Wednesday, November 20, 2024

AP: జూన్ 4న‌ ఉదయం 8గంటలకు కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభం.. డా.జి.సృజన

కర్నూలు, మే 30, కర్నూలు బ్యూరో : రాయలసీమ యూనివర్సిటీలో జూన్ 4వ తేది ఉదయం 8 గంటలకు కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభమవుతుందని, ఉదయం 8 గంటలకు పోస్టల్ బ్యాలెట్ ఓట్ల లెక్కింపు కార్యక్రమం ప్రారంభమైన అర గంటకు అంటే ఉదయం 8.30 గంటలకు ఈవీఎమ్ కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభమవుతుందని జిల్లా కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి డా జి.సృజన పేర్కొన్నారు. గురువారం కలెక్టరేట్ లోని కాన్ఫరెన్స్ హాల్ లో కౌంటింగ్ ఏర్పాట్లపై మీడియా ప్రతినిధులతో జిల్లా కలెక్టర్ డా జి.సృజన ప్రెస్ కాన్ఫరెన్స్ నిర్వహించారు.

ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ… కర్నూలు జిల్లాకు సంబంధించిన 8 అసెంబ్లీ నియోజకవర్గాల కౌంటింగ్ హాల్స్ రాయలసీమ యూనివర్సిటీలోని ఇంజనీరింగ్, లైబ్రరీ, లైఫ్ సైన్స్ బ్లాక్ లలో ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. ఇంజనీరింగ్ బ్లాక్ లో ఎమ్మిగనూరు, పాణ్యం, కోడుమూరు, ఆలూరు అసెంబ్లీ నియోజకవర్గాలకి సంబంధించిన కౌంటింగ్ హాళ్లు, లైఫ్ సైన్స్ బ్లాక్ లో కర్నూలు, ఆదోని అసెంబ్లీ నియోజకవర్గాలకి సంబంధించిన కౌంటింగ్ హాళ్లు, లైబ్రరీ బ్లాక్ లో మంత్రాలయం, పత్తికొండ అసెంబ్లీ నియోజకవర్గాలకు సంబంధించిన కౌంటింగ్ హాళ్లు ఉంటాయన్నారు.

కర్నూలు పార్లమెంట్ కి సంబంధించిన పోస్టల్ బ్యాలెట్ ఓట్ల లెక్కింపు లైఫ్ సైన్స్ బ్లాక్ లో జరుగుతుందన్నారు. పాణ్యం, కర్నూల్ అసెంబ్లీ నియోజకవర్గాలకు ఎక్కువ సంఖ్య లో పోస్టల్ బ్యాలెట్ లు ఉన్నందున ఎన్నికల కమిషన్ అనుమతితో ప్రత్యేక గదుల్లో పోస్టల్ బ్యాలెట్ ఓట్ల లెక్కింపు చేసేందుకు చర్యలు తీసుకుంటున్నామని కలెక్టర్ పేర్కొన్నారు. రాయలసీమ యూనివర్సిటీలో అసెంబ్లీ, పార్లమెంట్, పోస్టల్ బ్యాలెట్ కి సంబంధించి మొత్తం 3 బ్లాక్ లలో 19 హాళ్ల‌లో కౌంటింగ్ జరుగుతుందని, అందుకు సంబంధించిన అదనపు టేబుల్స్, అదనపు అసిస్టెంట్ రిటర్నింగ్ అధికారుల కోసం గత వారంలోనే ఎన్నికల కమిషన్ నుండి అనుమతులను తీసుకోవడం జరిగిందన్నారు. పోస్టల్ బ్యాలెట్ ఎన్ని టేబుల్స్ మీద జరిగితే, సంబంధిత టేబుల్స్ కి అంతమంది ఎఆర్ఓ లు ఉంటారన్నారు. రాయలసీమ యూనివర్సిటీలో మొత్తం 35 టేబుల్స్ మీద పోస్టల్ బ్యాలెట్ ఓట్ల లెక్కింపు జరుగుతుందని, అందువల్ల 35మంది ఎఆర్ఓలను కూడా సిద్ధం చేసుకోవడం జరిగిందన్నారు.

- Advertisement -

కర్నూలు పార్లమెంట్ లో ఉండే అసెంబ్లీ నియోజకవర్గాలు, అసెంబ్లీ సెగ్మెంట్ లకి సంబంధించి 17 నుండి 21 రౌండ్లలో కౌంటింగ్ జరుగుతుందని, అందులో మంత్రాలయం 17 రౌండ్లలో కౌంటింగ్ ప్రక్రియ పూర్తి అవుతుందన్నారు… ఆలూరు నియోజకవర్గంలో 21 రౌండ్లలో, పాణ్యం నియోజకవర్గంలో 26 రౌండ్లలో కౌంటింగ్ ప్రక్రియ పూర్తవుతుందన్నారు. ప్రతి రౌండ్ కి కనీసం 20 నుండి 30 నిమిషాలు వరకు సమయం తీసుకోవడం జరుగుతుందని, ఆ విధంగా సమయానుసారం పాటిస్తే మధ్యాహ్నం 3.30 గంటల సమయానికి కర్నూల్ పార్లమెంట్ పరిధిలో ఉండే ఈవిఎమ్ కౌంటింగ్ ప్రక్రియ పూర్తవుతుందని, పాణ్యం అసెంబ్లీ నియోజకవర్గంలో రౌండ్ లు ఎక్కువగా ఉన్నందున సాయంత్రం 5.30 గంటలకు కావచ్చునన్నారు.

పోస్టల్ బ్యాలెట్ కి సంబంధించి ఒక టేబుల్ కి 500 పోస్టల్ బ్యాలెట్ లు లెక్కింప బడుతుందని, కర్నూలు పార్లమెంట్ కి సంబంధించిన పోస్టల్ బ్యాలెట్ ఓట్ల లెక్కింపు గదిలో 14 టేబుల్స్ ఉన్నాయని టేబుల్ కి 500 పోస్టల్ బ్యాలెట్ లెక్కింప చేస్తే ప్రతి రౌండ్ కి 7 వేల పోస్టల్ బ్యాలెట్ లను లెక్కంచడం జరుగుతుందన్నారు. ప్రతి రౌండ్ కనీసం 3 గంటల సమయం పడుతుందని 17,200 పోస్టల్ బ్యాలెట్ లను లెక్క చేయుటకు 3 రౌండ్లలో 9 గంటల సమయం పడుతుందన్నారు. ఆ విధంగా పోస్టల్ బ్యాలెట్ ఓట్లు లెక్కించుటకు గాను సాయంత్రం 5 గంటలవుతుందనే అంచనా వేసుకోవడం జరిగిందని, ఆ విధంగా చేయుటకు గాను శిక్షణ తరగతులను కూడా ఇవ్వడం జరిగిందని కలెక్టర్ పేర్కొన్నారు. ప్రెస్ కాన్ఫరెన్స్ లో అసిస్టెంట్ ట్రైని కలెక్టర్ చల్లా కళ్యాణి, సమాచార పౌర సంబంధాల అధికారి జయమ్మ, బీసీ సంక్షేమ అధికారి వెంకటలక్ష్మమ్మ, తదితరులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement