Friday, November 22, 2024

Corruption – అమరావతి – బెంగుళూరు హైవే భూ స‌ర్వేలో మాయాజాలం…

అమరావతి, ఆంధ్రప్రభ, బ్యూరో: అమరావతి – బెంగుళూరు హైస్పీడ్‌ హైవే రోడ్డు నిర్మాణానికి సంబంధించి జరుగుతున్న భూసేకరణ పనుల్లో అనేక చోట్ల అవకతవకలు చోటుచేసుకుంటు న్నట్లు ఆరోపణలు వస్తున్నాయి. ఆయా జిల్లాల్లో రైతులు స్థానిక అధికారులకు ఫిర్యాదులు చేస్తున్నా..పట్టించుకునే వారు లేకపోవడంతో కొన్ని ప్రాంతాల్లో భూములు కోల్పోతున్న రైతులు జిల్లా కలెక్టర్లను కలిసి ఫిర్యాదులు చేయడాన్ని బట్టి చూస్తుంటే పరిహారం చెల్లింపులో పెద్దఎత్తున అక్రమాలు చోటుచేసుకుంటు న్నట్లు తెలుస్తోంది. ఒకే ప్రాంతంలో భూములకు రెండు రకాలుగా పరిహారాన్ని చెల్లించేలా అధికారులు అంచనాలు వేస్తుండడంపై ఆయా ప్రాంతాల్లో రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అలాగే దిగుడు బావులకు సంబంధించి పరిహారం నమోదులోనూ రెండు రకాలుగా రికార్డులు సిద్ధం చేస్తున్నారు. అలాగే ఇళ్లకు సంబంధించి నమోదు చేయడంలోనూ కొంతమంది అధికారు లు ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నారు. తమకు అనుకూలంగా ఉన్న వారికి ఎక్కువ మొత్తంలోనూ పరిహారం చెల్లించేలా ఏర్పాట్లు చేస్తూ నిజమైన రైతులకు అన్యాయం చేస్తున్నారు. దీంతో జాతీయ రహదారి నిర్మాణానికి
సంబంధించిన భూసేకరణలో సర్వే సిబ్బంది భూభాగోతం ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తుంది. స్థానికంగా ఉన్న కొంతమంది నేతల నుంచి పెద్దఎత్తున ముడుపులు తీసుకుని చిన్న ఇళ్లకు (పూరి గుడిసెలకు), స్లాబు ఇళ్లకు ఇస్తున్న పరిహారాన్ని చెల్లించేలా రికార్డులు నమోదు చేస్తున్నారు. వారు అడిగినంత మామూళ్లు ఇచ్చుకోలేని వారికి భవంతులు ఉన్నా సరే పాత కాలం నాటి భవనంలా చూపిస్తూ తక్కువ ప్రతిపాదనలను నమోదు చేస్తున్నారు. దీంతో ఒకే ప్రాంతానికి చెందిన రైతులకు పరిహారం చెల్లింపులో భారీ వ్యత్యాసాలు కనిపిస్తున్నాయి.

హైస్పీడ్‌ హైవే రోడ్డు భూసేకరణలో..అడుగడుగునా అక్రమాలు
అమరావతి నుంచి గుంటూరు, ప్రకాశం, నెల్లూరు, కడప, కర్నూలు, అనంతపురం జిల్లాలను కలుపుతూ బెంగుళూరు వరకు హైస్పీడ్‌ హైవేను నిర్మించాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నిర్ణయం తీసుకున్నాయి. అందుకోసం సుమారు రూ.24 వేల కోట్లతో అంచనాలు కూడా రూపొందించింది. 393 కి.మీ పొడవున నిర్మించే రహదారిలో 185 కిలోమీటర్లు 4 లైన్లు, 208 కిలోమీటర్లు 6 లైన్లు రహదారిని నిర్మించేలా ప్రణాళికలు రూపొందించారు. ఆ దిశగా అమరావతి నుంచి కొంతవరకు రోడ్డు నిర్మాణ పనులు కూడా ప్రారంభం అయ్యాయి. అందుకు సంబంధించి కొన్ని జిల్లాల్లో భూసేకరణ జరుగుతోంది. ఇప్పటివరకు భూసేకరణ పూర్తయిన ప్రాంతాల్లో గతంలోనే పనులు ప్రారంభించారు. ప్రకాశం, నెల్లూరు, కడప జిల్లాల పరిధిలోని పలు ప్రాంతాల్లో ప్రస్తుతం సర్వే సాగుతోంది. అయితే జాతీయ రహదారి నిర్మాణానికి సుమారు 8,652 ఎకరాల భూమి అవసరం ఉంది. అందులో 872 ఎకరాలు అటవీ భూమి పోను, మిగిలిన భూమిని ప్రైవేటు వ్యక్తులు, రైతుల నుంచి ఆయా ప్రాంతాల్లో ప్రభుత్వం నిర్ధేశించిన మార్కెట్‌ ధర ప్రకారం పరిహారం చెల్లించి భూములను స్వాధీనం చేసుకోవాల్సి ఉంది. అందుకు సంబంధించి జరుగుతున్న సర్వేలో అధికారులు ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి.

ఓ బావికి రూ.50 వేలు..మరో బావికి రూ.8 లక్షలు
జాతీయ రహదారి నిర్మాణం దాదాపుగా గ్రామీణ ప్రాంతాల మీదుగానే వెళ్తోంది. దీంతో ప్రకాశం, నెల్లూరు, కడప జిల్లాల్లోని వెనుకబడిన ప్రాంతాల్లో మెట్ట భూములతో పాటు పలు మాగాని భూములు కూడా భూసేకరణలో రైతులు కోల్పోతున్నారు. దీంతో ఆయా ప్రాంతాల్లో ప్రభుత్వం నిర్ధేశించిన ధరల ప్రకారం పరిహారాన్ని అందించాలని నిర్ణయం తీసుకుంది. అయితే సర్వే అధికారులు మాత్రం ఇళ్లు, పొలాలతో పాటు బావులకు ఇష్టానుసారంగా పరిహారాన్ని అందిస్తున్నట్లు రైతుల్లో విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఒకే ప్రాంతంలో ఉన్న దిగుడు బావులకు రెండు రకాలుగా పరిహారాన్ని నమోదు చేస్తుండడాన్ని బట్టి చూస్తుంటే అధికారులు నిబంధనలకు విరుద్దంగా నిర్ణయాలు తీసుకుంటున్నారని స్పష్టంగా అర్ధమవుతుంది. ఒకే ప్రాంతంలో ఉన్న బావుల్లో ఓ బావికి రూ.50 వేలు, మరో బావికి రూ.8 లక్షలు వరకు పరిహారాన్ని చెల్లిస్తున్నారు. అందుకు బావి లోతు, విస్తీర్ణాన్ని రికార్డుల్లో ఎక్కువగా చూపిస్తున్నారు. వాస్తవానికి రెండు బావుల విస్తీర్ణం ఒకే రకంగా ఉన్నప్పటికీ ఆయా ప్రాంతాలకు చెందిన రైతుల నుంచి ముడుపులు తీసుకుని ఒకరికి ఎక్కువ, మరోకరికి తక్కువగా పరిహారాన్ని చెల్లించేలా రికార్డులు నమోదు చేస్తున్నారు.

జిల్లా కలెక్టర్‌లను ఆశ్రయిస్తున్న..రైతులు

భూసేకరణలో అక్రమాలు జరుగుతున్నాయంటూ రైతులు స్థానిక అధికారులను ఆశ్రయిస్తున్నా వారి నుంచి స్పందన కరువవుతుంది. దీంతో పలువురు రైతులు జిల్లా కేంద్రాలకు వెళ్లి కలెక్టర్‌లను కలిసి ఫిర్యాదులు చేస్తున్నారు. కడప, ప్రకాశం సరిహద్దులోని శ్రీ పొట్టిశ్రీరాములు జిల్లా సీతారామపురం మండలం పబ్బులేటిపల్లి గ్రామానికి చెందిన మద్దినేని రామయ్య అనే రైతు స్థానిక మాజీ జడ్పీటీసీ, వైసీపీ సీనియర్‌ నేత దుగ్గిరెడ్డి గురవారెడ్డితో కలిసి నెల్లూరు జిల్లా కలెక్టర్‌ ఎం. హరినారాయణన్‌కు ఫిర్యాదు చేశారు. పై రైతుకు గ్రామ పరిధిలో సర్వే నెంబర్‌ 41-4బిలోని 1.52 సెంట్ల భూమి ఉంది. అందుకు సంబంధించి పాస్‌బుక్‌ కూడా ఉంది. అయితే జాతీయ రహదారి నిర్మాణంలో భాగంగా అందులో 81 సెంట్ల భూమిని రోడ్డు నిర్మాణానికి తీసుకుంటున్నట్లు అధికారులు నోటీసులిచ్చారు. అయితే ఆ భూమికి సంబంధించి ఎంత పరిహారం ఇస్తున్నారు..ఏ మేరకు చెల్లించబోతున్నారు అనే విషయం స్పష్టంగా చెప్పకపోవడంపై రైతు ఆందోళన వ్యక్తం చేస్తూ ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశారు. అదేవిధంగా ఇదే ప్రాంతంలో బావులకు సంబంధించి కూడా కొంతమందికి పరిహారం మొత్తాన్ని ముందే చెబుతుండగా మరికొంత మంది రైతులకు గోప్యంగా ఉంచుతున్నారు. ఇలా పరిహారం చెల్లింపులో ఏకపక్ష నిర్ణయాలు తీసుకోవడం, రైతులు స్థానికంగా ఉన్న ఇబ్బందులను చెబుతున్నా పట్టించుకోకుండా ఇష్టానుసారంగా వ్యవహరించడంపై ఆయా ప్రాంత రైతుల్లో ఆందోళన వ్యక్తమవుతోంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement