Thursday, November 21, 2024

ప్రభుత్వ శాఖల్లో రాజ్యమేలుతున్న అవినీతి..

నాయుడుపేట, (ప్రభన్యూస్‌) : ప్రజలకు జవాబు దారితనంగా సేవలు అందించాల్సిన ప్రభుత్వ శాఖలలోని అధికారులు అందుకు విరుద్దంగా వ్యవహరిస్తున్నారు. ప్రతి పనికి ఓ రేటు నిర్ణయించి భారీ మొత్తాలలో ముడుపులు అందుకుంటూ ప్రభుత్వ నిబంధనలు కాలరాస్తూ అవినీతి సామ్రాజ్యాలను ఏర్పాటు చేసుకుంటున్నారు. ఒకవైపు ఏసీబీ అధికారులు అవినీతి సామ్రాట్‌లుగా వ్యవహరించే వారి భరతం పడుతున్నా కొంతమంది అవినీతి అధికారులు జంకుబెంకు లేకుండా పైసా వసూళ్లకు పాల్పడుతున్నారు. ప్రభుత్వ శాఖలలోని ఉద్యోగులకు రాజ్యాంగం కల్పించిన అవకాశాలను అడ్డగోలుగా వాడుకుంటూ ప్రజలను జలగల్లా పీక్కు తింటున్నారు. నాయుడుపేట డివిజన్‌ పరిధిలోని కొన్ని ప్రభుత్వ శాఖల్లో పనిచేస్తున్న అధికారులు ఇలా బరితెగించి వ్యవహరిస్తూ ప్రతి పనికి ఓ రేటు నిర్ణయించి మరీ వసూళ్లకు పాల్పడుతున్నారు. ప్రధానంగా అక్రమ మద్యం, ఇసుక, గ్రావెల్‌, మట్టి, గంజాయి, గుట్కా, హాన్స్‌ తదితర మాదకద్రవ్యాలను అరికట్టే విధంగా స్పెషల్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ బ్యూరో (ఎస్‌ఈబీ) శాఖను ప్రభుత్వం ప్రత్యేకంగా ఏర్పాటు చేసింది. వైసీపీ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత నూతన మద్యం పాలసీ విధానానికి శ్రీకారం చుట్టి మద్యం అమ్మకాల విషయంలో ఎస్‌ఈబీ అధికారులు ఎన్నో రకాలుగా చర్యలు తీసుకోవాల్సి ఉంది. ప్రభుత్వ మద్యం షాపుల వద్ద తప్ప మరెక్కడా మద్యం విక్రయాలు సాగించడంకాని, మందుబాబులతో మద్యం తాగించడంకాని చేయకూడదు. ఈ నిబంధనలు అమలు చేయాల్సిన బాధ్యత ఎస్‌ఈబీ అధికారులపై ఉంది. వీటిని అడ్డం పెట్టుకుని ప్రతి కూల్‌డ్రింక్‌ షాపును మద్యం బారుగా ఎస్‌ఈబీ అధికారులు మార్చివేశారు. ఒక్కొక్క కూల్‌డ్రింక్‌ షాపు నుంచి నెలకు రూ 3వేల నుంచి రూ 10వేల వరకు వసూళ్లు చేస్తూ కూల్‌డ్రింక్‌ షాపుల యజమానులను జలగల్లా పీక్కుతింటూ వచ్చారు.

ఇది చాలదన్నట్లు విచ్చల విడిగా బెల్టుషాపులను ఏర్పాటు చేయించి వారి నుంచి నెలసరి మామూళ్లు దండుకుంటూ వచ్చారు. ఇక గుట్కా, హాన్స్‌, గంజాయి వంటి మాదకద్రవ్యాలు అమ్మకం చేసే కిళ్లి కొట్టు యజమాని నుండి హోల్‌సేల్‌ వ్యాపారం చేసే బడా బాబుల వరకు చీకటి ఒప్పందాలు కూదుర్చుకుని దండకాలు సాగించడం మొదలెట్టారు. ఇసుక స్మగ్లర్లు, గ్రావెల్‌, మట్టి దొంగల నుండి మామూళ్లు దండుకుంటూ అక్రమ రవాణాకు పచ్చజెండా ఊపారన్న విమర్శలు జోరుగా వినిపించాయి. వీరి ఆగడాలు హద్దులు దాటడంతో నాయుడుపేటలోని ఓ కూల్‌డ్రింక్‌ షాపు యజమాని ఏసీబీ అధికారులను ఆశ్రయించాడు. లంచాల రూపంలో హెడ్‌కానిస్టేబుల్‌ విశ్వనాధం, కానిస్టేబుల్‌ బాలవర్ధన్‌లు సీఐ అరుణకుమారి పేర్లు చెప్పి విచ్చలవిడిగా దండకాలు చేస్తున్న విషయాన్ని కూల్‌డ్రింక్‌ షాపు యజమాని ప్రతాప్‌రెడ్డి ఏసీబీ అధికారులకు వివరించాడు. పైసలు ఇవ్వనందుకు అక్రమంగా కేసులు పెట్టి బెదిరింపులకు గురిచేస్తున్న విషయాన్ని కూడా పూసగుచ్చినట్లు చెప్పాడు. దీంతో రంగంలోకి దిగిన ఏసీబీ అధికారులు కూల్‌డ్రింక్‌ షాపు యజమాని నుండి రూ 10వేలు లంచం తీసుకుంటుండగా రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. వారి దర్యాప్తులో సీఐ అరుణకుమారి పాత్ర ఉన్నట్లుగా గుర్తించారు. దీంతో ఎస్‌ఈబీ రాష్ట్ర కమిషనర్‌ గురువారం సీఐ అరుణకుమారిని సస్పెండ్‌ చేస్తూ ఉత్తర్వులు కూడా జారీ చేశారు. ఎస్‌ఈబీలో అవినీతి హద్దులు దాటి పాపం పండి ఏసీబీ వలకు చిక్కడంతో కూల్‌డ్రింక్‌ షాపుల యజమానులు ఊపిరిపీల్చుకున్నారు.

పేట సబ్‌రిజిష్టార్‌ కార్యాలయంలో అవినీతి రాజ్యం..

