కర్నూలు, ప్రభన్యూస్ : తెల్ల బంగారం ధరలు జిల్లాలో రోజురోజుకు రికార్డు స్థాయిలో నమోదవుతున్నాయి. 15 రోజులుగా రైతు ఇంట సిరులు కురిపిస్తున్నది. ఈ ఏడాది పంట గణనీయంగా తగ్గినా, దిగుబడి కొరతతో ధరలు పెరిగాయి. దీంతో పంట పండినవారికి సంపత్తిగా మారింది. ఆదోని వ్యవసాయ మార్కెట్ యార్డులో పత్తి ధర క్వింటా గరిష్ఠంగా రూ.10,026, కనిష్ఠంగా రూ.7,290 పలికింది. అదేవిధంగా మధ్య ధర రూ.8,650గా నమోదైంది. యార్డు చరిత్రలోనే గరిష్ఠ, కనిష్ఠ, మధ్య ధరలు ఈ స్థాయిలో పలకడం ఇదే మొదటిసారి. గత 15 రోజులుగా పత్తి ధరలు పెరుగుతూ వస్తున్నాయి. దేశీయ మార్కెట్లో దూది ధరలు పెరగడం, వాటి అనుబంధ ఉత్పత్తుల ధరలపై ప్రభావం చూపడంతో పత్తికి మంచి డిమాండ్ ఏర్పడిందని వ్యాపారులు పేర్కొంటున్నారు.
తమిళనాడు, మధ్యప్రదేశ్, గుజరాత్, పంజాబ్ రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురియటంతో పత్తికి డిమాండ్ పెరిగింది. పొరుగు రాష్ట్రాల్లో ఆశించిన దిగుబడి లేకపోవటం, యార్న్కు డిమాండ్ పెరగటంతో.. పత్తి ధరకు రెక్కలొచ్చాయి. రానున్న రోజుల్లో రూ.12 వేలకు మించి ధర పలికే అవకాశాలున్నాయి. ఇప్పటికే రైతులు దాదాపు పత్తిని 70 శాతానికిపైగా విక్రయించారు. ప్రస్తుతం రైతుల వద్ద పెద్దగా పత్తి పంట నిల్వలు లేకపోగా.. వ్యాపారుల వద్ద మాత్రం భారీగా ఉన్నాయి. గ్రామాల్లోనే కొనుగోలునాణ్యమైన పత్తికి ప్రైవేట్ వ్యాపారులు రూ.9 వేల దాకా ఇచ్చి గ్రామాల్లోనే కొనుగోలు చేస్తున్నారు. తెలంగాణ, కర్ణాటకలోనూ దాదాపు ఇంతే ధరలు పలుకుతున్నాయి. దీంతో రైతులు ఎక్కడికక్కడ వ్యాపారులకు విక్రయిస్తున్నారు.
లోకల్ టు గ్లోబల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి..
#AndhraPrabha #AndhraPrabhaDigital