Friday, November 22, 2024

వెల్ నెస్ కేంద్రాల‌కు అనారోగ్యం..

అమరావతి, ఆంధ్రప్రభ బ్యూరో: గ్రామీణ ప్రాంత ప్రజలకు మరింత మెరుగైన వైద్య సేవలను అందించాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఉమ్మడిగా ఎప్పటికప్పుడు సరికొత్త నిర్ణయాలు తీసుకుంటున్నాయి. ఆదిశగా అత్యం విలువైన వైద్యం, మందులు పల్లె ప్రజలకు అందుబాటు లో ఉండేలా చర్యలు తీసుకుంటోంది. అందులో భాగంగానే కేంద్ర ప్రభుత్వం ఆయుష్మాన్‌ భారత్‌ కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. రాష్ట్రవ్యాప్తంగా ప్రతి రెండు వేల మంది జనాభాకు వైద్య సేవలందించేలా మిడ్‌ లెవెల్‌ హెల్త్‌ ప్రొవైడర్‌ (ఎమ్‌ఎల్‌హెచ్‌సీ)ను నియమించింది. అందుకోసం పల్లెల్లో కొత్తగా హెల్త్‌ వెల్‌నెస్‌ కేంద్రాలను ఏర్పాటు చేసి వాటి పరిధిలో 76 రకాల మందులు, 15 రకాల జబ్బులకు సంబంధించిన పరీక్షలు నిర్వహించేలా పరికరాలను ఏర్పాటు చేసింది. అదేవిధంగా అత్యంత విలువైన థైరాయిడ్‌ మందులు, వాటికి సంబంధించిన పరీక్షలు నిర్వహించడానికి వివిధ రకాల మెడికల్‌ కిట్లను కూడా అందుబాటులో ఉంచింది. అయితే, ఇంత ఖరీదైన మందులు వైద్య పరికరాలను అందుబాటులో ఉంచుకుని కూడా ఎమ్‌ఎల్‌హెచ్‌సీలు ఆశించిన స్థాయిలో సేవలందించలేకపోతున్నారు. విధుల్లో చేరినప్పటి నుండి ఆయా ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల పరిధిలోని ఏఎన్‌ఎంలు, హెల్త్‌ అసిస్టెంట్లపై కర్ర పెత్తనం చెలాయించడానికే వీరు ప్రాథాన్యతనిస్తున్నారు. దీంతో కొన్ని జిల్లాల్లో ఇద్దరి మధ్య ఆధిపత్య పోరు ఫిర్యాదుల వరకూ వెళ్తోంది. సంబంధిత జిల్లాలకు చెందిన ఉన్నతాధికారులు అంతర్గతంగా సాగుతున్న వివాదాలపై పూర్తిస్థాయిలో దృష్టి సారించలేకపోతున్నారు. ఫలితంగా అనేక గ్రామాల్లో వైద్య సేవలు పూర్తిగా కుంటుపడుతున్నాయి. దీంతో ప్రభుత్వ ఆశయాలకు ఆయుష్మాన్‌ భారత్‌ సేవలు కుంటుపడుతున్నాయి.

అలంకార ప్రాయంగా మారుతున్న హెల్త్‌ వెల్‌నెస్‌ సెంటర్లు
రాష్ట్రంలో ఇప్పటికే ప్రభుత్వ ఆధ్వర్యంలో పలు వైద్య సేవలు ఆయా ప్రాంతాల్లో అందుతున్నాయి. ప్రత్యేకించి జగన్‌ సర్కార్‌ విలేజ్‌ హెల్త్‌ క్లినీక్‌లను కూడా తీసుకొచ్చింది. వీటితోపాటు కేంద్ర ప్రభుత్వం కూడా వివిధ పథకాల ద్వారా వైద్య సేవలను అందించేందుకు అవసరమైన ఏర్పాట్లు చేపట్టింది. దీంతో కొత్తగా రాష్ట్రవ్యాప్తంగా ఆయా ప్రాంతాల్లో ఆయుష్మాన్‌ భారత్‌ పేరుతో హెల్త్‌ వెల్‌నెస్‌ సెంటర్లను ఏర్పాటు చేసింది. ఈ కేంద్రాల్లో 2020 నుండి విడతలవారీగా ఎనిమిది బ్యాచ్‌లలో సుమారు 10,400 మంది ఎమ్‌ఎల్‌హెచ్‌సీలను నియమించింది. వీరంతా నిత్యం ఆయా గ్రామాల పరిధిలో పర్యటించి ప్రజలకు అవసరమైన వైద్య సేవలు అందించాలి. ప్రతి ఇంటికీ వెళ్లి వారి ఆరోగ్య సమస్యలను అడిగి తెలుసుకుని వారికి అవసరమైన మందులను పంపిణీ చేయాలి. అలాగే బీపీ, షుగర్‌ పరీక్షలతోపాటు అత్యంత విలువైన థైరాయిడ్‌ పరీక్షలను కూడా నిర్వహించి అవసరమైన వారికి థైరాయిడ్‌ మందులను ఉచితంగా అందించాలి. ప్రస్తుతం మార్కెట్‌లో థైరాయిడ్‌ వ్యాధికి సంబంధించి మందులు చాలా ఖరీదు. దీంతో కేంద్ర ప్రభుత్వం గ్రామీణ ప్రజలకు ఎమ్‌ఎల్‌హెచ్‌సీల ద్వారా ఆసేవలను కూడా ఉచితంగా అందించాలని నిర్ణయం తీసుకుంది. రాష్ట్ర ప్రభుత్వం సహకారంతో ఈసేవలను ప్రారంభించింది. అయితే, ఉమ్మడి 13 జిల్లాల పరిధిలో కొన్ని ప్రాంతాల్లో హెల్త్‌ వెల్‌నెస్‌ సెంటర్లు ఆశించిన స్థాయిలో సేవలందించలేకపోతున్నాయి. వాటి పరిధిలో విధులు నిర్వహిస్తున్న ఎమ్‌ఎల్‌హెచ్‌సీలు ప్రభుత్వ లక్ష్యాలకు అనుగుణంగా వైద్య సేవలు అందించకుండా అందుకు భిన్నంగా స్థానికంగా ఉన్న ఏఎన్‌ఎంలు, హెల్త్‌ అసిస్టెంట్లపై ఆదిపత్యం చెలాయించడానికే ఎక్కువ సమయం కేటాయిస్తున్నారు. మరికొంతమంది అయితే అలా వచ్చి ఇలా మొక్కుబడిగా వెళ్లిపోతున్నారు. దీంతో కొన్ని కేంద్రాలు చూద్దామన్నా తలుపులు తెరచుకోవడం లేదు.

కొనసాగుతున్న ఫిర్యాదుల పర్వం
గత రెండేళ్ల క్రితం ఆయుష్మాన్‌ భారత్‌ కింద వైద్య సేవలను ప్రారంభించారు. వాటి పరిధిలో హెల్త్‌ వెల్‌నెస్‌ సెంటర్లను ఏర్పాటుచేసి ఎమ్‌ఎల్‌హెచ్‌సీలను నియమించారు. అయితే, కొన్ని ప్రాంతాల్లో ఏఎన్‌ఎంలు, హెల్త్‌ అసిస్టెంట్లపై ఎమ్‌ఎల్‌హెచ్‌సీలు ఆదిపత్యం చలాయిస్తున్నారు. దీంతో ఆయా జిల్లాల్లో మెడికల్‌ ఆఫీసర్లకు ఏఎన్‌ఎంలు ఫిర్యాదులు చేస్తున్నారు. ఇటీవలికాలంలో ఇద్దరి మధ్య ఆదిపత్య పోరు శ్రుతిమించి పోవడంతో ఫిర్యాదుల సంఖ్య క్రమేణా పెరుగుతోంది. అయితే, వైద్య సేవలు అందించడంలోనూ, శాఖల పరంగా వారు విధులను నిర్వహించడంలోనూ అనేక సందర్భాల్లో విబేధాలు చోటుచేసుకుంటున్నా ఆయా ప్రాంతాలకు చెందిన ఉన్నతాధికారులు వాటిని పరిష్కరించేదిశగా చర్యలు తీసుకోవడం లేదు. దీంతో అనేక జిల్లాల్లో ఈ తరహా ఫిర్యాదులు ఎక్కువగా కనిపిస్తున్నాయి.

నీరుగారుతున్న ప్రభుత్వ ఆశయం
ఏఎన్‌ఎంలు, హెల్త్‌ అసిస్టెంట్లతోపాటు ఎమ్‌ఎల్‌హెచ్‌సీల ద్వారా మరిన్ని మెరుగైన వైద్య సేవలను అందించాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఆదిశగా ఉమ్మడిగా నిర్ణయాలు తీసుకున్నాయి. అందుకోసం వేల కోట్ల రూపాయలను వెచ్చించి లోటు బడ్జెట్‌లోనూ ఖరీదైన మందులను పేదలకు ఉచితంగా అందించాలని ఆదిశగా హెల్త్‌ వెల్‌నెస్‌ సెంటర్లకు సరఫరా చేస్తోంది. ఒకటి కాదు.. రెండు కాదు.. ఏకంగా 76 రకాల మందులతోపాటు 15 రకాల వైద్య పరీక్షలకు సంబంధించిన పరికరాలను కూడా అందించింది. వాటిని భద్రపర్చుకునేందుకు ఫ్రిజ్‌, ఆక్సిజన్‌ సిలెండర్లను కూడా ఏర్పాటు చేసింది. అయితే కొంత మంది వైద్య సిబ్బంది పూర్తిస్థాయిలో ప్రభుత్వ ఆశయాలకు అనుగుణంగా సేవలు అందించకపోవడం, రికార్డుల్లో మాత్రం ఆయా ప్రాంతాల్లో పర్యటించి రోగులను పరీక్షించినట్లు చూపుతూ ప్రభుత్వం అందిస్తున్న మందులను ప్రైవేటుగా విక్రయించడం మరికొన్ని సందర్భాల్లో నిరుపయోగంగా వదిలేయడం చేస్తున్నారు. దీంతో ప్రభుత్వ ఆశయాలు నీరుగారిపోతున్నాయి.

Advertisement

తాజా వార్తలు

Advertisement