ప్రభుత్వానికి ఆదాయం తీసుకువచ్చే శాఖలలో ప్రధానమైనది స్టాంపులు, రిజిస్ట్రేషన్‌లశాఖ. అలాంటి శాఖలో విధులు నిర్వర్తిస్తున్న అధికారులు విచ్చలవిడి అవినీతికి పాల్పడుతూ ప్రజలను జలగల్లా పీక్కు తింటున్నారు. రిజిస్ట్రేషన్‌ల కోసం వచ్చే వారి నుండి భారీ మొత్తంలో నగదు దండుకుంటున్నారు. ఇంటి స్థలం, భవనాలు, పొలాలు రిజిస్ట్రేషన్‌లు చేసుకోవాలంటే ఇక్కడ భారీ మొత్తంలో ముడుపులు ఇచ్చుకోక తప్పడం లేదు. ఇదంతా వీరికి రాజ్యాంగం కల్పించిన హక్కులాగ దందా సాగిస్తుంటే ఉన్నతస్థాయి అధికారులు ఏ మాత్రం పట్టనట్లుగా అవినీతికి పాల్పడే వారిని భుజం తట్టి ప్రోత్సహిస్తుండడం మరింత విమర్శలకు దారి తీ స్తోంది. నాయుడుపేట సబ్‌రిజిష్ట్రార్‌ కార్యాలయం కేంద్రంగా నకిలీ చలానాల బాగోతం వెలుగుచూసింది. ప్రభుత్వానికి చెల్లించాల్సిన నగదును మోసంచేసి తమ ఖాతాలో జమచేసుకున్నారు. ఇప్పటికీ ఈ కేసు కొలిక్కిరాకపోవడం ఎన్నో విమర్శలకు దారి తీస్తోంది. మరోవైపు ఇక్కడ దళారుల దందా సాగుతున్నప్పటికీ అడ్డుకునే వారు లేరు. పైగా అడ్డగోలు రిజిస్ట్రేషన్‌లకు భారీమొత్తంలో ముడుపులు అందుకుంటూ అవినీతికి పాల్పడుతున్నారన్న విమర్శలు ఉన్నాయి. ఈ అవినీతి వ్యవహారాలను పత్రికలలో ప్రచురణ చేసి బట్టలు ఊడదీసి ఉతికినట్లుగా కథనాలు రాస్తున్నా మాకేంటి సిగ్గు అన్నట్లుగా నిసిగ్గుగా ప్రతిపనికి ఓ రేటు నిర్ణయించి మరీ నగదు దండుకుంటున్నారు. ఒక్క స్టాంపులు, రిజిస్ట్రేషన్‌ల శాఖలోనే ఇలాంటి వ్యవహరాలు ఉన్నాయనుకుంటే పొరపాటు. రెవెన్యూ శాఖలో ఏ పని జరగాలన్నా అక్కడ డేటా ఆపరేటర్‌ నుండి మండల స్థాయి అధికారుల వరకు ముడుపులు ఇవ్వందే ఫైళ్లపై సంతకాలు చేయని పరిస్థితి నెలకొనింది. పైగా ఇక్కడ కూడా దళారులే చక్రం తిప్పుతూ అధికారులకు ముడుపులు అందిస్తూ అన్నీ చక్కబెడుతున్నారన్న విమర్శలు ఉన్నాయి. పోలీసుశాఖలోను ఇలాంటి వ్యవహరాలే చోటు చేసుకుంటున్నాయి.

అవినీతికి అడ్డుకట్ట పడేనా..

- Advertisement -

కొన్ని ప్రభుత్వ శాఖలలో విధులు నిర్వర్తించే అధికారులు, ఉద్యోగులు అవినీతి, అక్రమాల ద్వారా పైసా వసూళ్లకు పాల్పడుతున్న తీరును ప్రజలు చీదరించుకుంటున్నారు. వీరి అవినీతి హద్దులు దాటి పోతుండడంతో ఏసీబీని సైతం ఆశ్రయించక తప్పడం లేదు. ఎస్‌ఈబీలో బట్టబయలైన అవినీతి బాగోతంతోనైనా ఆయా శాఖలలో అవినీతికి పాల్పడే అధికారులు, ఉద్యోగులు మేల్కోవాల్సి ఉంది. అలా కాకుండా ఎవరేమి చేస్తారు.. మా పందా ఇంతే అన్నట్లుగా విర్రవీగితే పాపం పండిన రోజు వేటు పడడం ఖాయమన్నది ఏసీబీ దాడులతో రుజువైన విషయాన్ని గుర్తిస్తే మంచిదని కొందరి అభిప్రాయంగా ఉంది. అదే సమయంలో ఇలాంటి అధికారులు, ఉద్యోగుల అవినీతి అక్రమాల వల్ల ప్రభుత్వానికి మచ్చ వస్తున్న సందర్భంలో పాలకులు మేల్కోని ప్రజలకు జ వాబుదారి తనంగా ఆయా శాఖల అధికారులు సేవలు అందించేలా చూడాల్సి ఉంది. అవినీతికి పాల్పడే అధికారులను ఈ నియోజకవర్గం నుండి సాగనంపే చర్యలు చేపట్టక పోతే ప్రజల్లో ఉన్న నమ్మకం కోల్పోక తప్పదని మరికొందరి వాదనగా ఉంది.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..,

Advertisement

తాజా వార్తలు

Advertisement