయ్యాయని ప్రభుత్వం పేర్కొంది. కరోనా వైరస్‌ రాష్ట్రాన్ని మొదటిసారి తాకినప్పటి నుండి ఇప్పటివరకు 14,733 మరణాలు నమోదయ్యాయని కేంద్ర ఆరోగ్య మరియు కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ వద్ద అందుబాటు-లో ఉన్న డేటా ద్వారా తెలుస్తోంది. అదేవిధంగా, కోవిడ్‌ వ్యాక్సిన్‌కు సంబంధించి రాష్ట్రంలో 18 సంవత్సరాల పైబడిన వయస్సు గల 8,41,92,143 మందికి మొదటి మరియు రెండవ మోతాదులను అందించచడం జరిగింది. అలాగే 12-14 సంవత్సరాల వయస్సు గల 30,18,785 మందికి, 15-18 సంవత్సరాల మధ్య 50,62,912 మందికి, 18-59 సంవత్సరాల మధ్య 1,17,03,050 మందికి, ఆరోగ్య మరియు ఫ్రంట్‌లైన్‌ కార్మికులు కాకుండా 60 సంవత్సరాల వయస్సు పైబడిన 65,79,546 మందికి ముందు జాగ్రత్తగా వ్యాక్సినేషన్‌ వేశారు. రాష్ట్రంలోని ప్రజలకు ఇప్పటివరకు మొత్తం 11,05,56,436 డోసుల వ్యాక్సిన్‌లను వినియోగించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement