Friday, November 22, 2024

కరప్షన్‌ @ కరెక్షన్‌..!

ఉద్దేశ్యపూర్వకంగానా ? పొరపాటునా ? అన్న విషయాన్ని పక్కన బెడితే రెవెన్యూ శాఖ చేసిన తప్పిదాలకు రైతాంగం అనివార్యంగా మూల్యం చెల్లించుకుంటున్న దుస్థితి నెలకొంది విజ‌య‌న‌గ‌రం జిల్లాలో. అడంగల్‌లో సవరణ జరగాలంటే అధికార పార్టీకి తొత్తులైనా కావాలి.. నిర్భయంగా, నిస్సిగ్గుగా దోపిడీకి పాల్పడుతున్న రెవెన్యూ అధికారుల డిమాండ్లకు తలైనా వగ్గాలి. ఎవరు అవునన్నా..కాదన్నా.. బాధిత రైతాంగం నుంచి ఆవేదనాభరితంగా వినిపిస్తున్న మాట అయితే ఇదే..! అందుకు తగ్గట్టుగానే రెవెన్యూ రికార్డులు ఇష్టానికి మార్చేయాలంటే ‘విజయనగరం జిల్లా’ వల్లే సాధ్యమన్న ఘనకీర్తి రాష్ట్ర వ్యాప్తంగా పాకిందని, వినడానికే సిగ్గుగా వుందని సాక్షాత్తు సర్వోన్నతాధికారే ఇటీవల జరిగిన రెవెన్యూ అధికారుల సమీక్షలో పేర్కొన్న వైనం రెవెన్యూ గుసగుసలే చెప్పాయి. అదలా వుంచితే…తహశీల్దార్‌ కార్యాలయాలు అవినీతి,అక్రమాలకు అడ్డాలుగా మారడం వల్లనో? మరే ఇతర కారణాల వల్లనో తెలియదు గానీ గతంలో తహశీల్దార్‌ స్థాయిలో జరిగే పనులకు ఇపుడు ఆర్డీవో, జేసీల ప్రమేయం అనివార్యమైంది. ఇంతవరకు స్వాగతించదగ్గ అంశమే అయినప్పటికీ ఆ పనులు జరగడమే గగనం కావడం సమస్యాత్మకమైంది.

ఫాలో అప్‌ లేకపోతే పనులవ్వవు..సామాన్యులు ఆర్డీవో,జేసీ స్థాయి వారిని కలిసి పనులు చేయించుకోవాలంటే ఆ ఊహల్లో కూడా సాధ్యం కాదన్నది బాధిత రైతాంగం వేదన. అడంగల్‌ సవరణలు, యితరత్రా న్యాయపరమైన, ధర్మబద్ధమైన అవసరమైన మార్పులు, చేర్పులకు సంబంధించి జిల్లా వ్యాప్తంగా ఎన్ని ఫైళ్లు అపరిష్కృతంగా వుండిపోయావో ప్రశ్నించిన నాధుడే లేకపోయాడు జిల్లాలో. అమాత్యులకు అసలు పట్టక పోగా పట్టించుకోవాల్సిన వారు తలకెక్కించుకునే పరిస్థితి లేనందునే జిల్లాలో భూఆక్రమణలు, రెవెన్యూ అధికారుల దోపిడీ పర్వాలు యథేచ్ఛగా సాగిపోతున్నాయని చెప్పవచ్చు.


అదలా వుంచితే… రెవెన్యూ శాఖ నిర్వహించే వెబ్‌ల్యాండ్‌లోకి 1998-99 సంవ త్సరంలో సర్వే నెంబర్‌ వారీగా డేటా నమోదు చేయడం జరిగింది. అప్పట్లో ప్రతీ మండలం నుండి పెద్దఎత్తున బృందాలుగా విడదీసి రాత్రి, పగలు డేటాను వెబ్‌ల్యాండ్‌లో నిక్షిప్తం చేసారు. అయితే సదరు నమోదు ప్రక్రియ అసంపూర్తిగా, తప్పులతడకగా..అంటే అడంగల్‌ పట్టీల్లో సర్వే నెంబర్‌ వదిలి వేయడం, విస్తీర్ణం, వివరణ, స్వభావం మొదలగు వాటిలో తప్పుగా నమోదు చేయడం తీవ్ర ఇబ్బందికరంగా మారింది. అలా వెబ్‌ల్యాండ్‌లో నమోదైన విస్తీర్ణం కార్యాలయాల్లో లభించే రెవెన్యూ రికార్డుల్లో నిక్షిప్తమైన విస్తీర్ణంతో సరిపోలదన్నది ప్రత్యేకించి చెప్పాల్సిన పని లేదు. ఈ విషయాన్ని గ్రహించిన రెవెన్యూ శాఖ గత 5 సంవత్సరాలుగా (పీవోఎల్‌ఆర్‌) భూ రికార్డుల స్వచ్ఛీకరణ కార్యక్రమాన్ని చేపట్టి, ఆ కార్యక్రమం ద్వారా వెబ్‌ ల్యాండ్‌లో నమోదైన అడంగల్‌ల్లో వివరాలు రికార్డులతో సరిపోలుతున్నాయా..? లేదా..? అనే విషయం పరిశీలించి అవసరమైతే వీఆర్‌వో,రెవెన్యూ ఇన్‌స్పెక్టర్‌, తహశీల్దార్‌లు వెబ్‌ ల్యాండ్‌లో మార్పులు చేసేందుకు వీలుండేది. అయితే.. అప్పట్లో ఆ పనులు చేయించుకోవడం కూడా ఫిర్యాదీదారులకు, బాధిత రైతాంగానికి తలకుమించిన భారమై సంబంధిత ఫైళ్లు సుదీర్ఘకాలంగా అపరిష్కృతంగానే మిగిలిపోయాయి. తహశీల్దార్‌ కార్యాలయాల్లో కంప్యూటర్‌ ఆపరేటర్లే రారాజులు కావడం చాలా మంది తహశీల్దార్లను సైతం శాసించే స్థాయిలో వుండడం వెరసి..తహశీల్దార్‌ కార్యాలయంలో పనులు అంటే ఆర్థిక భారంతో కూడుకున్నవిగా మారాయి.

- Advertisement -


వెబ్‌ ల్యాండ్‌లో నమోదైన తప్పుడు వివరాలను సవరణ చేయాలంటే తహశీల్దార్‌ తప్పనిసరిగా బయోమెట్రిక్‌ వెయ్యాలన్న నిబంధన వచ్చిన తర్వాత కొంత పరవాలేదనుకున్నప్పటికీ ఆ కథ కూడా కంచికే పోయినట్లయింది. ఏదోలా పనులు జరుగుతున్నాయనుకున్న తరుణంలోవెబ్‌ ల్యాండ్‌ సాఫ్ట్‌వేర్‌ (అప్డేషన్‌) ఉన్నతీకరణ పేరుతో గత 8 నెలల నుండి మ్యుటేషన్‌, అడంగల్‌ల్లో సవరణ తదితర విషయాల్లో భారీ మార్పులు చేసారు. దీనివలన కొన్నాళ్లపాటు మ్యుటేషన్‌, అడంగల్‌ సవరణ అన్నవి జరగనే లేదు. అయితే ప్రస్తుతం వెబ్‌ ల్యాండ్‌, అడంగల్‌ల్లో తప్పుగా నమోదైన వివరాలను సవరణ చేయాలంటే సదరు కాలమ్‌లను బట్టి వాటిని ఆర్డీవో, జేసీలకు సవరణ అధికారాన్ని బదలాయించారు. ఆనేపథ్యంలో అడంగల్‌లో విస్తీర్ణం తప్పుగా( అనగా ఎక్కువ/ తక్కువగా) నమోదైతే సదరు సవరణపై ఆర్డీవోకు, అలాగే భూ వివరణ , జిరాయితీ / ప్రభుత్వ భూమి మొదలగు విషయాలపై జేసీకి నిర్ణయాలు చేయాల్సి వుంది. అయితే, పని ఒత్తిడి వల్లనో? ఏమో? తెలియదు గానీ వారి వద్ద కూడా ప్రతీ మండలం నుండి అడంగల్‌ సవరణలకు వందల సంఖ్యలో దరఖాస్తులు పెండింగ్‌లో ఉన్నట్లు పరిస్థితులు చాటిచెబుతున్నాయి. కొంత మంది ఆర్డీవో కార్యాలయ సిబ్బంది వసూళ్లకు పాల్పడి మరీ ఫైళ్లకు మోక్షం కలిగించడం లేదని, అసలు ఆర్డీవో టేబుల్‌పైకి ఫైలు పంపించడానికి కూడా ఒక రేట్‌ నిర్ణయించారని పలువురు ఆరోపిస్తున్నారు.


మొన్నటి వరకు మ్యుటేషన్‌ ప్రక్రియను నిర్ణీత కాలపరిమితిలోగా పూర్తి చేయాలనే నిబంధన ఉండేది. ఆ కాలపరిమితిలోగా నిర్ణయం తీసుకోకపోతే ఆటోమెటిగ్గా మ్యుటేష‌న్ జరిగిపోయేది.. ఆనేపథ్యంలో సిబ్బంది ఏ మ్యుటేష‌న్‌ ఫైళ్లను కాలపరిమితిలోగా ఆమోదించడమో.. తిరస్కరించడమో చేసేవారు. కానీ సదరు ఆటో మ్యుటేషన్‌ కాలపరిమితి వెబ్‌ ల్యాండ్‌ నుండి తొలగించిన తరువాత భారీ స్థాయిలో మ్యుటేషన్‌ ఫైళ్లు కూడా పేరుకుపోయిన పరిస్థితి. మొత్తం మీద రెవెన్యూలో కరప్షన్‌ లేకుంటే కరెక్షన్‌ కావడం లేదన్న ఆరోపణలు గట్టిగానే వినిపిస్తున్నాయి.

Advertisement

తాజా వార్తలు

Advertisement