Tuesday, November 26, 2024

AP | విశాఖలో అవినీతి తిమింగళం… ఏసీబీకి చిక్కిన జోనల్ కమిషనర్

విశాఖపట్నం, ఆంధ్రప్రభ: అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) అధికారులకు మరో భారీ చేప చిక్కింది. మధురవాడలోని జీవీఎంసీ జోన్‌-2 జోనల్‌ కమిషనర్‌ పొందూరు సింహచలంపై మంగళవారం ఆదాయానికి మించిన ఆస్తుల కేసు నమోదైంది. తెల్లవారుజాము నుంచి ఏసీబీ అధికారులు సింహాచలం ఇల్లు, కార్యాలయంలో సోదాలు జరిపారు. సింహాచలం అవినీతి, అక్రమాలపై వరుస ఫిర్యాదులందడంతో అధికారులు తనిఖీలకు దిగారు.

అక్రమ మార్గంలో ఆదాయానికి మించి ఆస్తులు సంపాదించినట్టు వచ్చిన ఆరోపణలపై సోదాల అనంతరం కేసు నమోదు చేశారు. ఏసీబీ డీజీ అతుల్‌ సింగ్‌ ఆదేశాల మేరకు విశాఖ అధికారులు స్థానిక స్పెషల్‌ జడ్జి అనుమతితో మొత్తం ఆరు ప్రదేశాల్లో సోదాలు చేపట్టారు. మధురవాడ మిధిలాపురి కాలనీలో ఉన్న సింహాచలం ఫ్లాట్‌తో పాటు మధురవాడలోని జోనల్‌ కార్యాలయం, శ్రీకాకుళం జిల్లాలోని సింహాచలానికి చెందిన ముగ్గురు బంధువుల ఇల్లు, హైదరాబాదలోని బంధువుల ఇళ్లలోనూ సోదాలు జరిపించి అవినీతి సొమ్మును కక్కించారు. ఈ సోదాలు ఇంకా కొనసాగుతున్నట్టు అధికారులు ప్రకటించారు.

సోదాల్లో ఏసీబీ జేడీ ఎం.రజని, అదనపు ఎస్పీ ఎన్‌.విష్ణు, డీఎస్పీ బీవీఎస్‌ నాగేశ్వరరావు, డీఎస్పీ రమ్య పర్యవేక్షణలో విశాఖ, విజయనగరం, శ్రీకాకుళం, కర్నూలు ప్రాంతాల ఏసీబీ అధికారులు ఈ సోదాల్లో పాల్గొన్నారు. ఇదిలా ఉంటే ఇప్పటి వరకూ జరిపిన విచారణలో సింహాచలం ఆదాయానికి మించి ఆస్తులు కలిగి ఉన్నట్టు గుర్తించారు. త్వరలోనే సింహాచలాన్ని అరెస్టు చేసి, కోర్టులో ప్రవేశ పెడతామని దర్యాప్తు అధికారి, విశాఖ ఏసీబీ ఇన్స్‌పెక్టర్‌ వైకే కిషోర్‌ కుమార్‌ ఓ ప్రకటనలో తెలిపారు.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement