Monday, November 25, 2024

AP: రాష్ట్రంలో వైసీపీ స‌ర్కార్ కు కౌంట్‌డౌన్ మొదలైంది: ప్రధాని మోడీ

ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్రంలో వైసీపీ స‌ర్కార్ కు కౌంట్ డౌన్ మొద‌లైంద‌ని ప్ర‌ధాని న‌రేంద్ర మోడీ అన్నారు. ఇవాళ అన్నమయ్య జిల్లా రాజంపేట ఎన్డీఏ ప్రచార సభలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాయలసీమ సహజ సంపదకు నిలయమని అభివర్ణించారు. సీమలో సుప్రసిద్ధ ఆలయాలకు పెట్టింది పేరని, నాలుగున్నరేళ్ల పాలనలో ఇక్కడ ఎలాంటి అభివృద్ధి జరగలేదని అన్నారు. సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణం జరగకపోవడంతో రైతులు తీవ్ర ఆదోళనలో ఉన్నారని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. ఆంధ్రప్రదేశ్‌లో మార్పు రావాలంటే డబుల్ ఇంజిన్ సర్కార్ రావాలని పిలుపునిచ్చారు. రాష్ట్రంలో వైసీపీ ప్రభుత్వానికి కౌంట్‌డౌన్ మొదలైందని అన్నారు.

రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడ చూసినా మంత్రులు గూండాయిజానికి తెగబడుతున్నారని ఆరోపించారు. అన్ని రకాల మాఫియాకు ప్రభుత్వం ప్రత్యక్షంగా మద్దతు ఇస్తుందంటూ ఫైర్ అయ్యారు. అందుకే ఎన్డీఏ ప్రభుత్వం ఆ మాఫియాకు పక్కా చికిత్స చేస్తుందని అన్నారు. నాలుగున్నరేళ్లు అధికారంలో వైసీపీ ప్రభుత్వం జల్ జీవన్‌కు కూడా సహకారం అందించలేదని తెలిపారు. పోలవరం ప్రాజెక్ట్ పూర్తి చేయడానికి రాష్ట్ర ప్రభత్వం చొరవ చూపకపోవడం దురదృష్టకరమని అన్నారు. గల్ఫ్‌లోని భారతీయుల కష్టాలను కేంద్రం పట్టించుకుని తీరుస్తుందని తెలిపారు. ఈ క్రమంలోనే దేశన్ని రివర్స్ గేర్‌లో తీసుకెళ్లేందుకు కాంగ్రెస్ ప్రయత్నిస్తోందని ఆరోపించారు. ఆర్టికల్ 370ని మళ్లీ తీసుకోస్తామని కాంగ్రెస్ అంటోందని.. అందుకే ఆ పార్టీకి తగిన రీతిలో బుద్ధి చెప్పాలన్నారు. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధే ప్రధాన లక్ష్యమని ప్రధాని మోడీ అన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement