నిబంధనలకు నీళ్ళు వదిలిన అధికారులు
లైసెన్స్ మంజూరు… రెన్యువల్‌కు రూ.25,000
తనిఖీ చేస్తే రూ. 5,000 చెల్లించాల్సిందే
ఏటా రెండు సార్లు మందుల షాపులు తనిఖీ
సాలీనా రూ.100 కోట్లకు పైగా వసూళ్ళు
కోట్లకు పడగలెత్తిన అధికారగణం
రాష్ట్రంలో యథేచ్ఛగా మందుల విక్రయాలు
ప్రమాదంలో ప్రజారోగ్యం
అమరావతి, అంద్రప్రభ: రాష్ట్రంలో అన్ని ప్రభుత్వ కార్యాలయాలలో అవినీతికి స్థానం లేకుండా పారదర్శక పాలన జరగాలన్నది ముఖ్యమంత్రి జగన్ ఆశయం. అందుకు అనుగుణంగా అవినీతి నిరోధక శాఖను బలోపేతం చేయడంతో పాటు- ప్రజల్లో అవగాహన కోసం ప్రభుత్వం అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లో పెద్ద ఎత్తున పోస్టర్లు టోల్ ఫ్రీ నంబర్‌ను కూడా ఏర్పాటు- చేసింది ప్రభుత్వం. అవినీతి నిరోధానికి ఎన్ని చర్యలు చేపట్టినా ఏదో రకంగా అవినీతి అక్రమాలు జరుగుతునే వున్నాయి. కొన్ని శాఖల్లో వ్యవస్థీకృతంగా మామూళ్ల పర్వం సాగుతునే వుంది. ఈ నేపథ్యలోనే రాష్ట్ర ఔషధ నియత్రణ శాఖలో మామూళ్ల పర్వం కొన్నేళ్లుగా వ్యవస్థాగతంగా నడుస్తోంది. నిబంధన లకు నీళ్ళు వదిలి మామూళ్ల మత్తులో అధికారులు మునిగి తెలుస్తున్నారనే విమర్శలు వెల్లవెత్తుతున్నాయి. ఏటా వివిధ రూపాల్లో సుమారు రూ. 100 కోట్లు- మందుల షాపుల నుంచి అధికారులకు ముడుపులు చేరుతున్నట్లు- సమాచారం. రాష్ట్రంలో ఏ ప్రభుత్వం అధికారంలో ఉన్నా వీరి ముడుపులకు నియంత్రణ లేకుండా పోయిందని చెబుతున్నారు.
అమలుకాని డ్రగ్స్, కాస్మోటిక్ చట్టం నిబంధనలు
ఈ మామూళ్ల పర్వంకు సంబందించిన వివరాలిలా వున్నాయి.. రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 40 వేలకు పైగా రి-టైల్ మెడికల్ షాపులు, 15 వేలకు పైగా హోల్ సేల్ షాపులు వున్నాయి. అలాగే వందల సంఖ్యలో మందుల తయారీ కంపెనీలు వున్నాయి. మందుల తయారీ కంపెనీలు మాడుల షాపుల ద్వారా ప్రజలకు మందుల సరఫరా జరుగుతోంది. .డ్రగ్స్ మరియు కాస్మోటిక్ చట్టం 1940 మరియు 1945 నిబంధనల ప్రకారం మందుల తయారీ మరియు సరఫరా ప్రక్రియలను నిరోధిస్తూ ఔషధ నియంత్రణ శాఖ మందుల తయారీ కంపెనీలకు, రి-టైల్, హోల్‌సేల్ మందుల షాపులకు లైసెన్సులను మంజూరు చేస్తూ ఉంటు-ంది. డ్రగ్స్ మరియు కాస్మోటిక్ చట్టంలోని అధికరణ 65 ప్రకారం మందుల తయారీ మరియు మందుల సరఫరా క్వాలిఫైడ్ రిజిస్టర్డ్ ఫార్మసిస్టుల ఆధ్వర్యంలోనే జరగాలి, ఇతరులు ఎవరు కూడా మందుల తయారీ, ప్రజలకు మందుల విక్రయాలు జరుపకూడదనీ, అలా చేసే వారిని చట్ట ఉల్లంఘన కింద ఔషధ నియంత్రణ శాఖ అధికారులు కేసులు నమోదు చేసి కోర్టుల ద్వారా శిక్షలు వేయించాలి. కానీ ఈ నిబంధన రాష్ట్రంలో ఎక్కడ పూర్తిస్థాయిలో అమలు జరిగిన దాఖలాలు కనిపించడం లేదు. దాదాపు 90 శాతానికి పైగా మందుల షాపులలో క్వాలిఫైడ్ ఫార్మసిస్టులు లేకుండానే మందుల షాపుల యజమానులు మందులు విక్రయాలు చేస్తున్నారు. మందులపై కనీస పరిజ్ఞానం లేని వారి చేత ప్రజలకు మందుల అమ్మకాలు చేయడం వల్ల ప్రజారోగ్యం ప్రమాదంలో పడిందనే విమర్శలు ఉన్నాయి. ఫలితంగా విచ్చలవిడి మందుల వాడకం వలన రోగ నిరోధక శక్తి తగ్గిపోయి అనారోగ్య సమస్యలు వచ్చి ప్రజల యొక్క సగటు- ఆయు:కాలం తగ్గిపోతోందని చెబుతున్నారు. అమెరికాలోని ప్రతిష్టాత్మక ఫుడ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ వంటి అంతర్జాతీయ సంస్థలు ఈ ప్రమాదాన్ని హెచ్చరిస్తున్నాయి.
