అమరావతి, ఆంధ్రప్రభ బ్యూరో: విధి నిర్వహణలో అక్రమాలకు పాల్పడ్డ వారిపై కొరడా ఝుళిపించాల్సిన జిల్లా స్థాయి అధికారులే కిందిస్థాయి ఉద్యోగులను తప్పుచేసేలా ప్రోత్సహిస్తున్నారు. ఈ ప్రక్రియలో పెద్ద ఎత్తున డబ్బులు చేతులు మారుతున్నాయి. కిందిస్థాయి ఉద్యోగులు తమ చేతివాటాన్ని ప్రదర్శించి దొడ్డిదారిన దోచుకున్న డబ్బులో సగ భాగంపైగా జిల్లా స్థాయి అధికారులకు సమర్పిస్తు న్నారు. వారు చేసిన అక్రమాలు ఏదో ఒక సందర్భంలో బయట పడటంతో వారిపై సస్పెన్షన్ వేటు పడుతుంది.
అందుకు కారణమైన జిల్లాస్థాయి అధికారులను వదిలేసి కిందిస్థాయి ఉద్యోగులను బలిపశువులు చేస్తున్నారు. అయితే, వారి సస్పెన్షన్ ఎత్తివేసి తిరిగి విధుల్లో చేరే సందర్భంలోనూ అక్రమాలను ప్రోత్సహిస్తున్న జిల్లా అధికారులకు చేయి తడపాల్సిందే. లేదంటే వారి తప్పిదాలపై రాష్ట్రస్థాయి అధికారులకు పదే పదే ఫిర్యాదులు చేయడంతోపాటు తమకున్న అధికారాన్ని ఉపయోగించి సస్పెండ్ అయిన ఉద్యోగులకు ఇంక్రిమెంట్లు కూడా కట్ చేస్తున్నారు. మరికొన్ని సందర్భాల్లో సుదూర ప్రాంతాలకు బదిలీ చేస్తున్నారు. అవన్నీ చేయకుండా ఉండాలంటే అధికారులకు గతంలో దోచుకున్న దాంట్లో ఎంతోకొంత రెండోసారి సమర్పించుకోవాలి. లేదంటే ఆఉద్యోగిని ముప్పుతిప్పలు పెట్టి మూడు చెరువులు నీరు తాగిస్తుంటారు. ఇది.. రాష్ట్రంలోని వివిధ జిల్లాల పరిధిలో స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్స్ శాఖ జిల్లా కార్యాలయాల్లో జరుగుతున్న దందా. ఆ శాఖ ఉన్నతాధికారుల తీరుపై అదే శాఖకు చెందిన కిందిస్థాయి ఉద్యోగులు మానసికంగా ఆందోళనకు గురవ్వాల్సిన పరిస్థితులు ఎదురువుతున్నాయంటూ ఆవేదన వ్యక్తంచేస్తున్నారు.
సస్పెన్షన్ ఎత్తివేసినా .. పోస్టింగ్ కోసం పైసలివ్వాల్సిందే
రాష్ట్రంలో ప్రభుత్వానికి అత్యధికంగా ఆదాయాన్ని అందించే శాఖల్లో స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్స్ శాఖ మొదటి వరుసలో ఉంటుంది. ఇదే సందర్భంలో ఆ శాఖలో పనిచేసే ఉన్నతస్థాయి అధికారి నుండి కిందిస్థాయి ఉద్యోగి వరకూ కూడా ఆదాయంలోనూ, అక్రమార్జనలోనూ అగ్రస్థానంలోనే ఉంటూ ఉంటారు. ఆయా సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల పరిధిలో చిన్న రిజిస్ట్రేషన్ జరిగినా నిబంధనల మేరకు అన్ని డాక్యుమెంట్లు ఉన్నప్పటికీ పర్సంటేజీల రూపంలో కొంత మొత్తం ముట్టజెప్పాల్సిందే. ఈ విధానానికి 70 శాతం మందికిపైగా ప్రజలు కూడా దాదాపుగా అలవాటు పడిపోయారు. అధికారులకు ముడుపులు ఇవ్వడం కొంత భారంగానే ఉన్నప్పటికీ ఆస్తుల అమ్మకాలు, కొనుగోలుకు సంబంధించి ఎక్కడా ఆటంకాలు ఏర్పడతాయోనన్న భయంతో వారడిగిన మామూళ్లు ఇచ్చేస్తూ తమ పనులను ప్రజలు పూర్తి చేసుకుంటున్నారు. అందులో భాగంగానే కొంత మంది సబ్ రిజిస్ట్రార్లు, సీనియర్ అసిస్టెంట్లు నిబంధనలు పూర్తిగా తుంగలో తొక్కి అక్రమార్కులతో చేతులు కలిపి ప్రభుత్వ భూములు కూడా రిజిస్ట్రేషన్లు చేస్తున్నారు. మరికొన్ని సందర్భాల్లో ఆక్రమించుకున్న భూములను కూడా హక్కుదారులుగా చేస్తూ వారికి అధికారికంగా హక్కు కల్పించేలా రిజిస్ట్రేషన్లు చేస్తున్నారు. ఇటువంటి అక్రమాలపై పెద్ద ఎత్తున ఫిర్యాదులు రావడం, రాష్ట్రస్థాయి అధికారులు విచారించి పలువురు ఉద్యోగులను విధుల నుండి తొలగిస్తున్నారు. ఆరు నెలల సస్పెన్షన్ తరువాత తిరిగి వారిని విధుల్లోకి తీసుకోవాలంటూ జిల్లా రిజిస్ట్రార్, డీఐజీలకు మామూళ్లు సమర్పించాల్సిందే. లేదంటే సస్పెన్షన్ ఎత్తివేసినా కూడా వివిధ కారణాలు కుంటిసాకుగా చూపుతూ వారికి పోస్టింగులు ఇవ్వడంలో తీవ్ర జాప్యం చేస్తున్నారు. కొన్ని సందర్భాల్లో తప్పు చేయని సిబ్బంది కూడా బలికావల్సి వస్తుంది.
నెల్లూరులో ఆగని అక్రమాలు
పారిశ్రామిక వాడగా శరవేగంగా అభివృద్ధి చెందుతున్న నెల్లూరు జిల్లా పరిధిలో భూముల ధరలకు అమాంతంగా రెక్కలొస్తున్నాయి. దీంతో భూముల కొనుగోలు, అమ్మకాలు మరింత పెరిగాయి. ఒక్కోసబ్ రిజిస్ట్రార్ కార్యాలయం పరిధిలో రోజుకు సగటున 50 నుండి 100 రిజిస్ట్రేషన్లు జరుగుతున్నాయంటే జిల్లాలో ఏ స్థాయిలో క్రయ, విక్రయాలు సాగుతున్నాయో ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. జిల్లా పరిధిలోని కావలి, ఉదయగిరి, నెల్లూరు – 1, 2 సబ్ రిజిస్ట్రార్ఒ కార్యాలయాల పరిధిలో పెద్ద ఎత్తున అక్రమాలు కూడా చోటుచేసుకుంటున్నాయి. అయితే, ఆ అక్రమాలను జిల్లా స్థాయి అధికారులు దగ్గరుండి ప్రోత్సహిస్తున్నట్లు సొంత శాఖ ఉద్యోగులే బహిరంగంగా వ్యాఖ్యానిస్తున్నారు. ఉదాహరణకు గత ఏడాది ఉదయగిరి సబ్‌రిజిస్ట్రార్ పరిధిలో సీతారాంపురం మండల కేంద్రానికి అత్యంత సమీపంలో 10 ఎకరాల ప్రభుత్వ భూమికి రిజిస్ట్రేషన్ చేశారు. ఈ వ్యవహారంపై అప్పట్లో పెద్ద ఎత్తున ఆరోపణలు రావడంతో విచారించిన రాష్ట్రస్థాయి అధికారులు అందుకు కారకులైన వారిపై చర్యలు తీసుకోవాలని నిర్ణయం తీసుకున్నారు. అయితే, తప్పుచేసిన వారిని వదిలేసి ఈ వ్యవహారంలో ఓ సీనియర్ అసిస్టెంట్‌ను బలిపశువును చేశారు. ఆరు నెలల తరువాత ఆయనకు తిరిగి పోస్టింగ్ ఇవ్వాల్సి ఉన్నప్పటికీ ఆ ప్రక్రియలో జిల్లా అధికారులు తీవ్ర జాప్యం చేశారు. ఎట్టకేలకు జిల్లా కేంద్రంలోనే ఆడిట్ విభాగంలో పోస్టింగ్ ఇచ్చినప్పటికీ ముడుపులు ఇవ్వాలంటూ ఆ ఉద్యోగిని ఓ ఉన్నతాధికారి వేధిస్తున్నట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. అడిగినంత ముడుపులు ఇవ్వలేదన్న కోపంతో ఆ ఉద్యోగికి సస్పెన్షన్ తరువాత రెండు ఇంక్రిమెంట్లను కూడా కట్ చేసినట్లు తెలుస్తుంది. అదే విధంగా గత రెండు నెలల క్రితం నెల్లూరులో సంచలనం సృష్టించిన నకిలీ రిజిస్ట్రేషన్ వ్యవహారంలో జిల్లా అధికారుల ప్రయమేం ఉన్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. అయితే ఓ సబ్ రిజిస్ట్రార్ నకిలీ రిజిస్ట్రేషన్ వ్యవహారాన్ని ఆలస్యంగా గుర్తించి స్వయంగా పోలీసులకు ఫిర్యాదు చేశారు. అయితే, ఈ వ్యవహారంలో తెరవెనుక జిల్లా అధికారులు కీలక పాత్ర పోషించినప్పటికీ వారిని వదిలేసి గత రెండు రోజుల క్రితం ఒక సబ్ రిజిస్ట్రార్ఒపై సస్పెన్షన్ వేటు వేశారు. అనంతపురం జిల్లాలోనూ ఇదే వ్యవహారం నడుస్తోంది.
ఉన్నతాధికారులు పట్టించుకోవాలంటున్న కిందిస్థాయి ఉద్యోగులు
జిల్లా స్థాయిలో అనేక అక్రమాలు జరుగుతున్నాయి. అందులో క్షేత్రస్థాయి ఉద్యోగుల కంటే జిల్లా స్థాయి అధికారుల పాత్రే ఎక్కువగా కనిపిస్తుంది. విచారణలోనూ అనేక సందర్భాల్లో వారి వ్యవహారమే బయట పడింది. అయితే, రాష్ట్రస్థాయి అధికారులు విచారణకు వచ్చిన సందర్భంలో జిల్లా స్థాయి అధికారులు ఇచ్చే నివేదికలను ఆధారంగా చేసుకుని సబ్ రిజిస్ట్రార్లు, సీనియర్ అసిస్టెంట్లు ఇతర సిబ్బందిపై చర్యలు తీసుకుంటున్నారు. వాస్తవానికి ఉద్యోగుల అక్రమాలను ప్రోత్సహిస్తుంది జిల్లా స్థాయిలో డీఆర్లు, డీఐజీలే. రాష్ట్రస్థాయి అధికారులు ఆదిశగా జిల్లా ఉన్నతాధికారుల వ్యవహారశైలిపై నిఘా పెట్టాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఇదే అంశాన్ని ఆశాఖలోని ఉద్యోగులు రాష్ట్రస్థాయి ఉన్నతాధికారులను కోరుతున్నారు.