Thursday, January 30, 2025

Countdown – ఇస్రోకి ‘వంద’నం – రేపే జీఎస్ఎల్‌వీ ఎఫ్ 15 ప్ర‌యోగం

ఇస్రో స‌ర్వం సిద్ధం
జీఎస్ఎల్‌వీ ఎఫ్ 15 ప్ర‌యోగానికి కౌంట్ డౌన్ షురూ
నింగిలోకి ఎన్వీఎస్ 02 శాటిలైట్
భూమి, ఆకాశం, నీటిపై ప్రయాణాలకు జీపీఎస్‌గా సేవ‌లు

శ్రీహ‌రికోట, ఆంధ్ర‌ప్ర‌భః మొన్నటి వరకు విదేశాలతో భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) పోటీపడింది. ఇప్పుడు తనతో తానే పోటీ పడుతూ దూసుకెళ్తోంది. స్వదేశీ పరిజ్ఞానాన్ని ఎప్పటికప్పుడు పెంపొందించుకుంటూ అత్యుత్తమ అంతరిక్ష సంస్థగా ఎదిగింది. తక్కువ ఖర్చుతో మెరుగైన ఫలితాలు సాధిస్తోందన్న పేరూ తెచ్చుకుంది. ఈ క్రమంలోనే బుధవారం వందో రాకెట్‌ ప్రయోగానికి సిద్ధమైంది. దీనికి కౌంట్ డౌన్ మొదలైంది. ఈ నెల 29న ఉదయం 6 గంటల 23 నిమిషాలకు జీఎస్ఎల్ వీ ఎఫ్ 15 రాకెట్ నింగిలోకి వెళ్లనుంది. జీఎస్‌ఎల్‌వీ-ఎఫ్‌15 రాకెట్‌ను నింగిలోకి పంపేందుకు ఇస్రో అంతా సిద్ధం చేసింది.

ఇవీ శాటిలైట్ ప్రత్యేకతలు:

ఈ సారి నింగిలోకి ఎన్వీఎస్ 02 శాటిలైట్ వెళ్లనుంది. ఇది నావిక్ రెండో సిరీస్‌కి సంబంధించినది. ఇది ఇచ్చే సమాచారం.. మ్యాప్‌లకు బాగా ఉపయోగపడుతుంది. భూమి, ఆకాశం, నీటిపై ప్రయాణాలకు ఈ శాటిలైట్ దారి చూపిస్తుంది. ఇది మొత్తం 2,250 కేజీల బరువు ఉన్న శాటిలైట్. ఇది భూ కక్ష్యా మార్గంలోకి వెళ్లాక.. జీపీఎస్ సేవల్ని అందిస్తుంది.

ఇస్రో ప్ర‌స్థానం

- Advertisement -

తొలి రోజుల్లో సంవత్సరానికి ఒక ప్రయోగాన్ని నిర్వహించడం కూడా ఇస్రోకు గగనంగా ఉండేది. తర్వాత ఏటా 4 నుంచి పది ప్రయోగాలు చేపట్టే స్థాయికి ఎదిగింది. రాబోయే రోజుల్లో ఈ సంఖ్యను 15కు పెంచేలా షార్‌లో మౌలిక వసతులు ఏర్పాటవుతున్నాయి. ఇందుకు సంబంధించి ఇప్పటికే వీటిల్లో 80 శాతం పనులు పూర్తయ్యాయి.

కొత్త చ‌రిత్ర ..

ఇటీవలే ఇస్రో నూతన సంవత్సర ప్రారంభంలోనే మరో సరికొత్త చరిత్ర సృష్టించింది. ఇటీవల నింగిలోకి పంపించిన రెండు ఉపగ్రహాలను విజయవంతంగా అనుసంధానించింది. ఈమేరకు స్పేడెక్స్‌ డాకింగ్‌ ప్రక్రియ విజయవంతంగా పూర్తయినట్లు ప్రకటించింది. ఈ ఘనత సాధించిన నాలుగో దేశంగా భారత్‌ అవతరించింది.

గత డిసెంబర్ 30న సతీశ్‌ ధవన్‌ స్పేస్‌సెంటర్‌ (షార్‌)లో నుంచి పోలార్‌ శాటిలైట్‌ లాంచ్‌ వెహికల్‌-సీ60 (పీఎస్‌ఎల్‌వీ)లో జంట ఉపగ్రహాలను ఇస్రో నింగిలోకి పంపింది. ప్రయోగ వేదిక నుంచి పీఎస్‌ఎల్‌వీ బయల్దేరిన 15.09 నిమిషాలకు స్పేడెక్స్‌-1బి, 15.12 నిమిషాలకు స్పేడెక్స్‌-1ఎ రాకెట్‌ నుంచి విడిపోయాయి. ఆ తర్వాత వీటి డాకింగ్‌ కోసం మూడుసార్లు ప్రయత్నించింది. కానీ పలు కారణాల వల్ల ఇది వాయిదా పడుతూ వచ్చింది. చివరకు జనవరి 16న (గురువారం) వీటి అనుసంధాన ప్రక్రియను చేపట్టారు. ఈ నేపథ్యంలోనే రెండు ఉపగ్రహాల మధ్య దూరాన్ని 15 మీటర్ల నుంచి 3 మీటర్లకు తీసుకొచ్చారు. అక్కడ ఉపగ్రహాలను హోల్డ్‌ చేసి డాకింగ్‌ను మొదలుపెట్టారు. ఇది విజయవంతమైనట్లు ఇస్రో తమ పోస్ట్‌లో రాసుకొచ్చింది. ఇప్పటివరకు చైనా, రష్యా, అమెరికా మాత్రమే అంతరిక్షంలో రెండు ఉపగ్రహాలను అనుసంధానం చేస్తున్నాయి. తాజా ప్రయోగంతో ఈతరహా సాంకేతికతలో భారత్‌ కూడా వాటి సరసన చేరింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement