గుంటూరు – జగన్ పాలనలో రాష్ట్రంలోని ఏ ఒక్క రైతు కూడా సంతోషంగా లేడని తెలుగుదేశం పార్టీ చీఫ్ చంద్రబాబు చెప్పారు. రాష్ట్రంలో వర్షాలు ఆలస్యం కావడంతో రైతులు ఇబ్బంది పడుతున్నా సీఎం జగన్ పట్టించుకోవట్లేదని ఆరోపించారు. రైతుల సమస్యలను పరిష్కరించేందుకు ఏంచేయాలనే ఆలోచన లేదని, అధికారులతో ఇప్పటి వరకు ఒక్క సమీక్ష కూడా జరపలేదని మండిపడ్డారు. గుంటూరు పార్టీ ప్రధాన కార్యాలయంలో చంద్రబాబు మాట్లాడుతూ.. చేతగాని ప్రభుత్వ పాలనలో ప్రజలు సంతోషంగా ఉండలేరని జగన్ పాలనతో అందరికీ అర్థమైందని పేర్కొన్నారు. గడిచిన నాలుగున్నర ఏళ్లుగా ఆంధ్రప్రదేశ్ ప్రజలు అనుభవిస్తూనే ఉన్నారని విమర్శించారు.
జగన్ ప్రభుత్వం అనుసరిస్తున్న రైతు వ్యతిరేక విధానాలతో రాష్ట్రంలోని రైతులు అప్పుల పాలయ్యారని చంద్రబాబు విమర్శించారు. రాష్ట్రంలోని 93 శాతం రైతులు అప్పుల్లో కూరుకుపోయారని ఆవేదన వ్యక్తం చేశారు. మిగతా 7 శాతం కూడా వారి పిల్లలు ఉద్యోగం చేస్తూ డబ్బులు పంపిస్తే అప్పులపాలు కాకుండా ఉన్నారని చెప్పారు. రాష్ట్రంలోని రైతుల సగటు రుణం రూ.2,45,554 లుగా ఉందని, దేశంలో రైతుల అప్పు సగటున రూ.74 వేలు ఉందని చెప్పారు. రాష్ట్రానికి, కేంద్రానికి మధ్య రైతుల సగటు అప్పు నాలుగు రెట్లు ఎక్కువని వివరించారు.
సీఎం జగన్ అధికార వ్యామోహం రాష్ట్రానికి శాపంగా మారిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. వ్యవస్థలను చంపేసి రివర్స్‌గేర్‌లో నడిపిస్తున్నారని మండిపడ్డారు. రాష్ట్రంలో సంక్షోభానికి కారణమైన జగన్‌కు పరిపాలించే అర్హత ఎక్కడిదని నిలదీశారు.
”రాష్ట్రంలో గంజాయి పంట మినహా అన్నీ సంక్షోభంలో ఉన్నాయి. సమస్యలు చెబితే రైతులపై మంత్రి అనుచిత వ్యాఖ్యలు చేస్తారు. జగన్ పాలనలో అద్భుతంగా సాగయ్యే పంట గంజాయే. ప్రభుత్వం పట్టించుకోకపోవడంతో రైతులు టమాటా వేయడం మానేశారు. ఇప్పుడు టమాటా ధరలు పెరగడానికి ఇదే కారణం. ముందు చూపుతో వ్యవహరిస్తే ఈ తిప్పలు ఉండేవి కావు. కరోనా సమయంలో రైతు ఒక్కడే బయటకొచ్చి దేశానికి అన్నం పెట్టాడు. రాష్ట్రంలో ప్రస్తుతం 93శాతం మంది రైతులు అప్పులపాలయ్యారు అంటూ వివరించారు.
దోపిడీ కేంద్రాలుగా ఆర్బీకేలు..
టిడిపి హయాంలో రాయలసీమలో హార్టికల్చర్.. కోస్తాలో ఆక్వాకల్చర్‌కు ప్రాధాన్యమిచ్చాం. ఇప్పుడు ఆ రెండూ సంక్షోభంలో ఉన్నాయి. ఏపీలో భూముల ధరలు, వ్యవసాయంపై తెలంగాణ సీఎం కేసీఆర్ కామెంట్లు చేస్తున్నారు. వరి రైతుకు గిట్టుబాటు ధర లేదు. ఆర్బీకేలు దోపిడీ కేంద్రాలుగా మారాయి. రైతులపై వైకాపా ప్రభుత్వం అప్పుల భారం మోపింది. జగన్ మాత్రం విలాసవంతమైన జీవితం గడుపుతున్నారు. అంటూ చంద్రబాబు ఆవేదన వ్యక్తం చేశారు.
రైతుల భూమి దానం చేసిన జగన్ దానకర్ణుడా?
రాష్ట్రంలో భూసార పరీక్షలు లేకపోవడంతో పంట దిగుబడి తగ్గింది. నీటి సెస్సు వెయ్యి లీటర్లకు రూ.12 నుంచి రూ.120 చేశారు. కృష్ణా-గోదావరి నదులున్న ఈ రాష్ట్రంలో నీటిపై విపరీతమైన సెస్సులా? రాజధాని రైతుల భూమి వేరొకరికి దానం చేసిన జగన్ దానకర్ణుడా? అంత దానం చేసే గుణమే ఉంటే తన భూమి ఇవ్వొచ్చుగా? ఆర్-5జోన్లో ఇళ్ల నిర్మాణానికి కోర్టు అనుమతి వచ్చిందా? ఏపీ రాజధాని ఏదంటే ఏం చెప్పాలో తెలియని పరిస్థితి. అమరావతి రైతులపై జగన్‌కు ఎందుకంత కక్ష?”అని చంద్రబాబు మండిపడ్డారు.