Friday, November 22, 2024

ఆరోగ్య శాఖను కుదిపేస్తున్న నకి’లీలలు’ .. ఉద్యోగ నియామకాల్లో వెలుగుచూసిన అవినీతి బాగోతం

కర్నూలు, ప్రభన్యూస్ : వైద్య ఆరోగ్యశాఖ పరిధిలో గత రెండేళ్లలో చేపట్టిన తాత్కాలిక ఉద్యోగ ఎంపిక ప్రక్రియలో భారీఎత్తున అవినీతి చోటుచేసుకున్నట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. తప్పుడు ధ్రువీకరణ పత్రాలతో పలువురు ఉద్యోగాలు పొందారు. పలువురి నుంచి పెద్ద ఎత్తున ముడుపులు తీసుకొని కొందరు అధికారులు, ఉద్యోగులు ఈ అక్రమాలకు తెరలేపినట్లు వినవస్తుండగా, తాజాగా నకిలీ పత్రాలతో ఉద్యోగం పొందిన అంశంపై మూడు రోజుల క్రితం జరిగిన కర్నూలు జిల్లా అభివృద్ధి సమీక్ష మండలి సమావేశంలో కొందరు ఎమ్మెల్యేలు వీటిపై విచారణ నిర్వహించాలనే డిమాండ్‌ను తెరమీదకు తేవడం ప్రస్తుతం పెద్ద ఎత్తున చర్చనీయాంశంగా మారింది.

ప్రస్తుతం రాష్ట్రంతో పాటు జిల్లాలోని ప్రభుత్వ ఆసుపత్రి పరిధిలో అసిస్టెంట్‌ ప్రొఫెసర్లు, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, జిల్లాలోని ఇతర అసుపత్రిలో వైద్యులుగా, పారామెడికల్‌ సిబ్బందిగా పనిచేసేందుకు పెద్దఎత్తున నియామకాలు చేపడుతున్న సంగతి విధితమే. ఇందుకు సంబందించి గత ఏడాది నవంబర్‌ 21న నోటిఫికేషన్‌ వెలువడిన సంగతి విదితమే. ఇందులో వైద్య విధాన పరిషత్‌ పరిధిలో మెడికల్‌ అధికారులు, ఫ్యామిలీ వెల్ఫేర్‌లో సివిల్‌ సర్జన్‌ పోస్టులను భర్త్తీ చేసేందుకు ఈ నోటిఫికేషన్‌ ఇచ్చారు. ఇందులో జిల్లా పరిధిలో మొత్తం 80 పోస్టులకు నోటిఫికేషన్‌ ఇవ్వడం జరిగింది. వీటికి ఎంబీబీఎస్‌ పూర్తిచేసిన అభ్యర్ధులు అన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకున్నారు. ఇందులో వైద్యుల భర్తికి 75 శాతం, సీనియార్టీ 10 శాతం, అనుభవం 15 శాతాన్ని ధ్రువీకరణ పత్రాల పరిశీలన ఆధారంగా అభ్యర్ధుల ఎంపిక ఉంటుంది.

అయితే వీరిలో ఎంబీబీఎస్‌ నాలుగేళ్లు చదివాక 14 సబ్జెక్టుల మార్కులను విడిగా ఇవ్వడాన్ని అవకాశంగా తీసుకున్న కొందరు మార్కుల మొత్తాన్ని ఎక్కువగా నమోదు చేసి అక్రమాలకు తెరతీశారు. ఈ విషయాన్ని ధ్రువీకరణ పత్రాల సమయంలో గుర్తించలేదు. దీంతో 2020 నోటిషికేషన్‌ సమయంలో మెరిట్‌ జాబితాలో మార్కులు, తాజా నోటిఫికేషన్‌కు దరఖాస్తు చేసుకున్న మార్కుల్లో వ్యత్యాసం ఉన్నట్లు గుర్తించి ఆ అంశాన్ని కొందరు బయటపెట్టారు. ఇందుకు కారణం లేకపోలేదు కోవిడ్‌ సమయంలో పని చేసిన వారికి ప్రస్తుతం చేపడుతున్న నియామకాల్లో ప్రభుత్వం ఆదనపు మార్కులు ఇవ్వడమే. దీంతో కొందరు కోవిడ్‌ సమయంలో పనిచేయ కపోయినా తప్పుడు ధ్రువీకరణ పత్రాలతో సర్వీసు మార్కులు పొందడం, సీనియార్టీ పెంచుకోవడంలో అక్రమాలకు పాల్పడినట్లు ఆరోపణలు ఉన్నాయి.

అక్రమాలు వెలుగుచూసింది ఇలా..
వైద్య ఆరోగ్యశాఖ పరిదిలో వివిధ ఉద్యోగాల నియామకాల అంశంలో ధ్రువీకరణ పత్రాల పరిశీలన సమయంలో ఈ లోపాలను గుర్తించకుండా ప్రొవిజనల్‌ మెరిట్‌ జాబితా ప్రకటించడంపై ప్రజా పరిరక్షణ సమితి సభ్యులు కలెక్టర్‌ తో పాటు, వైద్య ఆరోగ్యశాఖ జిల్లా అధికారి, వైద్య ఆరోగ్యశాఖ ముఖ్య కార్యదర్శికి ఫిర్యాదు చేశారు. అంతేకాదు జిల్లా వైద్య ఆరోగ్యశాఖ కార్యాలయం ఎదుట నిరసన చేపట్టారు. దీంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. వీటిలో ప్రధానంగా కర్నూలు ప్రభుత్వ ఆసుప త్రిలో కోవిడ్‌ విధులు నిర్వహిస్తున్న ఓ అభ్యర్ధినికి గత ఏడాది జాతీయ ఆరోగ్య మిషన్‌ కింద ఉద్యోగం రాగా, అక్టోబర్‌ 6న ఆమె ఓర్వకల్లులో వైద్యురాలిగా బాధ్యతలు నిర్వహించారు. అనంతరం అర్బన్‌ హెల్త్‌ సెంటర్‌లలో పడిన వైద్యుల పోస్టుకు ఇటీవల ధరఖాస్తు చేసుకున్నారు. కోవిడ్‌ విధులు నిర్వహిస్తూ మధ్యలోనే ఉద్యోగంలో చేరినా, నవంబర్‌ వరకు పూర్తిస్థాయిలో అంటే ఆరు నెలలపాటు సర్వీసు చేసినట్లు ధ్రువీకరణ పత్రం అందజేశారు. ఇలా రెండుచోట్ల ఒకేసారి ఎలా పనిచేశారని డీఎంఅండ్‌హెచ్‌ఓ కార్యాలయ సిబ్బంది ఆరా తీయగా తప్పుడు ద్రువీకరణ ప త్రం బాగోత్తం వెలుగులోకి వచ్చింది. సదరు వైద్యురాలికి మొదటి ర్యాంకు ఉండగా అభియోగాల నేపథ్యంలో ఆమె ధరఖాస్తును పరిగణలోకి తీసుకోలేదు.

మరో అభ్యర్ధి కోవిడ్లో విధులు నిర్వహించిన వైద్యుల జాబితాలోనే లేదు. అయితే సర్వజన ప్రభుత్వ ఆసుపత్రిలో 2020 మే 6 నుంచి 2021 నవంబర్‌ 5 వరకు కోవిడ్‌ విధుల్లో పాల్గొన్నట్లు తప్పుడు ధ్రువీకరణ పత్రం తీసుకొగా, వీటితో ఆదనంగా 15 మార్కులు పొందినట్లు సమాచారం ఇలా తప్పుడు ధ్రువీకరణ పత్రాలతో వైద్య ఆరోగ్యశాఖలో ఉద్యోగాలను ఎగురవేసుకొని పోయేందుకు పలువురు యత్నం చేసినట్లు ఆరోపణలున్నాయి. ఈ విషయంపై జిల్లాకు చెందిన ప్రజా ప్రతినిధుల దృష్టికి రాగా, వారు కూడా డీఆర్‌సీ సమయంలో ఈ అంశాన్ని లేవనెత్తడం గమనార్హం. ముఖ్యంగా పాణ్యం, కర్నూలు ఎంఎల్‌ఏలు కాటసాని రాంభూపాల్‌ రెడ్డి, హఫీజ్‌ ఖాన్‌లు వైద్య ఆరోగ్య పరిధిలో జరుగుతున్న అక్రమాలపై మండిపడిన సంగతి విదితమే. అంతేకాదు రెండేళ్ల కాలంలో వైద్య ఆరోగ్యశాఖ పరిధిలో చేపట్టిన అన్ని నియామకాలపై పూర్తి స్థాయిలో విచారణ నిర్వహించాల నడం గమనార్హం. ఈ సమయంలోనే సంబందిత పర్యవేక్షకులకు పెద్ద ఎత్తున ముడుపు ముట్టజెప్పి అక్రమాలకు తెరతీసినట్లు తెలుస్తుంది.

- Advertisement -

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement