అమరావతి, ఆంధ్రప్రభ : గత ప్రభుత్వ హయాంలో ఏపీ ఫైబర్‌నెట్‌లో అవినీతి జరిగిన మాట వాస్తవమేనని మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి తెలిపారు. సోమవారం శాసనమండలిలో వైకాపా ఎమ్మెల్సీలు మహ్మద్ ఇక్బాల్, లేళ్ల అప్పిరెడ్డి తదితరులు అడిగిన ప్రశ్నకు మంత్రి బదులిచ్చారు. గత ప్రభుత్వం నిబంధనలను సడలించి టెర్రాసాఫ్ట్‌కు టెండర్ కట్టబెట్టిందని తెలిపారు. దాదాపు రూ. 337 కోట్ల విలువైన పనులను ఈ సంస్థకు అప్పగించారని తెలిపారు. అప్పటి వరకు బ్లాక్‌లిస్ట్‌లో ఉన్న టెర్రాసాఫ్ట్ ను టెండర్‌కు ఒక్కరోజు ముందు బ్లాక్‌లిస్ట్ నుంచి తొలిగించారని, ఇది పూర్తిగా నిబంధనలకు విరుద్ధంగా ఉందన్నారు.
ఈ అంశానికి సంబంధించి తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక సీఐడీ విచారణకు ఆదేశించిందని తెలిపారు. ఈ కేసులో వేమూరి హరికృష్ణ, సాంబశివరావుపై సీఐడీ కేసు నమోదు చేసినట్లుగా మంత్రి వెల్లడించారు. ప్రస్తుతం ఈ కేసు విచారణలో ఉందని బాధ్యులు ఎవరైనా చర్యలు తప్పవని స్పష్టం చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ ఇక్బాల్ మాట్లాడుతూ ఆనాడు ఎనర్జీ శాఖ ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు పరిధిలో ఉందని ఆయన ప్రమేయం కూడా ఉన్నట్లుగా ఆరోపించారు. ఈ అంశంపై కూడా విచారణ జరపాలని కోరారు. దీనిపై స్పందించిన మంత్రి అన్ని కోణాల్లో విచారణ జరుగుతుందని తెలిపారు.