లైసెన్స్ రెన్యువల్‌కు రూ. 25వేలు.. తనిఖీకి రూ. 5వేలు
వాస్తవాలను గమనిస్తే ఫార్మసిస్టులు లేకుండా మందుల షాపులు నడుపుకోవడానికి ఆయా షాపుల యజమానులు ఔషధ నియంత్రణ శాఖ అధికారులకు కోట్ల రూపాయలు ముడుపులు చెల్లిస్తున్నారని తెలుస్తోంది. రి-టైల్ లేదా హోల్‌సేల్ మందుల షాపుకు లైసెన్స్ జారీ చేయాలంటే 25 వేల రూపాయలు ముడుపులు సాంప్రదాయబద్ధంగా చెల్లించాల్సిన పరిస్థితి నెలకొంది. ప్రతి సంవత్సరం కనీసం రెండుసార్లు రి-టైల్ మరియు హోల్‌సేల్ మందుల షాపులను తనిఖీ చేసి నిబంధనలు అమలు జరుగుతున్నాయా లేదా అనేది ఔషధ అధికారులు చూడాల్సి వుంది. మందుల షాపులలో క్వాలిఫైడ్ రిజిస్టర్ ఫార్మసిస్టులు లేకున్నా, ప్రిస్కిప్ష్రన్ లేకుండా ప్రజలకు మందులు జారీచేసినా, మందుల కొనుగోలుపై వినియోగదారులకు బిల్లులు ఇవ్వకున్నా, నాసిరకం మందులు అమ్మినా, మందులకు సంబంధించి కొనుగోలు, అమ్మకానికి సంబంధించి రికార్డులు నిర్వహణ చేయకపోయినా మందుల షాపుల యజమానులపై కేసులు రాసి చట్టపరమైన చర్యలు చేపట్టాల్సి వుంది. అయితే ఔషధ నియంత్రణ అధికారులు చర్యలు చేపట్టకుండా వుండటానికి ఒక్కో తనిఖీకి రూ. 5000 చొప్పున సంవత్సరానికి చేయాల్సిన రెండు తనిఖీలకు కలిపి వెరసి రూ. 10 వేల చొప్పున మందుల షాపుల యజమానుల నుంచి ఔషధ నియంత్రణ శాఖ అధికారులు వసూళ్లు చేస్తున్నట్లు- సమాచారం. ప్రతి ఐదు సంవత్సరాలకు ఒకసారి లైసెన్సులు రెన్యువల్ చేసుకోవాల్సి ఉండగా ప్రతి రెన్యువల్‌కు 25వేల రూపాయలు ముట్ట చెప్పాల్సిందేనని చెబుతున్నారు. అంటే ఒక్కో మెడికల్ షాప్ నుండి సగటు-న ప్రతి సంవత్సరం 15వేల రూపాయలు ఔషధ నియంత్రణ శాఖకు వెళుతున్నట్లు- తెలుస్తోంది. దీన్నిబట్టి చూస్తే 40 వేల రీ-టైల్ మరో 15 వేల హోల్‌సెల్ మెడికల్ షాపులు.. మందుల తయారీ కంపెనీల నుండి ఏటా సుమారు రూ. 100 కోట్లు- మందుల షాపుల సంఘాలు వసూళ్లు చేసి ఔషధ నియంత్రణ శాఖ అధికారులకు ముట్టచెబుతున్నట్లు- సమాచారం. కాగా గ్రామీణ వైద్యులుగా పిలువ బడే అర్ఎంపీ.. పేఎంపీలనుంచి మామూళ్లు వసూలు చేస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. ఈ శాఖలో కొందరు అధికారులు కొట్లకు పడగ పెట్టారనే ఆరోపణలు ఉన్నాయి.
నామమాత్రంగా తనిఖీలు
ఫిర్యాదులు.. మీడియాలో వార్తలు వచ్చిన సమయంలో ఔషధ నియంత్రణ శాఖ అధికారులు హడావుడి సృష్టించి కొన్ని షాపులపై దాడులు నిర్హింహించి త్కాలికంగా లైసెన్సులు రద్దు చేయడం.. అనంతరం వాటిని పునరుద్ధరించడం పరిపాటిగా మారింది. కొన్ని జిల్లాల్లో మందుల షాపుల్లో తనిఖీలు నామ మాత్రంగానే వున్నట్లు- తెలుస్తోంది. రాష్ట్ర వ్యాప్తంగా అత్యధిక మందుల షాపుల్లో ఫార్మాసిస్టులు లేకున్నా వారి లైసెన్స్ మాత్రమే వుంటు-ంది. మెజారిటి ఫార్మాసిస్టులు తమ ఫార్మసీ సర్టిఫికెట్లను షాపుల యజమానులకు అద్దెకు ఇచ్చి విధులకు రాకుండా వేర్వేరు వృత్తుల్లో కొనసాగుతున్నారు. అయితే అధికారుల తనిఖీల సమయంలో ఈ విషయం తెలిసినా వారిపై చర్యలు తీసుకోమని ఫార్మసీ కౌన్సిల్‌కు సిఫార్సు చేయాల్సి వుంది. అయితే రాష్ట్రంలో ఇదెక్కడ అమలు జరిగిన దాఖలాలు కనిపించడం లేదు.
మందుల తయారీ కంపెనీల నుంచి భారీ వసూళ్లు
ఇదిలావుండగా, మందుల తయారీ కంపెనీల నుంచి కూడా భారీ స్థాయిలో ఔషధ నియంత్రణ శాఖకు ముడుపులు ముట్ట చెబుతున్నట్లు- తెలుస్తోంది. మందుల తయారీ అనుమతి లైసెన్సులు మరియు సదరు కంపెనీల్లో తయారైన మందుల నాణ్యత ప్రమాణాల నిర్దారణ, మార్కెటింగ్ లైసెన్సులు, తనిఖీలు తదితర ప్రక్రియల కోసం భారీ మొత్తంలో అధికారులకు తయారీ దారుల నుంచి మామూళ్లు ముడుతున్నట్లు- సమాచారం. మందులు తయారు చేస్తున్న ఫార్మా కంపెనీలలో కూడా పూర్తిస్థాయిలో క్వాలిఫైడ్ ఫార్మసిస్టుల సమక్షంలో మందుల తయారీ జరగడం లేదన్న ఆరోపణలు వినవస్తున్నాయి. ఫార్మసిస్టులు చేయాల్సిన పనులను బీఎస్సీ, ఎమ్మెస్సి కెమిస్ట్రీ పట్టభద్రులకు శిక్షణ ఇచ్చి తక్కువ జీతాలకే ఫార్మా కంపెనీలు మందుల తయారీ, క్వాలిటీ- కంట్రోల్, ప్యాకింగ్ డిపార్ట్మెంట్లలో నియమకం చేసుకుంటు-న్నారని తెలుస్తోంది. వీటిని అరికట్టాల్సిన ఔషధ నియంత్రణ శాఖ అధికారులు మామూళ్ల మత్తులో నిబంధనలను గాలికి వదిలేశారనే విమర్శలు ఉన్నాయి.
సీఎం జగన్ దృష్టి సారించాలి
అవినీతి రహిత పాలనే ధ్యేయంగా ఎంచుకున్న ముఖ్యమంత్రి జగన్ ఔషధ నియంత్రణ శాఖలో జరుగుతున్న అవినీతిపై దృష్టి సారించి అక్రమార్కుల ఆగడాలను అరికట్టి నిబంధనలు అమలయ్యేలా చర్యలు చేపట్టి ప్రజారోగ్యాన్ని కాపాడాలని కోరుతున్నారు. గత నాలుగేళ్ల కాలంలో ఔషధ నియంత్రణ శాఖ అధికారులు ఆయా జిల్లాల్లో చేసిన తనిఖీలు.. నిబంధనలు అతిక్రమించిన యజమానులు.. పార్మాసిస్టులపై తీసుకున్న చర్యలు పరిశీలిస్తే వాస్తవాలు వెల్లడికాగలవు. కాగా అన్ని శాఖల్లో జారుతున్న అవినీతిపై దృష్టి సారిస్తున్న అవినీతి నిరోధక శాఖ ఔషధ నియంత్రణ శాఖ మరియు అధికారులపై కూడా దృష్టి కేంద్రీరించాల్సి వుందని చెబుతున్నారు. ఈ విషయమై వివరణ కోరేందుకు ఆంధ్రప్రభ డ్రగ్ కంట్రోలర్ కోసం ఫోన్ ద్వారా ప్రయత్నించగా అందుబాటు-లోకి రాలేదు.