అమరావతి,ఆంధ్రప్రభ బ్యూరో: బెజవాడ కనకదుర్గమ్మ అమ్మవారి సన్నిధిలో కొండంత అవినీతి అక్రమాలు చోటుచేసు కుంటున్నట్లు పెద్దఎత్తున విమర్శలు వినిపి స్తున్నాయి. భక్తులు అత్యంత భక్తిశ్రద్ధలతో దుర్గమ్మకు మొక్కులు తీర్చుకుంటూ సమ ర్పించే చీరల వ్యవహారంలోనూ అధికారులు చేతివాటాన్ని ప్రదర్శిస్తున్నట్లు ఆరోప ణలు వస్తున్నాయి. అందుకు తగ్గట్టు గానే టెండర్ల వ్యవహారంలో కూడా పెద్దఎత్తున అక్రమాలు చోటుచేసుకున్నట్లు గణాంకాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. కోవిడ్‌కు ముందు, కోవిడ్ సమయంలోనూ, ఆ తర్వాత చీరల టెండర్ల పక్రియలో కాంట్రాక్టర్లు సిండికేట్ అయి తక్కువ ధరకే టెండర్లు దక్కించుకున్నట్లు తెలుస్తోంది. గతంతో పోలి స్తే అమ్మవారికి చీరల సంఖ్య మరింత పెరిగినప్పటికీ టెండర్లు మాత్రం తక్కువకు కోట్ చేయడం పలు సందేహాలకు తావిస్తున్నది.
అప్పుడు ఆదాయం అదుర్స్
దుర్గగుడిలో టెండర్లలో వండర్లు చోటు చేసుకుంటున్నాయి. గతంలో ఎం. సురేష్ బాబు ఈఓగా ఉన్నప్పుడు చీరల విక్ర యం ద్వారా రూ.4.50 కోట్ల ఆదాయం వచ్చినట్లు రికార్డులు చెబుతున్నాయి. అలాగే ప్రతీ ఏటా దేవస్థానం తరుపునే చీరల వేలం పాటలు నిర్వహిస్తుంటారు. ఇటీవల చీరల కాంట్రాక్ట్‌ను రూ.3 కోట్లకు ప్రైవేటు వ్యక్తులకు కట్టబెట్టినట్లు తెలుస్తోంది. చీరలసంఖ్య మరింత పెరగడంతో పాటు టెండర్ల ద్వారా ఆదాయాన్ని మరింత పెంచుకోవాల్సిన అధికారులు కాంట్రాక్టర్‌తో చేతులు కలిపి తక్కువకు టెండర్‌కే కట్టబెట్టినట్లు తెలుస్తోంది. ఈ వ్యవహారం వెనుక ముడుపుల కథ నడిచిందనే బలమైన అభియోగాలు వినిపిస్తున్నాయి. నిత్యం దుర్గ మ్మ గుడికి వేల సంఖ్యలో భక్తులు వస్తుంటారు. మంగళ, శుక్రవారాల్లో అయితే అధిక సంఖ్యలో భక్తులు హాజరై అమ్మవారికి పెద్దఎత్తున మొక్కులు తీర్చుకుంటుంటారు. అందులో భాగంగానే కొంతమంది భక్తులు చీర, జాకెట్లను అమ్మవారికి సమర్పిస్తుం టారు. అయితే ఆ చీరలకు సంబంధించి ఆలయ ప్రాంగణంలోనే విక్రయిం చుకునేం దుకు కాంట్రాక్ట్ విధానం ద్వారా టెండర్ పిలుస్తారు.
అయితే ఏటా టెండర్ మొత్తాన్ని పెంచుకుంటూ ఆలయానికి ఆదాయం పెరిగేలా చర్యలు చేపట్టాల్సిన అధికారులు కాంట్రాక్టర్‌తో చేతులు కలిపి మిన్నకుంటున్నారు. రోజువారి అమ్మవారికి వచ్చే చీరల సంఖ్య పెరుగుతున్నా వాటిని విక్రయించడంద్వారా వచ్చే ఆదాయం (టెండరు ధర) మాత్రం గతంకంటే తగ్గుతున్నట్లు తెలుస్తోంది. వాస్తవానికి కోవిడ్ తర్వాత అమ్మవారికి అన్ని రకాల ఆదాయం పెరిగింది. భక్తుల సంఖ్య కూడా పెరిగింది. ఆ దిశగా ఆదాయాన్ని మరింత పెంచుకుని దుర్గమ్మ ఆలయాన్ని అన్నిరంగాల్లో అభి వృద్ధి చేయాల్సిన అధికారులు కీలకమైన టెండర్ల వ్యవహారంలో చక్రం తిప్పుతూ కాంట్రాక్టర్‌లతో చేతులు కలుపుతున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి.
టోల్‌గేట్ ఆదాయానికి టెండర్
రాష్ట్రంలో అతిపెద్ద దేవాలయాల్లో ఒకటైన కనకదుర్గమ్మ అమ్మవారి కొండపైకి నిత్యం వందలాది వాహనాల్లో భక్తులు వస్తుంటారు. అందుకు సంబంధించి కొండ కింద వినాయక స్వామి గుడి సమీపంలో టోల్‌గేట్‌ను ఏర్పాటు చేశారు. ప్రైవేటు ఏజె న్సీకి అప్పగించిన టోల్‌గేట్‌కు సంబంధించి ప్రతీ ఏటా టెండర్లు నిర్వహించాలి. అయితే క్రమం తప్పకుండా ఆ పక్రియ జరుగుతున్నప్పటికీ చీరల వేలం తరహాలోనే టోల్‌గేట్ టెండర్‌లో నిబంధనలకు నీళ్లొదులుతున్నట్లు తెలుస్తోంది. గతంలో టోల్ గేట్ ద్వారా కొండ పైభాగంలో రూ.1.85 కోట్లు, కొండ కింద భాగంలో రూ.1.60 కోట్లు చొప్పున సుమారు రూ.3.45 కోట్ల ఆదాయం వచ్చేది. ఇటీవల రూ.1.60 కోట్లకే టెండర్ కట్టబెట్టినట్లు తెలుస్తోంది. ఈ వ్యవహారంలో పెద్ద ఎత్తున ముడుపులు చేతులు మారినట్లు విమర్శలు వినిపిస్తున్నాయి. అదేవిధంగా టెండర్ల విషయంతో పాటు ఉద్యోగుల నియామకం విషయంలో కూడా నిబంధనలకు విరుద్దంగా నిర్ణ యాలు తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. ఎలాంటి నోటిఫికేషన్ లేకుండా పదుల సం ఖ్యలో ఉద్యోగ నియామకాలు పూర్తి చేశారనే ఆరోపణలు బలంగా వినిపిస్తున్నాయి. ఉన్నతాధికారులు దీనిపై విచారణ నిర్వహిస్తే నిజాలు నిగ్గుతేలే అవకాశం లేకపోలేదు.
పవిత్రమైన అమ్మవారి కొండపై అధికారులు, పాలకమండలి సభ్యుల మధ్య అంతర్గత కుమ్ములాట నడుస్తున్నట్లు తెలు స్తోంది. ఏసీబీ దాడులతో పాటు ఇటీవల పాలకమండలికి చెందిన ఓ ప్రజాప్రతినిధి అమ్మవారి ఆలయానికి సంబంధించి కీల కంగా వ్యవహరిస్తున్న ఓ అధికారిపై ఏకంగా ప్రభుత్వానికి ఫిర్యాదు చేసినట్లు సమా చారం. ఆలయంలో చక్రం తిప్పుతున్న మరో అధికారికి ఉన్నతాధికారి వత్తాసు పలుకుతున్నారని, ఫలితంగానే అమ్మవారి గుడిలో అనేక అక్రమాలు చోటుచేసు కుంటున్నాయని పాలకమండలికి చెందిన ఒకరు దేవాదాయ శాఖకు కూడా ఫిర్యా దు చేసినట్లు చెబుతున్నారు. దీన్ని బట్టి చూస్తుంటే దుర్గమ్మ కొండపై ఆధిపత్య పోరు తీవ్ర స్థాయికి చేరినట్లు స్పష్టంగా కనిపిస్తోంది.